ఉదర పోషణార్థం బహూకృత వేషం

24 Oct, 2017 13:04 IST|Sakshi

బతుకు భారమైందంటున్నబుడగ జంగాలు

తరతరాలుగా బుర్రకథలు, తంబురా కథలు, పగటి వేషాలే వృత్తి

ఆదరణ కరువై, అగచాట్లు పడుతున్న  కళాకారులు

సర్కారు చేయూతనివ్వడం లేదని ఆవేదన

రాజానగరం: ఒకప్పుడు పల్లెపట్టులకు పుష్కలంగా వినోదాన్ని పంచిన సామాజికవర్గం.. ఇప్పుడు జీవితాన్ని ఎలా నెట్టుకు రావాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. తమ కళా చాతుర్యంతో గ్రామీణులను ఆనందభరితులను చేసిన వారికి.. ఇప్పుడు కంచంలోకి అన్నం తెచ్చుకోవడమెలాగో తెలియడం లేదు. ముఖానికి పులుముకున్న రంగులతో, ఊరి వీధుల్లో నడయాడే హరివిల్లుల్లా కనిపించిన వారి బతుకు.. ఇప్పుడు వన్నెలు వెలిసిపోయిన చిత్రంలా వెలవెలబోతోంది. ‘ఉదర పోషణార్థం బహూకృత వేషం’ అన్నది నానుడి. ఇప్పుడు ఏ వేషం వేసినా కడుపు నింపుకోవడానికి కటకటలాడే దుస్థితి పగటి వేషగాళ్లది.

రాష్ట్రంలో బుడగ జంగాలకు వృత్తిపరంగా ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించక కుటుంబ పోషణ కోసం నానా అవస్థలు పడుతున్నారు. బుడబుక్కలోళ్లుగా పిలువబడే వీరు బుర్రకథలు, తంబురా కథలు చెపుతూ, దసరా, సంక్రాంతి, దీపావళి వంటి పండుగ సమయాల్లో పగటి వేషాలు వేస్తూ జీవనోపాధిని పొందుతుంటారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్థనారీశ్వరుడు, భీముడు, ఆంజనేయుడు, శక్తి వంటి వేషాలు వేస్తుంటారు. మిగిలిన సమయాల్లో ఆలయాల్లో భజనలకు వెళ్తుంటారు. ఇప్పుడూ ఆ వేషాలు వేసి రక్తి కట్టిస్తున్నా.. భుక్తిని సంపాదించుకోవడమే కష్టతరమవుతోంది.

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది, అరచేతిలోని స్మార్ట్‌ఫోనే వినోదాల సునామీకి వేదికగా మారింది. వీధి నాటకాలు కనుమరుగైపోయే పరిణామమే కాదు.. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే రోజులే గత కాలపు ముచ్చటయ్యే పరిస్థితి పొంచి ఉన్న రోజులివి. ఇక పగటి వేషాల దుర్గతి చెప్పేదేముంది! అయితే తాత ముత్తాతల నుంచి వస్తున్న వృత్తిని వదులుకోలేక, కాలం తెచ్చిపెట్టే మార్పులకు తగ్గట్టు మారలేక నలిగిపోతూనే.. కాలం నెట్టుకొస్తున్నామంటున్నారు బుడగజంగాల పెద్దలు.  అయితే ఈ కళ తమతోనే ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయని, తరువాత తరాలు ఈ వృత్తిని కొనసాగించడానికి ఇష్టపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో పగటి వేషాలు వేస్తూ సంచరిస్తున్న వీరు పలకరించిన ‘సాక్షి’తో తమ మనోగతాన్ని, మనోవేదనను పంచుకున్నారు. తమది ప్రాచీన కళ అని, పూర్వం రాజులు పోషించేవారని, ఆ తరువాత తమ తండ్రుల వరకు జమీందార్లు, భూస్వాములు,  పెద్దలు సహకరించారన్నారు. ప్రస్తుత కాలంలో ఈ కళలను పోషించేవారు లేరన్నారు. నేటి తరం వారికి తమ ప్రత్యేకత గురించి తెలియడం లేదని, చెప్పినా అర్థం చేసుకునే తీరుబడి వారికి ఉండటం లేదని నిట్టూర్చారు.

యువతరం విముఖత
తమ పిల్లలు చదువుకుంటూ తమలా పగటి వేషాలు వేసేందుకు ఇష్టం చూపడం లేదన్నారు. ఇంటర్, 10వ తరగతి చదువుతున్న తన ఇద్దరు పిల్లలు అప్పుడప్పుడూ వారి విద్యాసంస్థల్లో కార్యక్రమాలు జరిగితే ప్రదర్శనలు ఇస్తుంటారని, బయటకు వచ్చి వేషాలు వేయడానికి ఆసక్తి చూపడం లేదని ఓ కళాకారుడు చెప్పారు. వారిలో కూడా కళాభిమానం ఉన్నా స్టేజ్‌ ప్రోగ్రామ్‌ల వరకే ఆసక్తిని చూపిస్తున్నారన్నారు.  

ప్రభుత్వ ప్రోత్సాహం అంతంత మాత్రమే..
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రాజధాని హైదరాబాద్‌లో ఎక్కువగా ప్రోగ్రామ్‌లు చేయడానికి అవకాశం ఉండేది. విభజన తరువాత మన రాష్ట్రంలో ఆ విధమైన ప్రోత్సాహం లేదు. తెలంగాణాలో మనల్ని అడుగుపెట్టనివ్వడం లేదు. అక్కడ రవీంద్రభారతిలో తరచు ప్రోగ్రామ్‌లు జరిగేవి. ఇప్పుడు తెలంగాణా వారే చేస్తుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం చేయడానికి మాత్రం ఏడాదిలో ఒకటి రెండు అవకాశాలు ప్రభుత్వపరంగా లభిస్తున్నాయి. సమాచారశాఖ, పర్యాటకశాఖ, డీఆర్‌డీఏల నుంచి ఈ విధమైన కార్యక్రమాలు ఎక్కువగా...ఏజెన్సీ ప్రాంతాలలో డెంగ్యూ, మలేరియా, జ్వరాలు, మూఢనమ్మకాల వంటి వాటి పైన, కాలుష్యాలు, కరెంటు కోతలు, స్వచ్ఛభారత్‌ మొదలైన కార్యక్రమాల  పైన ఉంటాయి. అంతేతప్ప కళాకారుల అభ్యున్నతికి, కళల ఆదరణకు ప్రభుత్వపరంగా ఎటువంటి ప్రోత్సాహం ఉండటం లేదు.  –మిరియాల ప్రసాద్, శాటిలైట్‌ సిటీ, రాజమహేంద్రవరం

రాష్ట్ర విభజనతో నష్టపోతున్నాం..
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో పర్యాటక శాఖ ద్వారా మన రాష్ట్రంలోనే కాక కర్నాటక, తమిళనాడు, కేరళ, ఒరిస్సాలకు తీసుకువెళ్లడం, అక్కడి వారిని ఇక్కడకు తీసుకురావడం జరుగుతుండేది. అలాగే అండమాన్‌ కూడా తీసుకువెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఆ విధంగా శ్రద్ధ తీసుకునే పాలకులు లేరు. మేము యక్షగానం ప్రదర్శన కూడా ఇస్తుంటాం.  టీవీలలో బుర్రకథ, హరికథ, పగటి వేషాలు, జానపద గీతాలు చేస్తుంటాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రవీంద్రభారతిలో ఏడాదికి ఐదారు ప్రదర్శనలకు అవకాశం ఉండేది. విడిపోయిన తరువాత హైదరాబాద్‌ అంతా తెలంగాణా వారికే పరిమితం అయిపోయింది.    –మిరియాల గంగాధర్, శాటిలైట్‌సిటీ, రాజమహేంద్రవరం

మరిన్ని వార్తలు