భూసార పరీక్షలు వేగవంతం

25 May, 2014 02:26 IST|Sakshi

ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో భూసార పరీక్షలను వేగవంతం చేసినట్లు భూసార పరీక్షల కేంద్రం ఏడీఏ సీహెచ్ ప్రభాకరరావు తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో ‘న్యూస్‌లైన్’తో శనివారం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 9,920 భూసార పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దానిలో భాగంగా ఇప్పటి వరకూ 3,710 మట్టి నమూనాలను పలు మండలాల నుంచి సేకరించామన్నారు. వాటిలో 600 మట్టి నమూనాలను పరీక్షించడం పూర్తయిందన్నారు. రైతుల నుంచి మట్టి నమూనాల సేకరణలో మండల వ్యవసాయాధికారులు నిమగ్నమైనట్లు పేర్కొన్నారు.

 ఆసక్తి కలిగిన రైతులు తమ పొలంలోని మట్టినమూనాలను నేరుగా ఒంగోలులోని భూసార పరీక్ష కేంద్రానికి తీసుకొస్తున్నారని తెలిపారు. భూసార పరీక్షల నిమిత్తం బాపట్లలోని సాయిల్ టెస్టింగ్ కేంద్రానికి వెయ్యి మట్టినమూనాలు పంపిస్తున్నామన్నారు. ఒంగోలు, మార్కాపురం, కందుకూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయాల్లో కూడా భూసార పరీక్ష కేంద్రాలు పనిచేస్తున్నాయని ప్రభాకరరావు వెల్లడించారు. జిల్లాలోని 56 మండలాల నుంచి వచ్చిన మట్టి నమూనాలను ఆయా కేంద్రాలకు పంపి భూసార పరీక్షలను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపారు.

 మట్టి నమూనాలను ‘వి’ ఆకారంలో సేకరించాలి...
 భూసార పరీక్షల వల్ల నేలసారము, నేలలోని సమస్యలు తెలుస్తాయని ప్రభాకరరావు పేర్కొన్నారు. అయితే, మట్టినమూనాలను పొలంలో ఎక్కడపడితే అక్కడ తీస్తే పరీక్షలో ఫలితాలు సరిగా రావని తెలిపారు. భూమిని, ప్రాంతాలను బట్టి పొలంలో ‘వి’ ఆకారంలో మట్టి నమూనాలు తీయాల్సి ఉందన్నారు. తేమ, చిత్తడిగా ఉండే నేలలు, పెంటకుప్పలు వేసినచోట, రోడ్లకు సమీపంలో, చెట్ల నీడన, పొలాల్లో కంచెవేసిన ప్రాంతాల్లో మట్టినమూనాలు తీయకూడదని తెలిపారు.

ఎరువులు, నీరుపెట్టినచోట, వర్షం పడిన సమయంలో మట్టినమూనాలు సేకరించరాదన్నారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ, జొన్న పంటలు పండించే పొలాల్లో 6 నుంచి 12 అంగుళాల లోతులో, చౌడ భూముల్లో 12 అంగుళాల లోతులో మట్టి నమూనాలు తీయాలని వివరించారు. భూసార పరీక్షల అనంతరం ఏయే పంటలకు ఆ భూమి సరిపోతుందో తెలియజేస్తూ రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు ఇస్తున్నట్లు ప్రభాకరరావు తెలిపారు. ఖరీఫ్ ప్రారంభమయ్యే నాటికి లక్ష్యం మేరకు భూసార పరీక్షలు పూర్తిచేస్తామని ఆయన పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు