మల్లవరంలో ప్రబలిన విషజ్వరాలు

24 Oct, 2013 03:05 IST|Sakshi
 గొల్లప్రోలు, న్యూస్‌లైన్ :ఊరు వణికిపోతోంది. ఆ ఇల్లు.. ఈ ఇల్లు అని లేదు.. ప్రతి ఇంటా విషజ్వరపీడితులే. దాదాపు 800 గడప, 4 వేల జనాభా ఉన్న గ్రామంలో 1600 మందికి పైనే మంచానపడ్డారు. ఊరు జ్వరాల బారిన పడడం 15 రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. అయినా సంబంధిత వైద్య సిబ్బందికి ‘దోమ’ కుట్టినట్టు కూడా లేదు. దీంతో బాధితులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. గొల్లప్రోలు మండలంలోని ఏకే మల్లవరంలో విషజ్వరాలు విజృంభించాయి. గత నాలుగు రోజులుగా గ్రామంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జ్వరాలు తీవ్రంగా ప్రబలాయి. జ్వరపీడితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దాదాపు ప్రతి కుటుంబంలో కనీసం ఇద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు. గాలి ద్వారా జ్వరాలు సోకుతున్నట్లు ప్రైవేటు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం 1600 మందికి పైగా జ్వరపీడితులు ఉండగా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. 
అట్లతద్దెకు వచ్చి..
15 రోజుల క్రితం గ్రామంలో వ్యాపించిన జ్వరాలు తగ్గు ముఖం పట్టినట్లు కనిపించినా ఇంతలోనే మళ్లీ విజృంభించాయి. వాంతులు, విరేచనాలు, కీళ్లనొప్పులు, తలనొప్పి, కాళ్లపీకులతో వందలాదిమంది బాధపడుతున్నారు. కొంతమంది మంచంపై నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు.  ఇటీవల అట్లతద్దెకు పుట్టిళ్లకు వచ్చిన మహిళలు సైతం జ్వరాల బారిన పడ్డారు.  రోజు రోజుకు జ్వరపీడితుల సంఖ్య పెరుగుతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో పరిస్థితి ఇంత విషమంగా ఉన్నా నేటి వరకు వైద్యసిబ్బంది  క నీసం గ్రామంలో పర్యటించిన దాఖలా కూడా లేదు. దీంతో రోగులు వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఏకే మల్లరం జ్వరపీడితులతో గొల్లప్రోలు, చేబ్రోలు, పిఠాపురంలలో ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. నిరుపేదలు చేసేది లేక గ్రామంలో ఆర్‌ఎంపీల వంటి వారి వద్ద చికిత్స పొందుతున్నారు.  
 
మందు బిళ్లలిచ్చే వారూ కరువే..
ఏకే మల్లవరం గొల్లప్రోలు మండలంలో ఉన్నప్పటికీ వైద్యపరంగా కె.పెరుమళ్లాపురం పీహెచ్‌సీ పరిధిలో ఉంది. గ్రామానికి పీెహ చ్‌సీకి దూరం సుమారు 12 కిలోమీటర్లు. మండల కేంద్రం గొల్లప్రోలు కూడా 12 కిలో మీటర్లే. దీంతో బాధితుల్లో పలువురు పీహెచ్‌సీకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆ పీహెచ్‌సీల సిబ్బంది సైతం గ్రామాలకు వచ్చి మందుబిళ్లలు కూడా ఇవ్వడం లేదు.
 
రోడ్లు రొచ్చు గుంటలు
ఏకే మల్లవరంలో ఎక్కడ చూసినా గ్రామస్తులు పశువులను రోడ్లపై గుంపులు గుంపులుగా కడుతుంటారు. దీంతో రోడ్లన్నీ మురికి కూపాలుగా తయారయ్యాయి. దీనికి తోడు భారీ వర్షాలకు గ్రామంలో అపారిశుద్ధ్యం నెలకొంది. ఏ వీధిలో చూసినా పెంటకుప్పలు, చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. అడుగుతీసి అడుగు వేయలేనంతగా గ్రామంలో వీధులు రొచ్చురొచ్చుగా తయారయ్యాయి. కుళాయిల్లో మురికి నీరు చేరడంతో తాగునీరు కలుషితమౌతోంది. దీంతో ప్రజలకు అనే క రోగాలు సోకడానికి అవకాశమేర్పడుతోంది. పంచాయతీ అధికారులు పారిశుద్ధ్యం మెరుగుదలకు ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
 
ఎస్‌పీఎం సిబ్బందితో సర్వే చేయిస్తాం..
ఏకే మల్లవరంలో విషజ్వరాలు ప్రబలిన విషయం తమ దృష్టికి వచ్చిందని పిఠాపురం సీనియర్ పబ్లిక్‌హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సాయిప్రసాద్ తెలిపారు. గ్రామంలో గురువారం వైద్యసిబ్బందితో కలసి పర్యటిస్తానన్నారు. సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ సిబ్బందితో  సర్వే చేయిస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావును వివరణ కోరగా జ్వరాల వ్యా ప్తి వాస్తవమేనన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం బాగానే ఉందని, అయితే కురిసిన వర్షాలకు రోడ్లు మురికికూపాలుగా మారాయన్నారు.
 
 మా ఇంట్లో నలుగురికి జ్వరం
 గ్రామస్తులంతా జ్వరాలతో బాధపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మా ఇంట్లో నలుగురికి జ్వరాలు వచ్చాయి. కదలలేని స్థితిలో ఉన్నాం. చేసేది లేక ఆటోపై ప్రైవేటు ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్నాం.
 - తటవర్తి గోవిందరాజు, జ్వరపీడితుడు, ఏకే మల్లవర ం 
 
 ఊరంతా మురికి కూపంగా మారింది..
 గ్రామంలో రోడ్లన్నీ మురికి కూపాలుగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా చెత్త, పెంటకుప్పలు ఉన్నాయి. జ్వరాలతో ప్రతీ కుటుంబం అల్లాడి పోతోంది. ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం.
 - తటవర్తి నందీశ్వరరావు, ఏకే  మల్లవరం
 
మరిన్ని వార్తలు