అలుపెరుగని యోధుడు

24 May, 2019 05:58 IST|Sakshi

‘నాయకత్వం వహించేటప్పుడు సేవకుడిగా ఉండండి... నిస్వార్థంగా ఉండండి... అనంత సహనం కలిగి ఉండండి... అంతిమంగా విజయం మీదే’ – స్వామి వివేకానంద

గొప్ప నాయకుడికి ఉండాల్సిన లక్షణాల గురించి స్వామి వివేకానంద చెప్పిన మాటలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదేళ్లుగా తన రాజకీయ ప్రస్థానంలో త్రికరణశుద్ధిగా ఆచరించి చూపారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఓ గొప్ప ముఖ్యమంత్రిగా చూసిన యువనేతగా వైఎస్‌ జగన్‌ దశాబ్దం క్రితం ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్సార్‌ మరణించిన తరువాత కూడా కోట్లాది మంది గుండెల్లో జీవించి ఉండటం ఆయనకు స్ఫూర్తినిచ్చింది. తానూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ధ్యేయంతో ప్రజాపథంలో సాగారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని దక్కించుకుందామన్న కొందరి సూచనలను తిరస్కరించి రాజకీయ విలువలు చాటారు.  కేంద్ర మంత్రి, సీఎం పదవులు ఇస్తామన్నా సరే తన స్వార్థం చూసుకోకుండా ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు అధికారాన్ని తృణప్రాయంగా త్యజించారు. రాజకీయ ప్రత్యర్థులు కుమ్మక్కై పన్నిన కుట్రలు, బనాయించిన అక్రమ కేసులను అత్యంత సహనంతో ఎదుర్కొన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ తనపై దుష్ప్రచారానికి దిగి 2014లో అధికారానికి దూరం చేసినా ప్రజాపథాన్ని వీడలేదు. రాష్ట్ర హక్కులు, ప్రజా సంక్షేమం కోసం ఉద్యమపథంలో సాగారు. తమ పార్టీ టికెట్లపై నెగ్గిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకుని రాజ్యాంగ విలువను అపహాస్యం చేసినా తాను మాత్రం ప్రజలనే నమ్ముకున్నారు. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి నేనున్నానని భరోసా ఇచ్చేందుకు చరిత్రాత్మక రీతిలో 3,648 కి.మీ. పాదయాత్ర చేశారు. రాజకీయ ప్రత్యర్థులు తనను అంతమొందించేందుకు యత్నించినా వెరవలేదు. లోపాయికారీ పొత్తుల కుట్రలకు బెదరలేదు. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం అజెండాగా పార్టీ మేనిఫెస్టోను రూపొందించి ప్రజాతీర్పు కోరారు. పదేళ్లుగా మొక్కవోని దీక్షతో సాగుతున్న జగన్‌కు రాష్ట్రం యావత్తూ జేజేలు పలికింది. ‘ప్రజలు ఆశీర్వదిస్తే సంక్షేమరాజ్యం స్థాపిస్తా’ అన్న జగన్‌కు పట్టాభిషేకం చేసింది. రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో రికార్డు సీట్లతో వైస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని అందించారు.  
– సాక్షి, అమరావతి

తొలి అడుగులు
అత్యంత ప్రజాదరణ కలిగిన తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్‌  తాను యువరాజు హోదా అనుభవించాలని ఏనాడు భావించలేదు. ఆ ఐదేళ్లలో కనీసం సెక్రటేరియట్‌లో కూడా అడుగు పెట్టలేదు. అధికార కేంద్రానికి దూరంగా బెంగళూరులో తన కుటుంబంతోనే ఉన్నారు. వైఎస్సార్‌ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయడానికి 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కడప ఎంపీగా పోటీ చేసిన జగన్‌ 1,78,846 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

తండ్రి మరణం
వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న హఠాన్మరణం చెందడం ఆ కుటుంబంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. వైఎస్సార్‌ అకాల మృతితో నాడు దాదాపుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా జగన్‌ సీఎం కావాలని కోరుతూ సంతకాలు చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వద్దామని కొందరు జగన్‌కు సూచించారు. తన తండ్రి రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చబోనని చెప్పి జగన్‌ రాజకీయ విలువలకు కట్టుబడ్డారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా అందుకు సమ్మతించ లేదు. 

ఓదార్పు యాత్ర 
ఇచ్చిన మాటకు కట్టుబడి తీరాలని జగన్‌ తీసుకున్న ఒక్క నిర్ణయం ఆయన గమనాన్ని, గమ్యాన్ని మార్చేసింది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేయాలని జగన్‌ నిర్ణయించుకుంటే అందుకు కాంగ్రెస్‌ అధిష్టానం ససేమిరా అంది. తన తల్లి, సోదరితో కలసి వెళ్లి ఓదార్పు యాత్రకు అనుమతించాలని కోరినా సోనియాగాంధీ సమ్మతించలేదు. పైగా తమ మాట వింటే కేంద్ర మంత్రిని చేస్తాం, కొన్నాళ్లకు  ముఖ్యమంత్రిని కూడా చేస్తామని చెప్పారు. తమ మాట వినకుంటే కష్టాలు తప్పవని హెచ్చరించారు. అధిష్టానం మాట వింటే పదవులు దక్కుతాయి. కానీ ప్రజలకు ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర చేస్తే ప్రభుత్వం వేధిస్తుంది, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇచ్చిన మాటకు కట్టుబడతారని పేరున్న  వైఎస్సార్‌ తనయుడిగా జగన్‌ తన తండ్రి బాటనే అనుసరించారు. ఓదార్పు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. వైఎస్సార్‌ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన 640 మంది అభిమానుల కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

పార్టీ ఆవిర్భావం
వైఎస్‌ జగన్‌  ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు నాడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని వీడారు. ఆ పార్టీ ద్వారా గెలిచిన కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే పదవులకు వైఎస్‌ జగన్, విజయమ్మ 2010లో రాజీనామాలు చేశారు. అనంతరం 2011 ఉప ఎన్నికల్లో  స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. వైఎస్‌ జగన్‌ ఏకంగా 5,45,672 ఓట్ల అఖండ మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. రాజన్న ఆశయాల సాధనే లక్ష్యంగా జగన్‌ 2011 మార్చి 12న వైఎస్సార్‌సీపీని స్థాపించారు. రైతుల సమస్యలు పరిష్కారించాలనే డిమాండ్‌తో అప్పటి రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తే ఎమ్మెల్యే పదవులకు అనర్హులమవుతామని తెలిసినప్పటికీ 17 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. వారిపై అనర్హత వేటు వేయడంతో 2012లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 15 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు  నెల్లూరు ఎంపీ స్థానంలో ఘన విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శక్తిగా ఆవిర్భవించింది. రాజన్న ఆశయాలను నీరుగార్చిన నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై జగన్‌ ప్రజా పోరాటాలు చేశారు. జలదీక్ష, రైతు దీక్ష, విద్యార్థి దీక్ష, చేనేత దీక్ష తదితర దీక్షలు, ధర్నాలతో ఉద్యమించారు. 

కక్షతో కేసులు.. బెయిల్‌ నిరాకరణ
తిరుగులేని ప్రజానేతగా ఆవిర్భవించిన వైఎస్‌ జగన్‌ను అడ్డుకునేందుకు అప్పటి అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించాయి. ఆయనపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాయి. అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. సహజ న్యాయసూత్రాల ప్రకారం మూడు నెలల్లో బెయిల్‌ రావాల్సి ఉండగా అధికార వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ  16 నెలలపాటు బెయిల్‌ రాకుండా అడ్డుకున్నారు. అయితే జగన్‌ ఏమాత్రం వెరవకుండా  ప్రజల కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. 

సమైక్య ఆంధ్ర ఉద్యమం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు వైఎస్‌ జగన్‌ సైద్ధాంతిక, రాజకీయ నిబద్ధత కనబరిచారు. తెలుగువారి అభివృద్ధి కోసం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాశారు. అన్ని పార్టీలూ విభజనకు అనుకూలంగా వ్యవహరించినా జగన్‌ 
ఒక్కడే సమైక్యాంధ్ర నినాదాన్ని బలంగా వినిపించారు. పార్లమెంట్‌లో తెలుగువారి ఆవేదనను వినిపించారు. అన్ని పార్టీలు రాజకీయ అవకాశవాదంతో వ్యవహరించగా జగన్‌ ఒక్కడే సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం చివరి వరకు పోరాడి రాష్ట్ర ప్రయోజనాలపట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. 

ప్రతిపక్ష నేతగా...
2014 ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మాణాత్మక పాత్ర పోషించారు. అసెంబ్లీ లోపల, బయట ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరితపించారు. టీడీపీ సర్కారు అవినీతి, అసమర్థ విధానాలపై పోరాడారు. రాజధాని పేరిట చంద్రబాబు ప్రభుత్వం సాగించిన భారీ భూ దోపిడీని పూర్తి ఆధారాలతో వెలుగులోకి తెచ్చారు. ఇసుక, మైనింగ్, మద్యం,  కాంట్రాక్టు మాఫియాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు. చంద్రబాబు, లోకేష్‌ అండతో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సాగిస్తున్న దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.  హుద్‌హుద్‌ తుపానుతోపాటు గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో భక్తుల దుర్మరణం, ఉద్దానం కిడ్నీ వ్యాధుల బాధితులు, సామాన్యుల ప్రాణాలు బలిగొంటున్న టీడీపీ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సిండికేట్‌ దందా... ఇలా ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా తానున్నానంటూ అండగా నిలిచారు. 

ఫిరాయింపులను ప్రోత్సహించినా..
రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు కుట్ర పన్నిన చంద్రబాబు వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. వీరిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. పార్టీ ఫిరాయిస్తే పదవులకు రాజీనామా చేయాలన్న నిబంధనను పాటించలేదు. నిబంధనల ప్రకారం ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న విజ్ఞప్తిని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పట్టించుకోలేదు. ఈ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌ సీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది. టీడీపీ ప్రజాప్రతినిధులు తమ పార్టీలో చేరేందుకు వస్తే పదవులకు రాజీనామా చేయాలని షరతు విధించి జగన్‌ రాజకీయ విలువలకు కట్టుబడ్డారు. 

ప్రత్యేక హోదా ఉద్యమం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ జగన్‌ చేసిన ఉద్యమం జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. హోదాతోపాటు విభజన హామీలన్నీ అమలు చేయాలని జగన్‌ 2014 నుంచి డిమాండ్‌ చేస్తూ వచ్చారు. కానీ సీఎం చంద్రబాబు తన స్వార్థ, అవినీతి రాజకీయాల కోసం హోదాను గాలికి వదిలేశారు. అవినీతి, కేసుల భయంతో ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే మేలని అడ్డగోలుగా వాదించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అడ్డుకునేందుకు పోలీసు బలాన్ని ప్రయోగించినా జగన్‌ వెరవకుండా ప్రజల తరఫున పోరాడారు. యువభేరీ సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేశారు. అమరావతి నుంచి ఢిల్లీ వరకు హోదా కోసం దీక్షలు చేశారు. రాష్ట్ర బంద్‌తోపాటు ధర్నాలు, ఆందోళనలు చేపట్టి ప్రత్యేక హోదా డిమాండ్‌ను సజీవంగా ఉంచారు. హోదా ఇవ్వనందుకు నిరసనగా తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. చంద్రబాబు ఎన్నికల భయంతో యూటర్న్‌ తీసుకుని హోదా కావాలని మాట మార్చినా ప్రజలు విశ్వసించలేదు. 

ప్రజా సంకల్ప యాత్ర
అవినీతి, అసమర్థత పాలనతో నష్టపోయిన రాష్ట్రం దశ, దిశను మార్చేందుకు వైఎస్‌ జగన్‌ చరిత్రాత్మక ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టారు. 2017 నవంబరు 6న ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించారు. 341 రోజులపాటు 3,648 కి.మీ. మేర పాదయాత్ర చేసి 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగించారు. 134 నియోజకవర్గాల మీదుగా సాగుతూ 2,516 గ్రామాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల పరిధిలో పాదయాత్ర చేశారు. 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొన్నారు. జగన్‌ పాదయాత్రకు రాష్ట్ర ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. 


హత్యాయత్నం
పాదయాత్రలో జగన్‌కు వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో ఆయన్ను అడ్డు తొలగించుకునేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్రలకు తెగించింది. ఏకంగా జగన్‌ను హత్య చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రపన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో 2018 అక్టోబరు 25న జగన్‌ను హతమార్చేందుకు పదునైన కత్తితో హత్యాయత్నం జరిగింది. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న జగన్‌ ప్రజాక్షేత్రంలో కొనసాగాలన్న తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ప్రజలకు అండగా నిలవడమే ధ్యేయంగా పాదయాత్రను కొనసాగించడం ఆయన దృఢ చిత్తానికి నిదర్శనం. 

ఒంటరి పోరాటం
అధికారంలోకి వచ్చేందుకు పొత్తులు పెట్టుకోవాలని కొందరు చేసిన సూచనలకు జగన్‌ సమ్మతించలేదు. తాను విశ్వసిస్తున్న రీతిలో రాజన్న ఆశయాలను సాధించేందుకు ఒంటరిగానే పోటీ చేసి ప్రజామోదం పొందాలన్న నిర్ణయానికే కట్టుబడ్డారు. మరోవైపు ప్రతి ఎన్నికకు కొత్త పొత్తులతో ప్రజలను వంచించే చంద్రబాబు 2019లో మరో కుట్రకు తెరతీశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు జనసేన పార్టీ విడిగా పోటీ చేసేలా పవన్‌ కల్యాణ్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. వామపక్షాలు, బీఎస్పీలతో  జనసేన పొత్తు కుదుర్చుకోవడం, ఆ పార్టీల మధ్య సీట్ల పంపకాలు కూడా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగాయి. టీడీపీకి మరోవైపు కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం కూడా ఉంది. అయినప్పటికీ జగన్‌ ఏమాత్రం వెరవకుండా తాను నమ్మిన సిద్ధాంతం పట్ల నిబద్ధతతో ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేశారు. 

దుష్ప్రచారంతో 2014లో అధికారానికి దూరం
2014 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను అడ్డుకోడానికి రాజకీయ ప్రత్యర్థులు అంతా ఒక్కటయ్యారు. జగన్‌ సీఎం కాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీకి కాంగ్రెస్‌ పార్టీ లోపాయికారీ మద్దతు ఇచ్చింది. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా పెద్దఎత్తున దుష్ప్రచారం చేసినా జగన్‌ మాత్రం విలువలతో కూడిన రాజకీయాన్నే చేశారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తే అధికారంలోకి రావచ్చని కొందరు జగన్‌ను సూచించినా అసాధ్యమైన వాగ్దానాలు చేయబోనని చెప్పి విలువలు, విశ్వసనీయతకే కట్టుబడ్డారు. చంద్రబాబు వ్యవసాయ రుణాలు మాఫీతోపాటు 640కిపైగా మోసపూరిత హామీలిచ్చి ప్రజలను వంచించారు. ఫలితంగా 2014లో వైఎౖస్సార్‌సీపీ అధికారానికి కొద్ది దూరంలో ఆగిపోయినా జగన్‌ వినమ్రంగా ప్రజల తీర్పును గౌరవించారు. ప్రజలకు కష్టం వచ్చిన ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం పోరాటం కొనసాగిస్తామని  ప్రకటించారు. 

విజయ దరహాసం
ప్రతిబంధకాలు, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటూ పదేళ్లుగా తమ కోసం పోరాడుతున్న వైఎస్‌ జగన్‌ను ప్రజలు తమ తీర్పుతో మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్‌కు అఖండ విజయాన్ని చేకూర్చారు. రికార్డు స్థాయిలో దాదాపు 151కి పైగా సీట్లతో వైఎస్సార్‌సీపీని గెలిపించారు. విశ్వసనీయతకు పట్టాభిషేకం చేసి నూతన రాజకీయ శకానికి తెరతీశారు. కష్టాలకు వెరవకుండా నిజాయితీ, నిబద్ధతతో రాజకీయాలు చేసే నాయకుడిని ప్రజలు ఆదరిస్తారని జగన్‌ రాజకీయ ప్రస్థానం నిరూపించింది. విలువల దారిలో నడిచే నేత వెంట యావత్‌ ప్రజానీకం సాగుతుందని నిరూపించి జగన్‌  భావి తరాలకు ఆదర్శంగా నిలిచారు.  

మరిన్ని వార్తలు