సమస్యలకు రాం..రాం..

7 Jun, 2020 04:46 IST|Sakshi
కంచరాం గ్రామం వ్యూ

(వి.వి.దుర్గారావు, రాజాం) 
ఊరు పేరు కంచరాం. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరం. పెద్ద గ్రామం. జనాభా 5,200. సమస్యల పరిష్కారం స్ధానికంగానే జరగడం పట్ల గ్రామీణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉదయం 11 గంటలకు ’సాక్షి’  గ్రామంలో అడుగుపెట్టగానే వెంకటరమణ అనే ఆటో డ్రైవర్‌ ఎదురయ్యాడు. ఆయన్ని పలకరించగా... గతేడాది వాహన మిత్ర ద్వారా రూ. 10 వేలు నగదు సాయం అందిందని, ఇపుడు తాజాగా మరో రూ. పదివేలు ఇచ్చారని సంతోషంగా చెప్పాడు. అక్కడి నుంచి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వైపు వెళుతుండగా శ్యామలమ్మ అనే మహిళ కుళాయి వద్ద కనిపించింది. గతంలో గ్రామంలో నీటి ఎద్దడితో ఇబ్బంది పడేవాళ్లమని, ఇటీవల కుళాయిలకు  మరమ్మతులు చేయడంతో ఇబ్బంది తప్పిందన్నారు.

సృజనా విద్యాలయం పక్క రోడ్డుమీదుగా వస్తుండగా రామారావు అనే వృద్ధుడు కనిపించారు. గతంలో పింఛన్‌ కోసం మండల కేంద్రానికి వెళ్లి గంటలు తరబడి ఎదురు చూడాల్సి వచ్చేదన్నారు. ఇపుడు పరిస్ధితి పూర్తిగా మారిందన్నారు. ఇంటికే వచ్చి వలంటీర్లు పింఛన్‌ ఇస్తున్నారని సంతృప్తి వ్యక్తంచేశారు.  అప్పట్లో  ఏ పని కావాలన్నా ప్రజలు మండల కేంద్రానికి తిరగాల్సిన పరిస్థితి ఉండేది. అడంగల్‌ నిమిత్తం కష్టపడని రైతు లేడు. ధ్రువీకరణ పత్రాలు కావాలంటే కాళ్లరిగిపోయేవి. ఉపాధి జాబ్‌ కార్డు కావాలంటే సంవత్సరాలు గడిచిపోయేవి. విత్తనాల కోసం క్యూలో నిలబడి సొమ్మసిల్లి పోవాల్సిందే. ఈ సమస్యలు తప్పాయి. గ్రామంలోనే రెండు సచివాలయాలు వచ్చాయి. పుష్కలంగా ఉద్యోగులున్నారు. వలంటీర్ల సేవలు ఇంటి తలుపులు తడుతున్నాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఏ పత్రం కావాలన్నా ఉన్న ఊరిలోనే పనైపోతోంది. 

► గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎన్నో సమస్యలు. దాదాపు 20 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ప్రస్తుతం కాలనీలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు  నిర్మించారు. సచివాలయ వ్యవస్థ అమలులోకి వచ్చిన వెంటనే చిట్టి వీధిలో తాగునీటి ఇబ్బందిపై ఫిర్యాదు చేయగానే ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు.76 మంది అర్హులైన వారికి వృద్ధాప్య పింఛన్‌లు కొత్తగా ఇస్తున్నారు.   గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ ద్వారా పౌష్టికాహారం, విద్యార్థులకు గుడ్లు క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నారు. 

చేదోడుకు ఎంపికయ్యాను
టైలరింగ్‌ వృత్తిని చేస్తూ జీవనం సాగిస్తున్నా. గతంలో మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు జగనన్న చేదోడు పథకానికి నన్ను ఎంపిక చేశారు. నాకు రూ. 10 వేలు ఆర్ధిక సాయం రానుంది. మా వలంటీర్‌ వచ్చి  ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు జిరాక్స్‌లతో పాటు మా షాపు వివరాలు తీసుకెళ్లారు. నన్ను లబ్ధిదారునిగా గుర్తించారు. 
– అడపా ఆదినారాయణ

విత్తనాలు రావనే భయంపోయింది
గతంలో విత్తనాల కోసం మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద గంటల తరబడి క్యూలో ఉండేవాళ్లం. ఇప్పుడు ఈ సమస్య తప్పింది. అసలు విత్తనాలు వస్తాయో రావోనని భయపడేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. గ్రామంలో సచివాలయం వద్ద నా ఆధార్‌ కార్డు ఆధారంగా విత్తనాలు అందించారు.  
– సామంతుల రాంబాబు, రైతు

మగ్గం కదులుతోంది
గతంలో పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బందులు పడేవాడిని. కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉండేది. గతేడాది నేతన్న నేస్తం ద్వారా రూ.24 వేలు అందాయి. వీటితో కొత్త పరికరాలు కొనుగోలు చేశాను. మా కుమారుడికి జగనన్న విద్యా దీవెన ద్వారా ఆర్ధిక సాయం అందింది.  
– బుట్టి కన్నారావు, చేనేత కార్మికుడు

మరిన్ని వార్తలు