స్పెషల్ టెస్ట్ పేపర్లు లీకేజీ

8 Feb, 2014 03:21 IST|Sakshi

ఖమ్మం సిటీ, న్యూస్‌లైన్:  పదో తరగతి విద్యార్థుల కోసం విద్యాశాఖ ప్రవేశపెట్టిన స్పెషల్ టెస్ట్ పేపర్లను ఓ ప్రభుత్వ పాఠశాల సిబ్బంది లీక్ చేస్తూ.. వాటిని దొడ్డిదారిన ప్రైవేట్ ట్యూషన్‌లకు అప్పగిస్తున్నారని ఆ పాఠశాల విద్యార్థులు ఆరోపించిన సంఘటన శుక్రవారం ఖమ్మంనగరంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంనగరంలోని కాల్వొడ్డులో గల నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలో జనవరి నుంచి పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు.

ఈ పరీక్షల కోసం డిస్ట్రిక్ట్ కామన్ ఎంట్రన్స్ బోర్డు (డీసీఈబీ) నుంచి సీల్డ్ కవర్‌తో వచ్చే ఈ ప్రశ్నపత్రాలను ఆ పాఠశాల సిబ్బంది కొంతకాలంగా ఓపెన్ చేసి పాఠశాలలోని మహిళా అటెండర్ ద్వారా బయటకు పంపిస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జూబ్లీపురాలోని ప్రైవేట్ ట్యూషన్ వారు జీరాక్స్ తీయించుకుని మళ్లీ ఆ మహిళా అటెండర్ ద్వారా తిరిగి పాఠశాలకు పంపిస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం అదే ట్యూషన్‌లో చదువుతున్న నయాబజార్ పాఠశాల విద్యార్థి ఒకరు ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.

 ట్యూషన్‌లో చదువుతున్న విద్యార్థులకు మార్కులు ఎక్కువ రావడం, తమకు తక్కువ వస్తుండడంతో ఉపాధ్యాయులు తమను తిడుతున్నారని పలువురు విద్యార్థులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. డీసీఈబీ నుంచి సీల్డ్ కవర్‌తో వచ్చే ఈ ప్రశ్నపత్రాలు ఒక స్టోర్ రూమ్‌లో భద్రపరుస్తారు. పరీక్ష ప్రారంభానికి అర గంట ముందుగా వీటిని ఓపెన్ చేయాలని నిబంధన ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా సిబ్బంది ముందే తెరచి బయటకు పంపించడం దారుణమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 స్పెషల్ టెస్ట్ పేపర్లు లీకేజీ కాలేదు:  జాఫర్, స్టోర్‌రూమ్ ఇన్‌చార్జ్
 స్పెషల్‌టెస్ట్‌ల పేపర్లు లీక్ కాలేదని స్టోర్ రూం ఇన్‌చార్జ్ జాఫర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. తమపై విద్యార్థులు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని పేర్కొన్నారు. సీల్ చేసిన ప్రశ్నాపత్రాలను పరీక్ష ముందు తప్ప ముందుగానే ఓపెన్ చేయమని, ఎవరో కావాలనే తమ పాఠశాల సిబ్బందిపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా స్టోర్‌రూమ్‌లో ఉన్న ప్రశ్నాపత్రాల బండిల్స్ కొన్ని చింపినట్లు, మరి కొన్ని ఓపెన్ చేసి అతికించినట్లు ఉండడం గమనార్హం.

మరిన్ని వార్తలు