ఆర్టీసీ ఎండీకే ఎస్‌పీవీల చైర్మన్ పగ్గాలు

12 Feb, 2014 05:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) నిధులతో కొనుగోలు చేసే బస్సుల నిర్వహణకు స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ఏర్పాటులో ఆర్టీసీ అధికారుల ఆజమాయిషీనే ఉండాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు పట్టుపట్టాయి. మున్సిపల్ కార్పొరేషన్‌లలో మున్సిపల్ కమిషనర్, జిల్లాల్లో కలెక్టర్ల అధ్యక్షతన ఎస్‌పీవీలు ఉండాలనే నిబంధనను వ్యతిరేకించాయి. ఆర్టీసీ ఎండీనే ఎస్‌పీవీలకు చైర్మన్‌గా ఉండాలని, ఆర్టీసీ ఈడీ ఎండీగా కలిపి ఏడుగురు సభ్యులకుగాను ఐదుగురు ఆర్టీసీ అధికారులే ఉండేలా చూడాలని, ఇద్దరు మాత్రమే ప్రభుత్వ అధికారులుండాలని డిమాండ్ చేశాయి. ఇందుకు బెంగళూరులో విజయవంతంగా అమలవుతున్న ఎస్‌పీవీల విధానాన్ని అనుసరించొచ్చేమో పరిశీలించేందుకు అక్కడికి వెళ్లిరావాలని సూచించాయి.
 
 
 మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన ప్రధాన కార్యదర్శి పద్మాకర్ ఈ మేరకు బోర్డుకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్‌పీవీల ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర పడింది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులను పట్టణ ప్రాంతాలకే వినియోగించాల్సి ఉన్నందున ఆ నిధులతో కొనే బస్సులను పట్టణాల్లోనే తిప్పాల్సి ఉంది. దీంతో 4 ఎస్‌పీవీలు ఏర్పాటు చేసి వాటి పరిధిలోకి వీలైనన్ని ప్రాంతాలను తీసుకురావాలని నిర్ణయించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలను కలిపి హైదరాబాద్ ఎస్‌పీవీ, విజయవాడ, విశాఖ, విజయనగరం, గుంటూరు, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలతో విజయవాడ ఎస్‌పీవీ, వరంగల్ ఆర్టీసీ జోన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలతో వరంగల్ ఎస్‌పీవీ, రాయలసీమ జిల్లాలతో కడప ఎస్‌పీవీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

>
మరిన్ని వార్తలు