ఓటమి దెబ్బకు ‘భూమా’ వర్గం చెల్లాచెదరు

7 Nov, 2019 10:49 IST|Sakshi

‘తమ్ముళ్ల’ ప్రత్యామ్నాయ బాట

రాజకీయాల్లోచెల్లని కాసుగా కోట్ల 

ముగిసిన కేఈ, మీనాక్షి రాజకీయ జీవితం

‘రెండు’ పడవలపై టీజీ కుటుంబ ప్రయాణం

తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? వరుస ఓటములతో పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన నేతలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారా? ఇప్పటికే కొందరు ఇతర రాజకీయ పార్టీలతో టచ్‌లోకి వెళ్లారా? 20 ఏళ్లుగా నాయకులకే దిక్కులేదు.. తమకేం భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలు కూడా పచ్చజెండాను వదిలేస్తున్నారా? జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే..ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. సార్వత్రిక సమరం తర్వాత నేతల వైఖరి, పార్టీ పరిస్థితి చూస్తే నాయకత్వ లేమితో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పాటు 20 ఏళ్లుగా జిల్లాలో పార్టీ పట్టు సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఇంకెన్నేళ్లు ‘సైకిల్‌’పై ప్రయాణం చేసినా రాజకీయ లక్ష్యాన్ని చేరుకోలేమని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. 

సాక్షి, కర్నూలు : రాయలసీమలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో కర్నూలు ఒకటి. వైఎస్సార్‌ జిల్లా తర్వాత అత్యంత బలమైన నాయకత్వం, కేడర్‌ ఆ పార్టీ సొంతం. ఇదే క్రమంలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉండే జిల్లాల్లో కూడా వైఎస్సార్‌ జిల్లా తర్వాత కర్నూలే! గత 20 ఏళ్ల ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే టీడీపీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా ఉందన్న విషయం స్పష్టమవుతోంది. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో గత నాలుగు ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా గెలిచింది 2009 ఎన్నికల్లో మాత్రమే. అది కూడా నాలుగు స్థానాలే. తక్కిన మూడు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఘోరపరాభవం ఎదురైంది. ఈ ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ పరిస్థితి అట్టడుగుకు చేరింది.

ఎన్నికల ఫలితాలు కొందరి రాజకీయ జీవితానికి ముగింపు పలకగా, మరికొందరు పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కోల్పోయి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. జిల్లాలో టీడీపీ ఈ స్థాయిలో దెబ్బతినడానికి కారణం ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో పాటు నేతల తప్పులు కూడా కన్పిస్తున్నాయి. ఎన్నికలు ముగిసి ఐదు నెలలు దాటినా ఇప్పటి వరకూ కొంతమంది నేతలు చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మరికొంతమంది పార్టీ వీడి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. భూమా, కేఈ, కోట్ల కుటుంబాలు పూర్తిగా బలహీనపడటం, టీజీ వెంకటేశ్‌ లాంటి వ్యక్తులు స్వార్థరాజకీయాలతో రెండు పడవలపై ప్రయాణం చేస్తుండడంతో టీడీపీ భవిష్యత్తు అంధకారంగా మారింది. 

విశ్వాసం కోల్పోయిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి జిల్లాలో రాజకీయంగా గౌరవం ఉండేది. అయితే.. ఇటీవలి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. ఈ పరిణామాన్ని కోట్ల వర్గంతో పాటు జిల్లా ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల్లో ప్రకాశ్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి సుజాతమ్మను కూడా ఘోరంగా ఓడించారు. వారు కనీసం కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగి ఉంటే గౌరవం ఉండేది. కానీ కొన్నేళ్లుగా వైరం నడిపిన కేఈ కుటుంబం ప్రయాణిస్తున్న ‘సైకిల్‌’లోనే వీరు ఎక్కడంతో ప్రజల విశ్వాసం కోల్పోయారు. ఆయన వర్గంగా ఉన్న వారు కూడా ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఇప్పుడు కోట్ల కుటుంబం రాజకీయంగా చెల్లని కాసైపోయిందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.   

బలహీనపడిన ‘భూమా’, కేఈ వర్గాలు 
జిల్లా టీడీపీలో కేఈ కృష్ణమూర్తి, భూమా నాగిరెడ్డి బలమైన నేతలుగా ఉండేవారు. భూమా మృతితో కార్యకర్తలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు సైతం ఇతర పార్టీల్లో చేరారు. ముఖ్యంగా భూమా స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డి... అఖిల ప్రియతో విభేదించి తనవర్గాన్ని దూరంగా ఉంచారు.  భూమా సోదరుడి కుమారుడు కిషోర్‌కుమార్‌రెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి కూడా అఖిలతో విభేదించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. భూమా కుటుంబానికి బంధువైన శివరామిరెడ్డి కూడా అఖిలతో విభేదించారు. క్రషర్‌ విషయంలో అఖిల భర్తకు, శివరామిరెడ్డికి తలెత్తిన వివాదంతో ఇరువర్గాల మధ్య దూరం పెరిగింది. కుటుంబసభ్యులే ఆమెకు దూరం కావడం, రాజకీయంగా పరిణతి లేకపోవడంతో పాటు కుటుంబం కూడా టీడీపీ నుంచి పీఆర్పీ, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ, ఆపై తిరిగి టీడీపీలో చేరడంతో  ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది.

మండల, గ్రామస్థాయి నేతలు కూడా వారికి దూరమవుతున్నారు. మరోవైపు ఎన్నికల ముందు టీడీపీలో చేరిన మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. ఈ పరిణామాలతో ఆళ్లగడ్డ, నంద్యాలలో టీడీపీ భవిష్యత్తు ఏంటో స్పష్టమవుతోంది. మరోవైపు మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి వయోభారంతో రాజకీయాల నుంచి నిష్క్రమించారు. గత ఐదేళ్లు టీడీపీలో కొనసాగినా, చంద్రబాబు కేఈకి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో తన కుమారుడిని కూడా టీడీపీని వీడి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్యాంబాబు పార్టీని వీడితే  కేఈ ప్రభాకర్‌ కూడా అదే దారిలో నడిచే అవకాశం ఉంది. ఇదే జరిగితే డోన్, పత్తికొండలో టీడీపీకి గడ్డుకాలమే. ఆదోనిలో మీనాక్షినాయుడుకు వయసైపోవడంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే!  

ఇతర నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి 
పాణ్యం నియోజకవర్గంలో గౌరు చరిత కుటుంబం టీడీపీలో చేరడాన్ని సొంత వర్గీయులే జీర్ణించుకోలేకపోయారు. గతంలో టీడీపీ వైఖరితోనే గౌరు కుటుంబం దెబ్బతింది. అదే పార్టీలో చేరడంతో కేడర్‌కు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో చరిత, వెంకటరెడ్డి కొట్టుమిట్టాడుతున్నారు. టీడీపీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు కూడా ముగుస్తుందని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి.. టీజీ ద్వారా బీజేపీలోకి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.  ఇక జిల్లా కేంద్రంలో టీజీ వెంకటేశ్‌ పరిస్థితి భిన్నంగా ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ తీర్థం పుచ్చుకునే టీజీ ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. తన కుమారుడిని మాత్రం టీడీపీలోనే కొనసాగిస్తున్నారు. వ్యాపార రంగంలో ఇబ్బంది లేకుండా ఉండేందుకే టీజీ బీజేపీలో చేరారనేది బహిరంగ సత్యం. తండ్రీ కొడుకుల ‘డబుల్‌గేమ్‌’తో బీజేపీ, టీడీపీ  ఇద్దరినీ విశ్వసించడం లేదు. ఇలా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ముందు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గస్థాయి నేతలు గత 20 ఏళ్ల ఫలితాలను బేరీజు వేసుకుని..మరో 20 ఏళ్లు టీడీపీతో ప్రయాణం చేసినా ఎమ్మెల్యేలం కాలేమని నిర్ధారణకు వస్తున్నారు. అందుకే ‘సైకిల్‌’ ప్రయాణాన్ని వీడి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.  

మరిన్ని వార్తలు