కర్నూలు టు కాకినాడ

14 Nov, 2018 13:07 IST|Sakshi

డిసెంబరు 5 నుంచి ప్రత్యేక రైలు

గుంటూరు, విజయవాడ మీదుగా ప్రయాణం

అమరావతి ప్రయాణ కష్టాలకు చెక్‌

కర్నూలు(రాజ్‌విహార్‌): కర్నూలు నుంచి తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు  వారంలో రెండురోజులపాటు ప్రత్యేక రైలు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రైల్వే ఎస్‌టీఎం ఎన్‌.కె. మురళీధరన్‌ నాయర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక రైలు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌ నుంచి డోన్, బేతంచెర్ల, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం రోడ్డు, దొనకొండ, వినుకొండ, నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట మీదుగా కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఈ స్టేషన్లలో స్టాపింగ్‌ ఉంటుంది. డోన్, బేతంచెర్ల, నంద్యాల నుంచి తప్ప ఇప్పటి వరకు  కర్నూలు నుంచి అమరావతి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, కాకినాడకు ప్రత్యేక రైళ్లు లేవు. డిసెంబర్‌ 5న ప్రారంభించే ఈ రైలుతో కర్నూలు నుంచి అమరావతి వెళ్లే వారి ప్రయాణ కష్టాలకు పరిష్కారం లభించనుంది. ముందుగా మూడు నెలల పాటు నడిపేందుకు నిర్ణయించారు. ట్రాఫిక్, ప్రయాణికుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని పొడిగించే అవకాశం ఉంది.  ప్రత్యేక రైలు కావడంతో సాధారణ రైళ్ల కంటే చార్జీలు అధికంగా ఉండే అకాశం ఉంది. రైలు షెడ్యూల్‌ను ఇంకా ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది.  

కర్నూలు నుంచి కాకినాడకు ..
కర్నూలు సిటీ స్టేషన్‌ నుంచి ప్రతి బుధవారం, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రైలు(07238) బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07:30 గంటలకు కాకినాడ టౌన్‌ స్టేషన్‌ చేరుతుంది. డిసెంబరు 5న రైలును ప్రారంభిస్తారు. 7, 12, 14, 19, 21, 26, 28, 2019 జనవరి 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30,  ఫిబ్రవరిలో 1, 6, 8, 13, 15, 20, 22, 27, మార్చి 1వతేదీన నడపనున్నారు. మూడు నెలల్లో మొత్తం 26 ట్రిప్పులు తిరుగుతుంది.  

కాకినాడ నుంచి కర్నూలుకు..
కాకినాడ నుంచి మంగళ, గురువారం సాయంత్రం 7గంటలకు రైలు (07237) బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08:10 గంటలకు కర్నూలు చేరుతుంది. ఈ రైలు డిసెంబరు 4వ తేదీన ప్రారంభమవుతుంది. 6, 11, 13, 18, 20, 25, 27, జనవరి 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29, 31, ఫిబ్రవరి 5, 7, 12, 14, 19, 21, 26, 28 తేదీల్లో (మూడు నెలలు) 26 ట్రిప్పులు తిరుగుతుంది. 

మరిన్ని వార్తలు