‘పంచ గ్రామాల’కు ప్రత్యేక కమిటీ

26 Jul, 2019 13:49 IST|Sakshi

దీర్ఘకాల సమస్య పరిష్కారం దిశగా మరో ముందడుగు

సింహాచల భూ సమస్యపై వైఎస్‌ జగన్‌ సర్కారు చొరవ

దేవదాయ మంత్రి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో అధ్యయన కమిటీ

నెలక్రితమే న్యాయ నిపుణులతో చర్చలు

ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుతున్న వరుస నిర్ణయాలు

దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోక.. దేకుతున్న సింహాచలం పంచ గ్రామాల భూసమస్య పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు ఎన్నికలకు ముందు జీవోల పేరుతో మాయ చేసిందే తప్ప సమస్యకు పరిష్కారం చూపలేదు. మరోవైపు ప్రజాసంకల్పయాత్రలో ప్రజలు విన్నవించిన ఈ సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ హామీని నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చలు జరపడమే కాకుండా.. తాజాగా అధ్యయన కమిటీ వేయడం ద్వారా తమది చేతల ప్రభుత్వమని నిరూపించారు. కమిటీ నివేదిక ఆధారంగా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

సాక్షి, విశాఖ సిటీ: సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ మాల భూ సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆరుగురు సభ్యులతో  ప్రత్యేక అధ్యయన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ వ్యవహరిస్తారు. సభ్యులుగా పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్,  ముఖ్యమంత్రి ప్రత్యేక సలహదారు అజేయకల్లాం, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ఉంటారు. మెంబర్‌ కన్వీనర్‌గా సింహాచలం దేవస్థానం ఈవోను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమస్యపై పూర్తి అవగాహన ఉన్న ఏ అధికారి అయినా, వ్యక్తి అయినా ఈ కమిటీకి సహకారం అందించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ప్రజాసంకల్ప యాత్రలో హామీ
అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్య పరిష్కరిస్తామని ప్రజాసంకల్పయాత్ర, ఎన్నికల ప్రచార సమయాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పంచగ్రామాల ప్రజలకు భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. తొలి కేబినెట్‌ మీటింగ్‌లోనే ఈ సమస్యను ప్రస్తావించారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస్‌ విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో ప్రత్యేకంగా సమావేశమై సమస్య పరిష్కారానికి సహకరించాలని అభ్యర్థించారు. స్వామీజీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వెనువెంటనే మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వెలంపల్లి శ్రీనివాస్‌లు ప్రత్యేకంగా సమావేశమై  అధికారులతో చర్చించారు. కాగా ఈ నెల 16న అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ఈ అంశాన్నిప్రస్తావించారు. దీనికి మంత్రి వెలంపల్లి  స్పందిస్తూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని..కోర్టు పరిధిలో ఉన్నందున న్యాయపరమైన అంశాలను పరిష్కరించాలని కోరుతూ అడ్వకేట్‌ జనరల్‌తో చర్చలు జరిపామని సమాధానం చెప్పారు. సరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత గురువారం అధ్యయన కమిటీని వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.

వంద రోజుల్లో అని ఊరించిన టీడీపీ
దాదాపు 23 ఏళ్లుగా ఉన్న ఈ సమస్యపై టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లు ఓట్ల రాజకీయం మాత్రమే చేసింది. 100 రోజుల్లో పరిష్కరిస్తామని తప్పుడు హామీలు గుప్పించి 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఐదేళ్ల పాటు ఆ విషయాన్ని గాలికి వదిలేసింది. మొన్నటి ఎన్నికలకు ముందు మళ్ళీ ఓట్ల కోసం టీడీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. వరుస జీవోలు, కమిటీలు వేస్తూ హడావుడి చేసింది. అయితే ఆ పార్టీ నేతల కుయుక్తులు పసిగట్టిన ప్రజలు ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టారు. మరోవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చి కనీసం 50 రోజులు కూడా పూర్తి కాకముందే ఈ సమస్య పరిష్కారానికి మార్గలను అన్వేషించింది. 100 శాతం చిత్తశుద్ధితో ముందుకు వెళుతోంది. మాటలతో కాకుండా  చేతల్లో చూపిస్తూ ప్రజల ఆకాంక్షను అతిత్వరలో నెరవేర్చే దిశగా బలమైన అడుగులు వేస్తోంది 

మరిన్ని వార్తలు