పల్లెకు వచ్చిన  ప్రభుత్వం

8 Jun, 2020 04:45 IST|Sakshi
చెన్నయ్యగారిపల్లె గ్రామం వ్యూ

(మోడపోతుల రామ్మోహన్, రాజంపేట)
గ్రామం చుట్టూ పచ్చని  పొలాలు, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు. ఊరు పేరు చెన్నయ్యగారిపల్లె. వైఎస్‌ఆర్‌ జిల్లా రాజంపేట నుంచి నందలూరు మీదుగా గ్రామానికి చేరుకొనే సరికి ఉదయం 11 గంటలు అయింది.  ముందుగా దళితవాడకు వెళ్లితే... ఇరువూరి సుబ్బన్న అనే పెద్దాయన ఎదుర య్యాడు. ’సాక్షి’ ఆయన్ని  పలకరించగా ఇప్పుడు అంతా బాగుంది నాయనా..అన్ని సమస్యలు స్థానికంగానే పరిష్కారం అవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

చెక్‌డ్యాంల నిర్మాణం జరగడంతో  భూగర్భజలాలు పెరుగుతున్నాయన్నారు. ఒకప్పుడు  గ్రామంలో లోఓల్టేజీ సమస్యతో కరెంటు సరఫరా సక్రమంగా ఉండేది కాదు...ఇప్పుడు రూ.2 కోట్ల వ్యయంతో నూతనంగా సబ్‌స్టేషన్‌ ఏర్పాటు జరిగింది. దీంతో గ్రామంలో ఆ సమస్య కూడా తీరిపోయింద న్నారు.అక్కడి నుంచి వెనక్కి వచ్చి ఆంజనేయసర్కిల్‌ వద్దకు వెళితే గురుమూర్తి కనిపించారు. ఆయన  మాట్లాడుతూ హైస్కూలు స్థాయి విద్యను అందించేందుకు రూ.50 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణం చకచకా జరుగుతోందని చెప్పారు. గ్రామంలో విశాలమైన సిమెంట్‌ రోడ్లు ఏర్పడ్డాయన్నారు. 

సచివాలయ వ్యవస్థ రాక ముందు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు, తహసీల్దారు, ఎంపీడీఓ, హౌసింగ్, వ్యవసాయ కార్యాలయాల్లో పనులకు మండల కేంద్రానికి పరుగు పెట్టాల్సివచ్చేది. వైద్య అవసరాలకు ఇదే పరిస్థితి. ఆటోలో శ్రమపడి  వెళితే ఒక రోజులో పని అవుతుందనే నమ్మకం ఉండేది కాదు.ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థతో ఇంటి వద్దకే సర్కారీ సేవలు అందుతున్నాయి.  వైద్యకోసం మండల కేంద్రానికి వెళ్లే అవసరం లేకుండా గ్రామంలో ఆసుపత్రి నిర్మాణం చేశారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా వలంటీర్లు  కృషి చేస్తున్నారు. ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు ఇస్తున్నారని గ్రామస్థులు చెప్పారు. ప్రభుత్వమే పల్లెకొచ్చినట్లు ఉందనే ఆనందం ప్రతివారిలో వ్యక్తమైంది.

సాగుకు భరోసా
నేను అయిదు ఎకరాల్లో  సేద్యం చేస్తున్నాను. రైతు భరోసా కింద ఇచ్చిన ఆర్థిక సాయం ఎంతో  ఆదుకుంది. నేరుగా సొమ్ము నా బ్యాంకు ఖాతాకే జమ కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.  విత్తనాల పంపిణీ వంటి పనులు అన్నీ మా ఊరిలోనే  జరిగిపోతున్నాయి. 
–గుగ్గిళ్ల సుబ్రమణ్యం, రైతు

ఆర్ధిక సాయం మరువలేనిది
కరోనా విపత్కర పరిస్థితుల్లో సున్నా వడ్డీ  కారణంగా అందిన ఆర్థికసాయం మా గ్రూపులోని సభ్యులకు ఎంతో ఉపయోగపడింది. లాక్‌డౌన్‌ సమయంలో అక్కచెల్లెమ్మలకు అందించిన సాయం మరువలేనిది.  
–వెంకటసుబ్బమ్మ        

మరిన్ని వార్తలు