రాజధాని కాంట్రాక్టర్లకు డబ్బే.. డబ్బు!

20 Aug, 2018 03:19 IST|Sakshi

ప్రత్యేకంగా 15 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ 

రూ.7217.25 కోట్లు చెల్లించేందుకు సిద్ధం

ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం 

గత కాంట్రాక్టర్లకు, భవిష్యత్‌లో పనులు చేసే వారికి వర్తింపు 

అప్పుల ద్వారా నిధులు తెచ్చి అడ్వాన్స్‌ చెల్లింపు 

మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల్లో ‘ముఖ్య’ నేతకు కమీషన్లు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ‘ముఖ్య’ నేత కమీషన్లకు పోలవరం ప్రాజెక్టు తరువాత రాజధాని అమరావతి కల్పతరవుగా మారింది. ఇందులో భాగంగా అటు పోలవరం ప్రాజెక్టులోనూ, ఇటు రాజధాని ప్రాజెక్టుల్లోని కాంట్రాక్టర్లను ‘ముఖ్య’ నేత ప్రత్యేకంగా చూస్తున్నారు. నాలుగేళ్లయినా రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టని విషయం విదితమే. అయితే ఎన్నికలకు ముందు చంద్రబాబు సర్కార్‌ ఇప్పుడు వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లను ఆహ్వానిస్తోంది. ఎవ్వరికీ లేని విధంగా రాజధాని కాంట్రాక్టర్లకు ఏకంగా 15 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తప్పు అని న్యాయ, ఆర్థిక శాఖలు చెప్పినప్పటికీ కూడా ఆయన పట్టించుకోలేదు.

తొలి దశలో భాగంగా మొత్తం రూ. 48,115 కోట్ల విలువవైన ప్రాజెక్టులకు టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు. టెండర్ల నిబంధనల్లో పది శాతమే మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌గా చెల్లించాలని ఉన్నా.. ఆ నిబంధనలు తుంగలోతొక్కి 15 శాతానికి పెంచేశారు. ఈ లెక్కన రాజధాని కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల కింద  రూ. 7,217.25 కోట్లను చెల్లించనున్నారు. ఇప్పటికే టెండర్ల ఖరారైన ప్రాజెక్టులతో పాటు భవిష్యత్‌లో చేపట్టే ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు కూడా 15 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా అమరావతి బాండ్లతో పాటు రైతుల నుంచి తీసుకున్న వేల ఎకరాలను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి సీఆర్‌డీఏ ద్వారా రూ. 10 వేల కోట్లు అప్పు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనుంది. ఈ విధంగా అప్పులు చేసి తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ కింద చెల్లించనున్నారు. 

దుండుకోవడానికే పెంపు..
పెంచిన మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల నుంచి పెద్ద మొత్తంలో ‘ముఖ్య’ నేత కమీషన్లను దండుకోనున్నారని ఉన్నతస్థాయి అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకే పది శాతం ఉన్న మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లను ప్రత్యేకంగా రాజధాని కాంట్రాక్టర్ల కోసం పదిహేను శాతానికి పెంచారని, విలువైన మెటీరియల్‌ వంక పెడుతున్నారని ఆ వర్గాలు విమర్శిస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఏమి చేసిన సింగపూర్‌ కంపెనీల ప్రయోజనాలకేనని, అడ్వాన్స్‌లు పెంచి చివరకు సింగపూర్‌ కంపెనీలకే రాజధానిని కట్టబెడతారని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అసలే రాష్ట్రం రెవెన్యూ లోటుతో పాటు అప్పుల భారంతో సతమతం అవుతుంటే.. మళ్లీ అప్పులు తెచ్చి దోచుకునేందుకు అడ్వాన్స్‌లు పెంచడం దారుణం అని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

రెవెన్యూ లోటులో ఉన్న ఏ రాష్ట్రం కూడా తాత్కాలిక నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయలు వృథా చేయదని, ఇలా మన రాష్ట్రంలోనే జరుగుతోందని ఆయన చెప్పారు. రాజధాని రహదారులు, ఇతర పనులను భారీ అంచనాలతో రూపొందించారని, దీని వల్ల కాంట్రాక్టర్లతో పాటు ‘ముఖ్య’ నేత భారీగా ఖజానా నుంచే ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారని, ఇలాంటి దోపిడీ ఎక్కడా చూడలేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజధానికి సంబంధించి ఏ ప్రాజెక్టు చేపట్టినా తొలుతే అంచనాలను ఎక్కువగా రూపొందిస్తున్నారని సీఆర్‌డీఏలో పనిచేస్తున్న సాంకేతిక అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే  ఖరారైన టెండర్లతో పాటు కొత్తగా ఆహ్వానించే టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్లకు కూడా పది హేను శాతం మొబిలైజేషన్‌ చెల్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 

సీఆర్‌డీఏ అప్పులు ప్రణాళిక ఇలా ఉంది
– ఆంధ్రా బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు, విజయ బ్యాంకు నుంచి రూ. 2,060 కోట్లు అప్పునకు సీఆర్‌డీఏ దరఖాస్తు చేసింది. ఈ రుణాల మంజూరుకు న్యాయశాఖ ఆమోదం రావాల్సి ఉంది.
– హడ్కో నుంచి రూ.1,275 కోట్లను అప్పు చేశారు. ఇందులో ఇప్పటికి రూ. 900 కోట్లు వ్యయం చేశారు. హడ్కో నుంచి మరో రూ. 6,225 కోట్ల అప్పునకు దరఖాస్తు చేశారు. హడ్కో పరిశీలనలో ఉంది.
– రూ. 3,306 కోట్ల అప్పునకు ప్రపంచ బ్యాంకుకు దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తు పరిశీలనలో ఉంది. రాజధాని రైతుల ఫిర్యాదు మేరకు స్వతంత్ర కన్సల్టెంట్‌ ద్వారా ప్రపంచ బ్యాంకు అధ్యయనం చేయిస్తోంది. 
– ప్రభుత్వ గ్యారెంటీతో రూ. 10,000 కోట్లు అప్పు చేసేందుకు వివిధ బ్యాంకులకు ప్రతిపాదనలను పంపించారు.
– అమరావతి బాండ్ల ద్వారా రూ.2,000 కోట్లు అప్పు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు