క్రీడా సిరి.. శిరీష

25 Feb, 2018 13:37 IST|Sakshi

రైతు ఇంట క్రీడా ఆణిముత్యం

వెయిట్‌ లిఫ్టింగ్‌లో విశేష ప్రతిభ

స్పోర్ట్స్‌ కోటాలో రైల్వేలో ఉద్యోగం

ఆదర్శం.. కొప్పర్తి శిరీష సాధనా మార్గం..

వల్లూరు:  ఆమె పుట్టింది గ్రామీణ ప్రాంతమైనా... మక్కువ పెంచుకుని ఎంచుకున్న వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో విశేష ప్రతిభ కనబరుస్తూ పతకాల సాధనలో క్రీడా సిరిగా నిలుస్తోంది.  సాధారణ రైతు కుటుంబంలో జన్మించి అసాధారణ రీతిలో రాణిస్తున్న ఆమె పేరు కొప్పర్తి శిరీష. వల్లూరు మండలంలోని పెద్దపుత్త గ్రామానికి చెందిన కొప్పర్తి వెంకట శివారెడ్డి, వెంకట లక్ష్మిల ఏకైక కుమార్తె శిరీష మూడవ తరగతి పూర్తవగానే హైదరాబాద్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌కు జరిగిన ఎంపికల్లో స్థానం సాధించింది. ఆ స్కూల్‌లో 2001వ సంవత్సరంలో నాలుగవ తరగతిలో చేరింది. 2003లో వెయిట్‌ లిఫ్టింగ్‌ పట్ల ఆకర్షితురాలైంది. అనుకున్నదే తడవు కోచ్‌ల ఆధ్వర్యంలో శిక్షణకు శ్రీకారం చుట్టింది.

♦ స్కూల్‌ గేమ్స్‌ నుండి వివిధ స్థాయిలలో జరిగే అన్ని పోటీలలో అగ్ర స్థానంలో నిలుస్తోంది. వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడా పోటీలలో స్నాచ్, క్లీన్‌ అండ్‌ జర్క్, టోటల్‌ విభాగాల్లో  విశేషంగా రాణిస్తూ తన  ప్రత్యేకతను చాటుతోంది.

అంకిత భావంతో కఠోర శ్రమ ..
వెయిట్‌ లిఫ్టింగ్‌ లాంటి క్రీడలో రాణించడం మహిళలకు ఒక సవాలు లాంటిది. మిగిలిన క్రీడలతో పోలిస్తే వెయిట్‌ లిఫ్టింగ్‌లో మానసికంగా , శారీరకంగా చాలా శక్తివంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎదురైన అవరోధాలను అధిగమిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి గానూ శిరీష కఠోర శ్రమతో నిత్యం ప్రాక్టీస్‌ చేస్తూ ముందుకు సాగింది.

♦ 2005లో స్టేట్‌ మీట్‌లో అరంగేట్రం చేసింది. 2008 లో నేషనల్‌ గేమ్స్‌లోకి అడుగిడింది. 2010 లో ఇంటర్నేషనల్‌ స్థాయి పోటీలకు ఎంపికైంది.

♦ 2014 వ సంవత్సరంలో సీనియర్స్‌ విభాగంలోకి వచ్చిన మొదట్లో  ఒకటి రెండు పోటీల్లో అనుకున్నంతగా రాణించక పోయినా రెట్టించిన ఉత్సాహంతో  తిరిగి ప్రాక్టీస్‌ ప్రారంభించి రాణించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో 2016 లో సెంట్రల్‌ రైల్వే జోన్‌ వారు ఈమె ప్రతిభను గుర్తించి క్రీడా కోటాలో ఉద్యోగాన్ని ఇచ్చారు. కొద్ది రోజులకు మోకాలి నొప్పి వేధించడంతో సీనియర్‌ నేషనల్‌ గేమ్స్‌కు దూరం కావాల్సి వచ్చినప్పటికీ నిరుత్సాహ పడలేదు. ముంబాయిలో తాను నివాసం వుంటున్న చోటు నుండి  ప్రాక్టీస్‌ చేయడానికి లోకల్‌ ట్రైన్‌లో ప్రతి రోజు రాను రెండు గంటలు, పోను రెండు గంటలు ప్రయాణించి స్టేడియంకు చేరుకోవాల్సి వచ్చినప్పటికీ ప్రాక్టీస్‌ను కొనసాగించింది. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి గత సంవత్సరం పంజాబ్‌లో  జరిగిన ఆల్‌ ఇండియా రైల్వే ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ను సాధించింది.

♦ ఈ ఏడాది జనవరిలో మంగళూరులో  జరిగిన నేషనల్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించి మహిళా శక్తికి తిరుగు లేదని నిరూపిస్తోంది.

అన్ని పోటీల్లో పతకాలే..
♦ 2005వ సంవత్సరంలో విశాఖలో జరిగిన సీనియర్‌ స్టేట్‌మీట్‌ పోటీలలో 44 కేజీల విభాగంలో రెండవ స్థానంతో శిరీష తన క్రీడా పతకాల ఖాతా తెరిచింది. అప్పటి నుండి తిరిగి చూడకుండా పాల్గొన్న ప్రతి పోటీలోనూ పతకాన్ని సాధిస్తూ గొప్పగా రాణిస్తోంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా