పేదల బిందువు.. పెద్దల బంధువు

27 Apr, 2015 02:49 IST|Sakshi

- దారితప్పిన డ్రిప్ ఇరిగేషన్
- ఎస్సీ, ఎస్టీల పేరిట మంజూరు
- ఇతరుల భూముల్లో ఏర్పాట్లు
- ఎంఐఏఓలు సూత్రధారులు
- ఒకే రైతు పేరిట రెండు దరఖాస్తులు
- నిర్వహణ మరిచిన కంపెనీలు

నందికొట్కూరు మండలం  నాగటూరు గ్రామానికి చెందిన ఎం.సుబ్బమ్మకు 2.50 ఎకరాల భూమి ఉంది. డ్రిప్ కోసం దరఖాస్తు చేసుకోగా.. మైక్రో ఇరిగేషన్ ఏరియా ఆఫీసర్ పరిశీలించి రెకమండ్ చేశారు. అయితే అవినీతి మత్తులో అదనంగా  మరో పేరుతో దరఖాస్తు పంపారు. రెండింటికీ డ్రిప్ మంజూరయితే.. మరోదానిని అమ్ముకోవచ్చనేది ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది.
కర్నూలు(అగ్రికల్చర్): ఒకే పట్టాదారు పాసు పుస్తకంపై ఇద్దరు ముగ్గురికి డ్రిప్ మంజూరు చేయడం.. ఒకరి భూమి డ్రిప్ మంజూరైతే మరొకరి భూమిలో వేయడం.. ఎస్సీ రైతుల పేరిట డ్రిప్ మంజూరు చేయించి పెద్ద రైతుల పొలాల్లో వేయించడం.. ఇదీ డ్రిప్ ఇరిగేషన్ కథాకమామీషు. భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో నీటిని పొదుపుగా వాడుకుని అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేసుకునేందుకు ఉద్దేశించిన డ్రిప్ ఇరిగేషన్ పథకం అక్రమాలకు కేంద్రంగా మారుతోంది. 2014-15లో 15,481 మంది రైతులు డ్రిప్ కోసం దరఖాస్తు చేసుకోవడం చూస్తే రైతుల్లో ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది.

ఇదే సమయంలో అక్రమాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. మైక్రో ఇరిగేషన్ ఏరియా ఆఫీసర్లు కేంద్రంగా ఈ వ్యవహారం సాగుతోంది. ఒక రైతు పేరిట ఉద్దేశపూర్వకంగా రెండేసి దరఖాస్తులను రెకమండ్ చేసిన ఇద్దరు ఎంఐఏఓలు ఇటీవల సస్పెండ్ అయ్యారు. ప్రధానంగా డోన్, పత్తికొండ, ఆత్మకూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ఈ తరహా అక్రమాలు అధికంగా ఉన్నట్లు సమాచారం.

ఎస్సీ, ఎస్టీల పేరిట లబ్ధి
ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం రాయితీతో డ్రిప్ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే దీనిని ఆ వర్గాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లేదు. ఇదే అవకాశంగా ఇతర సామాజిక వర్గాలకు చెందిన పెద్ద రైతులు ఎస్సీ, ఎస్టీల పేరిట బిందు సేద్యం మంజూరు చేయించుకుని తమ పొలాల్లో వేసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఐదెకరాలు పైబడిన పెద్ద రైతులకు 50 శాతం సబ్సిడీపై డ్రిప్ కల్పిస్తున్నారు. నాన్ సబ్సిడీ మొత్తం ఎక్కువగా చెల్లించాల్సి ఉన్నందున ఎస్సీ, ఎస్టీ రైతుల పేర్లను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటివి వెల్దుర్తి, డోన్, బేతంచెర్ల, క్రిష్ణగిరి మండలాల్లో అధికంగా కనిపిస్తున్నాయి.

యేటా డ్రిప్ మంజూరు
ఒక రైతుకు ఒకసారి బిందు సేద్యం మంజూరయితే పదేళ్ల వరకు డ్రిప్ మంజూరు చేయరాదు. కానీ కొంతమంది ఎంఐఏఓలు మాత్రం యేటా దరఖాస్తులు రెకమెండ్ చేస్తుండటం గమనార్హం. 2013-14లో డ్రిప్ మంజూరు చేసిన రైతుల పేర్లతోనే ఎంఐఏఓలు 20 వరకు దరఖాస్తులు రెకమెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఒక రైతుకు ఒక సర్వే నెంబర్‌కు డ్రిప్ మంజూరు చేస్తే మరో రైతు భూముల్లో డ్రిప్ వేసుకున్న సంఘటనలు కోకొల్లలు.

నిర్వహణ గాలికి...
డ్రిప్ పరికరాలను అమర్చే కంపెనీలు గత ఏడాది వరకు ఐదేళ్ల పాటు నిర్వహణను పరిశీలించాల్సి ఉంది. 2014-15 నుంచి నిర్వహణ బాధ్యతలను ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచారు. డ్రిప్ కంపెనీలు నిర్వహణ బాధ్యతలను విస్మరిస్తున్నాయి.

డ్రిప్ నిర్వహణ పట్ల రైతులకు అవగాహన లేకపోవడం, కంపెనీలు పట్టించుకోకపోవడంతో డ్రిప్ పరికరాలు ఏడాదికే మూలనపడుతున్నాయి. 2003లో ప్రారంభమైన ఏపీఎంఐపీ ఇప్పటి వరకు 31,105 మంది రైతులకు 37,470 హెక్టార్లలో డ్రిప్, స్ప్రింక్లర్ల మంజూరు చేశారు. ఇందులో 50 శాతం కూడా వినియోగం లేదు. కొన్ని డ్రిప్ కంపెనీలు రైతులకు నాసిరకం పరికరాలను సరఫరా చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. డ్రిప్‌కు డిమాండ్ పెరుగుతుండగా.. అక్రమాలు కూడా అదే స్థాయిలో ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు