పల్లెటూళ్ల నుంచి పట్నానికి స్పెషలిస్ట్‌ వైద్యులు

5 May, 2020 03:56 IST|Sakshi

పీహెచ్‌సీల్లో ఉన్న 52 మంది 

డాక్టర్లు కోవిడ్‌ ఆస్పత్రులకు వెంటనే రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు

సాక్షి, అమరావతి: పీజీ స్పెషలిస్ట్‌ సర్టిఫికెట్‌ ఉండి.. ఇప్పటి వరకు పల్లెటూళ్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే పరిమితమైన స్పెషలిస్ట్‌ వైద్యులను పట్టణాలు, నగరాల్లోని కోవిడ్‌ ఆస్పత్రులకు రప్పించేందుకు అధికార వర్గాలు చర్యలు తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్‌సీల్లో పని చేస్తున్న సుమారు 52 మంది స్పెషలిస్ట్‌ వైద్యులను గుర్తించి కోవిడ్‌ ఆస్పత్రుల్లో సేవలందించాలని ఆదేశించారు. వీరందరూ తక్షణమే స్టేట్‌ కోవిడ్‌ ఆస్పత్రుల్లో రిపోర్ట్‌ చేయాల్సిందిగా కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ ఆదేశించారు.

మైక్రోబయాలజిస్ట్‌లు మాత్రం వైరాలజీ ల్యాబొరేటరీల్లో రిపోర్ట్‌ చేయాలని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చికిత్సకు జనరల్‌ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్‌ వైద్యుల అవసరం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వీరంతా డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే పని చేస్తున్నారు. జనరల్‌ మెడిసిన్, పల్మనాలజీ, అనస్థీషియా, మైక్రోబయాలజీ వంటి ఎంతోమంది వైద్యులు సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్లుగానే ఉన్నారు. తాజా నిర్ణయంతో వీరందరికీ స్పెషాలిటీ సేవలందించే అవకాశం లభించింది. 

మరిన్ని వార్తలు