వామ్మో..పాము!

4 Jul, 2020 11:27 IST|Sakshi

వర్షాకాలంలో కాటేస్తున్న సర్పాలు 

ఏటా 90 మందికి పైగా బాధితులు 

పీహెచ్‌సీల్లో అందుబాటులో మందులు 

సమయానికి ఆసుపత్రికి వెళ్లాలి

నాటు వైద్యంతో ప్రాణహాని 

కర్నూలు(హాస్పిటల్‌): వర్షాకాలం ప్రారంభమైంది. జిల్లాలో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు భూమిలో ఉన్న వేడి ఆవిరి రూపంలో బయటకు వస్తోంది. ఈ క్రమంలో భూమి పొరల్లో ఉండే క్రిమికీటకాలు బయటకు వస్తాయి. తెలిసీతెలియక వాటిని తాకిన వారిని అవి కాటేస్తాయి. ప్రతి యేడాది జూన్‌ మొదటి వారం నుంచి క్రిమికీటకాలు కాటేయడం మనం చూస్తుంటాం. అయితే అన్ని కీటకాలకు విషం ఉండదు. కేవలం కొన్ని రకాల విషసర్పాలు, తేళ్లకు మాత్రమే తీవ్రమైన విషం ఉంటుంది. ఇవి కాటేసినప్పుడు కంగారుపడకుండా తగిన జాగ్రత్తలతో వైద్యం తీసుకుంటే సురక్షితంగా బయటపడవచ్చని చెబుతున్నారు వైద్యులు.

గత ఐదేళ్ల కాలంలో జిల్లాలో వర్షాలు పెద్దగా కురియలేదు. కొన్ని సంవత్సరాలు తీవ్ర వర్షాభావం నెలకొంది. అయితే గత ఏడాది నుంచి వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఈ యేడాది జూన్‌ ఒకటో తేదీ నుంచే వర్షాలు కురుస్తున్నాయి. తొలకరి వర్షాలకు భూమిలో దాగున్న విష సర్పాలు, తేళ్లు, కీటకాలు బయటకు వస్తున్నాయి. ఆదమరిచి ఉన్న వారిని ఇవి కాటేస్తున్నాయి. ఈ కారణంగా జిల్లాలో పాముకాట్లు, విష పురుగుల కాట్లకు గురై ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఒక ఏరియా ఆసుపత్రి, ఒక జిల్లా ఆసుపత్రి, ఒక బోధనాసుపత్రి ఉన్నాయి. జిల్లా మొత్తంగా ఇప్పటి వరకు ఆయా ఆసుపత్రులకు నెలరోజుల నుంచి 60కి పైగా పాము, తేలు కాట్లు, ఇతర కీటకాల కాట్లతో చికిత్స కోసం వచ్చారు. ఇందులో కేవలం ముగ్గురు, నలుగురు మాత్రమే మరణించారు. వర్షాలు కరుస్తున్న కారణంగా ఇంటి పరిసరాల్లోని ఖాళీ స్థలాల్లో పొదలు పెరగడం వల్ల విషపురుగుల సంచారం అధికమైంది. ఒక్కోసారి అవి ఇళ్లల్లోకి రావడంతో పాము కాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది.  

పాము కరవగానే ఏం చేయాలంటే..
పాము కరవగానే భయాందోళనకు గురిగాకుండా ధైర్యంగా ఉండాలి. బంధుమిత్రులు కూడా వారికి ధైర్యం చెప్పాలి.  
పక్కనున్న వారు ఆ పాము విషసర్పమో కాదో గుర్తించే ప్రయత్నం చేయాలి. దానివల్ల చికిత్స మరింత కచ్చితంగా అందజేయవచ్చు. 
నాటు వైద్యం, మంత్రతంత్రాల జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత తొందరగా దగ్గరలోని ఆసుపత్రికి రోగిని నడిపించకుండా తీసుకెళ్లాలి.  
పాముకాటు వేయగానే కొందరు ఆ గాయాన్ని మరింతగా కోస్తే రక్తంతోపాటు విషం వచ్చేస్తుందని కత్తితో, బ్లేడుతో గాటు పెడతారు. అలా చేయవద్దు. ఒక్కోసారి పాముకాటు కన్నా ఈ గాయం ప్రమాదకరంగా మారవచ్చు. శాస్త్రీయమైన చికిత్స సాధ్యమైనంత త్వరగా అందించడమే ఉత్తమం.  
మరికొందరు పాము కరిచిన ప్రదేశంలో గాటుపెట్టి నోటితో విషం పీల్చేస్తామంటారు. పాముకాటు వేయగానే విషం రక్తంలో ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు, గుండెకు చేరుకుంటుంది. కాబట్టి దీనివల్ల ప్రయోజనం ఉండదు. ఒక్కోసారి హాని కలగవచ్చు కూడా.   

అన్ని పాముల్లో విషముండదు 
పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. త్రాచు, కట్ల పాముల వంటి 15 శాతంసర్పజాతులతోనే ప్రమాదం ఉంటుంది.  
అన్ని పాముకాట్లు ప్రమాదకరమైనవి కాకపోవచ్చు. సాధారణంగా 50 శాతం పాముకాట్లు విషంలేని, ప్రమాదంలేని మామూలు గాయాలే. వీటికి  సాధారణ చికిత్స తీసుకుంటే చాలు. 
పాము కాటు వేయగానే చాలా మంది షాక్‌కు గురవుతారు. ఆ పాముకు విషం లేకపోయినా వారు షాక్‌కు గురికావడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వారికి ఇంట్లోని వారు, ఇరుగుపొరుగు వారు ధైర్యం చెప్పాలి.  

ఇటీవల పాము, తేలు కాట్ల వివరాలు 
 పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామంలో గత సోమవారం రాత్రి పాముకాటుతో కురవ లింగన్న(65), అతని కుమార్తె చిన్న మహాదేవి(18) మృతి చెందారు. గుడిసెలో నిద్రిస్తుండగా వీరిని పాము కాటు వేసింది.    
కౌతాళం మండల పరిధిలోని హల్వి గ్రామంలో గత శనివారం పాము కాటుతో  ప్రియ(3) అనే చిన్నారి మృతి చెందింది. ఇంటి ముందు నిద్రిస్తుండగా తెల్లవారుజామున పాము కాటు వేసింది.  
ఆస్పరికి చెందిన లక్ష్మీనారాయణ(20) గత నెల 15వ తేదిన కూలీ పనులకు వెళ్లగా తేలు కాటు వేసింది. ఆస్పరిలో ప్రథమ చికిత్స చేయించుకుని మెరుగైన వైద్యం కోసం ఆదోనిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గత సోమవారం మృతి చెందాడు.  
పత్తికొండ మండల పరిధిలోని హోసూరు గ్రామానికి చెందిన సుభాష్‌చంద్ర(34) గతనెల 5వ తేదీన తన పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా తేలు కాటు వేసింది. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగానే విషప్రభావం అధికమై మృతి చెందాడు.  

విధిలేని పరిస్థితుల్లోనే కాటు 
పాము తన ఆత్మరక్షణ కోసం విధిలేని పరిస్థితుల్లో మాత్రమే ఎదుట ఉన్న వ్యక్తిని కాటు వేస్తుంది. పాము బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ పాము కరిస్తే తక్షణమే సమీప ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. అలాకాకుండా నాటు వైద్యం తీసుకుంటే చికిత్స ఆలస్యమై ప్రాణానికి ప్రమాదం ఏర్పడవచ్చు.  

పాములుండే ప్రదేశాలు..
ధాన్యపు గాదెలు, గడ్డివాములు ఉండే చోట ఎలుకలు తిరుగుతుంటాయి. తడిగా ఉండే చోట కప్పలు చేరతాయి. వాటిని తినేందుకు పాములు వస్తాయి.  
దుంగలు, కట్టెలు కదిలించినప్పుడు వాటి మధ్యలో పాములు, తేళ్లు ఉండే ప్రమాదం ఉంది. పిడకల మధ్య కూడా విష పురుగులు చేరతాయి.  
ముఖ్యంగా రాత్రిపూట పొలాల్లో మోటారు వేయడానికి, నీరు పెట్టడానికి వెళ్లేటప్పుడు విధిగా టార్చిలైట్‌ ఉపయోగించాలి. ఒక్కోసారి మోటార్‌òÙడ్‌లో, స్టార్టర్‌ దగ్గర గూడు లాంటి ప్రదేశాల్లో పాములు నక్కి ఉండొచ్చు.  
చేలగట్ల వెంబడి కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది. కిర్రుచెప్పులతో పాము కాటు ప్రమాదం తప్పుతుంది.
 

విషసర్పం కాటు..లక్షణాలు 
కాటు సమయంలో బాధితుడి శరీరంలోకి ఎక్కిన విషం పరిణామం బట్టి కూడా ప్రమాదం స్థాయి ఉంటుంది.  
సాధారణ త్రాచు విష ప్రభావం కొంత వ్యవధి తీసుకుంటుంది.  
నల్లత్రాచు(కింగ్‌కోబ్రా) విషంప్రభావం చాలా త్వరగా కనిపించి ప్రాణాంతకంగా ఉంటుంది.  
కట్లపాము కాటు బాధ ఒకరకమైతే, రక్తపింజర విష లక్షణాలు మరో రకంగా ఉంటాయి. 
కాటు వేసిన ప్రదేశంలో పాము కోరల గాయం స్పష్టంగా కనిపించి, నొప్పి తీవ్రంగా ఉంటుంది.  
నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది.  
పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు గొంతులో ఏదీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు, చొంగకారవచ్చు.  
కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు.  
బాధితునికి సాధ్యమైనంత త్వరగా చికిత్స అందించకపోతే పరిస్థితి విషమించవచ్చు.  
విషం విరుగుడు ఇంజక్షన్‌ రూపంలో త్వరగా పనిచేస్తుంది.  
బాధితునికి ఆందోళన, షాక్‌ కారణంగా తలెత్తే ఇతర సమస్యలు సమర్ధవంతంగా నివారింవచ్చు.  
సెలైన్‌ రూపంలో శక్తిని ఇస్తూ, చికిత్స మరింత మెరుగై అందించవచ్చు.  
పాముకాటు గాయానికి తగు చికిత్స చేయడం ద్వారా ఇతర ఇబ్బందులు లేకుండా చేయవచ్చు.  
చికిత్స ఆలస్యం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే మెడికో లీగల్‌ కేసుగా అధికారికంగా నమోదై ఆపద్బంధు పథకం కింద పరిహారం లభించవచ్చు.   

మందులున్నాయి 
వర్షాకాలంలో రైతులు పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో వారు తరచూ పాము, తేలు కాటుకు గురవుతుంటారు. ఇలాంటి వారికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటి స్నేక్‌ వీనమ్‌(ఏఎస్‌వి) అందుబాటులో ఉంచాము. పాము, తేలు కాటు వేయగానే ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలి. త్వరగా గుర్తించి సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.  
–డాక్టర్‌ వెంకటరమణ, అడిషనల్‌ డీఎంహెచ్‌వో, కర్నూలు     

మరిన్ని వార్తలు