27 నుంచి విజయవాడకు స్పైస్‌జెట్‌

22 Oct, 2019 13:27 IST|Sakshi

విశాఖ నుంచి బెంగళూరు, చెన్నైకు కూడా సర్వీసులు  

మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖపట్నం – విజయవాడ మధ్య విమానాలు నడపడానికి పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. గతంలో విమానాలు నడపడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి కనబరచలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాఖ – విజయవాడ మధ్య విమాన సర్వీసులు నడపడానికి అనేక సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆలెన్స్‌ ఎయిర్‌ విమానాలు విశాఖ – విజయవాడ మధ్య నడుపుతోంది. తాజాగా ఈ నెల 27 నుంచి విమానాలు నడపడానికి స్పైస్‌జెట్‌ కూడా ముందుకు వచ్చింది. నవంబర్‌ 16 నుంచి విశాఖపట్నం – బెంగళూరు మధ్య విమానాల సర్వీసులు నడపడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27 నుంచి విశాఖ నుంచి చెన్నై కూడా విమానాలు నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వారంలో ఆరు రోజులు  
ఈ నెల 27 నుంచి స్పైస్‌జెట్‌ విశాఖ – విజయవాడ మధ్య విమాన సర్వీసులు నడుపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారానికి ఆరు రోజులు నడుపుతారు. మంగళవారం మాత్రం సర్వీసులు ఉండవు. (3254) రోజూ ఉదయం 8.30 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి ఉదయం 9.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ(విజయవాడలో 3253లో) ఉదయం 9.50 గంటలకు బయలు దేరి తిరిగి విశాఖపట్నం 10.50 గంటులకు చేరుకుంటుంది.

విశాఖ – బెంగళూరు మధ్య విమానాలు
నవంబర్‌ 16 నుంచి విశాఖపట్నం – బెంగళూరు మధ్య విమాన సర్వీసులు నడపడానికి స్పైస్‌జెట్‌ సిద్ధమైంది. ఉదయం 11 గంటల 25 నిమిషాలకు బెంగళూరులో బయలు దేరి మధ్యాహ్నం 1.35 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మధ్యాహ్నం 1.55 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల అయిదు నిముషాలకు బెంగళూరు చేరుకుంటుంది.

విశాఖ – చెన్నై మధ్య సర్వీసులు  
విశాఖ – చెన్నై మధ్య విమాన సర్వీసులు ఈ నెల 27 నుంచి నడవనున్నాయి. రోజూ ఉదయం 11 గంటల 20 నిమిషాలకు విశాఖలో బయలుదేరి 12 గంటల 55 నిమిషాలకు చెన్నై చేరుతుంది. ఉదయం 6.35 గంటలకు చెన్నైలో బయలుదేరి ఉదయం 8 గంటల పది నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది.  

మరిన్ని వార్తలు