ఎంతో రుచిరా.. !

2 Oct, 2019 12:16 IST|Sakshi

పల్లవుల కాలం నుంచే ప్రసాదాల వితరణ 

భక్తులు, స్థానికుల ఆకలి తీర్చిన ఆలయ అన్నప్రసాదాలు

నాడు బూందీయే నేడు తిరుపతి లడ్డూ 

కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదాల్లో ఎవరికైనా గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదమే. స్వామివారికి లడ్డూతో పాటు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు. పూటకో ప్రసాదం చొప్పున నైవేద్యం సమర్పించే ప్రసాదాలు ఉన్నాయి. కనీస సౌకర్యాల్లేని రోజుల్లో ఈ అన్నప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చాయి. మూడువందలేళ్లుగా బూందీ, ఆ తర్వాత డెబ్బై ఏడేళ్లుగా లడ్డూ మాధుర్యం భక్తులకు అందుతోంది. పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర తిరుమల ఆలయంలో కొనసాగుతోంది. దీన్ని భక్తులు మహాప్రసాదంగా భావిస్తారు. కళ్లకు అద్దుకుని మరీ స్వీకరిస్తారు. 

సాక్షి, తిరుమల: తిరుమలలో మొదట పల్లవుల కాలం (క్రీ.శ.830) నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర. రెండో దేవరాయలు కాలం నుంచి ఈ ప్రసాదాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అప్పట్లో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేశారు. అప్పట్లోనే శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్య వేళలు) ఖరారయ్యాయట. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత సుఖీయం (క్రీ.శ.1445), అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం (క్రీ.శ.1468), మనోహరపడి (క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. 

వివిధ రకాల అన్నప్రసాదాలతో నైవేద్యం
తిరుమలేశుని ప్రసాదం అంటే కేవలం లడ్డూ, వడలే కాదు. నోరూరురించే దోసెలు, పోళి (పూర్ణం భక్ష్యాలు), జిలేబీ, తేనెతొల (మురుకు), సుఖియం (పూర్ణం కుడుములు), అప్పం, కేసరిబాత్, పాయసం, సీరా, దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి,  మిరియాలు పొంగలి.. స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన రకరకాల అన్న, పిండి ప్రసాదాలు భారీ రాగి, ఇత్తడి గంగాళాల్లో స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ తయారు చేసే ప్రసాదాలు రుచి, నాణ్యత ప్రపంచంలో మరెక్కడా లభించదంటే అతిశయోక్తి కాదు.

1803లో బూందీ.. 1940 నుంచి లడ్డూ 
ప్రసాదాల్లో వడ (నాడు అడ అని పిలిచేవారు) మాత్రమే ఎక్కువ రోజులు నిల్వ ఉండేది. దూరప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్‌ ఉండడంతో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 1803 నుంచి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. తొలి రోజుల్లో బూందీని విక్రయించేవారు. 1933లో టీటీడీ ఏర్పడిన తర్వాత ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. అప్పట్లో లడ్డూ ఇప్పటి కల్యాణోత్సవం లడ్డూ సైజులో ఉండేది. ధర ఎనిమిదణాలే. ఆ తర్వాత రూ.2, ఐదు, పది, పది హేను, ప్రస్తుతం 50 రూపాయలకు చేరింది. చాలా కాలంపాటు రూ.2కే విక్రయించేవారు.

ఆకలి తీర్చిన అన్నకూటోత్సవం
తిరుమలేశునికి ప్రతి గురువారం తిరుప్పావడ సేవ నిర్వహిస్తారు. పూర్వం నుంచే ఈ సేవను నిర్వహిస్తున్నారు. ఆ రోజు మూలమూర్తికి ఎదురుగా గరుడాళ్వార్‌ సన్నిధిలో అన్నరాశితో స్వామికి నైవేద్యం సమర్పించేవారు. ఈ ఆచారం నేటికీ అమల్లో ఉంది. పూర్వం స్వామికి సమర్పించిన ఆ అన్నరాశినే భక్తులకు పంచిపెట్టేవారు. అప్పట్లో తిరుమలలో పూటకూళ్లు తప్ప ప్రైవేట్‌ హోటళ్లు ఉండేవి కావు. అందుకే భక్తులు కూడా ఆలయ అన్నప్రసాదాలే ఆహా రంగా స్వీకరించేవారు. స్థానికంగా జీవించే కు టుంబాలు ఆలయంలో స్వామికి నైవేద్యంగా సమర్పించే అన్నరాశిపైనే ఆధారపడేవి. 

మార్కెట్‌ కొనుగోళ్లకు ఏటా రూ.350 కోట్ల ఖర్చు
∙తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాల అవసరాల కోసం టీటీడీ మొత్తంగా రూ.350 కోట్లు (2019–2020 బడ్జెట్‌ ప్రకారం) ఖర్చు చేస్తోంది. ప్రసాదాలు, లడ్డూలు, ఇతరత్రా ముడిసరుకుల కొనుగోళ్లకోసమే ఈ మొత్తాన్ని వినియోగిస్తున్నారు. లడ్డూ ప్రసాదాల అమ్మకం ద్వారా టీటీడీకి ఏటా రూ.200 కోట్లు (2019–2020 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రకారం) ఆదాయం సమకూరుతోంది.  

మాతృదద్దోజనమంటే మహాఇష్టం
సగం పగిలిన మట్టికుండలో సమర్పించిన మాతృ దద్దోజనమంటే స్వామికి మహా ఇష్టమట. గర్భాలయ మూలమూర్తికి అనేక రకాల అన్నప్రసాదాలు, పిండిపదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ఆచారం. కులశేఖరపడి దాటుకుని గర్భాలయంలో సమర్పించే ప్రసాదం చిక్కటి మీగడతోకూడిన ‘మాతృదద్దోజనం (మాత్ర)’మాత్రమే. అది కూడా సగం పగిలిన కొత్తమట్టి ఓడులోనే నైవేద్యంగా  సమర్పిస్తారు.

మరిన్ని వార్తలు