గుండె గుడిలో రాజన్న

2 Sep, 2018 10:46 IST|Sakshi

అనంత’ అభివృద్ధికి తపించిన మహానేత  

కృష్ణా జలాలను కరువునేలకు తెచ్చిన భగీరథుడు 

సంక్షేమ పథకాలతో జనరంజక పాలన చేసిన నాయకుడు 

 నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ తొమ్మిదో వర్ధంతి 

సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు 

సంక్షేమ పథకాలతో జనం రాత మార్చిన విధాతా.. 
పేదలకూ ఉన్నత చదువులిచ్చిన విద్యాప్రదాతా.. 
జలయజ్ఞంతో కరువును తరిమిన భగీరథుడా.. 
అన్నదాతను ఆదుకున్న రైతుబాంధవుడా.. 
ఆడపడుచులకు ఆర్థిక భరోసా నిచ్చిన రాజన్నా.. 
అందుకే నీ పాలనలో జన్మ ధన్యమన్నా.. 
పాలకులు అనేకమంది ఉన్నా.. 
నీపై ప్రజల ప్రేమ ‘అనంత’మన్నా.. 
నువ్వు దూరమై తొమ్మిదేళ్లవుతున్నా..  
ప్రతి గుండెలో నీ స్థానం పదిలమన్నా... 

దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో ‘అనంత’ది రెండో స్థానం. ఇక్కడ తాగునీళ్లు దొరకని పరిస్థితి. కరువు దెబ్బకు ఏటా రైతులు పంటలు నష్టపోయి ఆత్మహత్యలకు తెగించేవారు. ఈ కష్టాలన్నింటినీ చూసిన వైఎస్సార్‌.. తన హయాంలో తాగు, సాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూనే జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేశారు. 

సాక్షి ప్రతినిధి. అనంతపురం: ‘అనంత’ తాగు, సాగునీటి కష్టాలు తీర్చేందుకు వైఎస్సార్‌ అహరహం శ్రమించారు. తుంగభద్ర జలాల్లో ఏటా కేసీ కెనాల్‌కు అందే 10టీఎంసీ నీటిని రివర్స్‌ డైవర్షన్‌ పద్ధతిలో పీఏబీఆర్‌కు కేటాయిస్తూ  2005 ఆగస్టు 14న వైఎస్సార్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఆ క్రమంలో తన సొంత జిల్లా రాజకీయ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టారు. వైఎస్సార్‌ తీసుకున్న నిర్ణయంతో ‘అనంత’ ప్రజల దాహార్తి శాశ్వతంగా తీరింది.  ఈ నీటిపై ఆధారపడే హిందూపురం, మడకశిర, కల్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ నియోజకర్గాల ప్రజలకు శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా మంచినీరు అందుతోంది. అనంతపురం కార్పొరేషన్‌ దాహార్తిని తీర్చేందుకు రూ.67 కోట్లతో ముద్దలాపురం వద్ద అనంత తాగునీటి పథకాన్ని రూపొందించారు. దీంతో ‘అనంత’లో చాలా గ్రామాల్లో తాగునీటి కష్టాలు  తీరాయి.    

హంద్రీ–నీవాతో సాగునీటి పరిష్కారం 
కరవురక్కసిని తరిమికొట్టే లక్ష్యంతో వైఎస్సార్‌ రూ.6,850 కోట్లతో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. తొలిదశలో 1.98 లక్షలు.. రెండోదశలో రూ.4.04 లక్షలు...మొత్తంగా 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు... 310 గ్రామాల్లోని 33 లక్షల మందికి తాగునీరందించమే ఈ పథకం ఉద్దేశం. ఇందుకోసం వైఎస్సార్‌ రూ.4,054 కోట్లను ఖర్చుచేశారు. అందువల్లే 2012లోనే కృష్జాజలాలు జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరాయి. ఈ నీటితో అప్పటి ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌ విగ్రహానికి జలాభిషేకం చేశారు. ఇప్పుడు ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ పూర్తి చేస్తే తక్షణమే జిల్లాలో ఆయకట్టుకు సాగునీళ్లు అందుతాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ చర్యలకు ఉపక్రమించలేదు. అలాగే హెచ్చెల్సీ కెనాల్‌ పూడిక వల్ల  కేటాయింపుల మేరకు నీరు ఆయకట్టుకు అందడం లేదని హెచ్చెల్సీ ఆధునికీకరణకు నిధులు కేటాయించారు. దీన్ని కూడా పూర్తి చేయలేని పరిస్థితి.  

పారిశ్రామిక ప్రగతే లక్ష్యంగా 
వ్యవసాయరంగానికి దీటుగా పారిశ్రామికరంగాన్ని అభివృద్ధి చేస్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యం అవుతుందని రాజశేఖరరెడ్డి భావించారు. ఈ క్రమంలోనే  రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టే ఒడిస్సీ సంస్థతో సైన్సు సిటీ స్థాపనకు ఒప్పందం చేసుకున్నారు. హిందూపురం పరిసర ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ను ఏర్పాటుచేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో సైన్సు సిటీ ఏర్పాటు ఒప్పందాన్ని ఒడిస్సీ సంస్థ రద్దుచేసుకుంది. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌లో బీడీఎల్‌(భారత్‌ దైనిక్స్‌ లిమిటెడ్‌), హెచ్‌ఏఎల్‌(హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌), ఈసీఐఎల్‌(ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌), బీహెచ్‌ఈఎల్‌(భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌) వంటి ప్రభుత్వరంగ సంస్థలతోపాటూ పలు బహుళజాతి సంస్థలు పరిశ్రమలను ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చాయి. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌లో పరిశ్రమలకు నీరు అందించేందుకు సోమశిల బ్యాక్‌వాటర్‌ నుంచి పైపులైన్‌ నిర్మాణ పనులు చేపట్టారు. 25 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. అయితే తర్వాతి ప్రభుత్వాలు లేపాక్షి నాలెడ్జ్‌హబ్‌ భూముల ఒప్పందాలనే రద్దు చేశారు.  

పంటలబీమాతో రైతుకు దన్ను 
ప్రపంచంలో అత్యధిక విస్తీర్ణంలో వేరుశనగ పంటను చేసే అనంత రైతన్నలు.. ఏటా నష్టాలు చవిచూస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు తెగిస్తున్నారు. దీన్ని గుర్తించిన వైఎస్సార్‌.. వేరుశనగ పండినా.. ఎండినా రైతులు నష్టపోకూడదనే లక్ష్యంతో 2008లో గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకాన్ని వర్తింపజేశారు. దీని వల్ల ఆ ఏడాది వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు రూ.600 కోట్ల పరిహారం దక్కింది. వైఎస్సార్‌ మరణానంతరం ఆ పథకానికి తూట్లు పొడిచారు.

 అయినా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిసి ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు జీఓ 420 విడుదల చేశారు. రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో ఆలోచించి జారీ చేసిన జీఓ ఇది. అప్పులబాధ తాళలేక రైతు, చేనేత కుటుంబంలో జరిగిన ఎలాంటి ఆత్మహత్యనైనా రైతు, చేనేత ఆత్మహత్యగా గుర్తించాలని రూ.1.50 లక్షలు పరిహారం ఇవ్వాలని జీఓలో స్పష్టం చేశారు. ఇవే కాదు రైతుల శ్రేయస్సుతో పాటు ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, పింఛన్లు, ఉచిత విద్యుత్‌...ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో శాశ్వత ముద్ర వేసిన వైఎస్సార్‌ భౌతికంగా దూరమై నేటికి తొమ్మిదేళ్లవుతోంది. అయినప్పటికీ అనంత గుండె గుడిలో మాత్రం ఆయన స్థానం పదిలంగానే ఉంది.  

మరిన్ని వార్తలు