‘శ్రవణం’పై నీలినీడలు

1 Aug, 2014 01:35 IST|Sakshi
  • బెలాను ఉల్లంఘిస్తున్న టీటీడీ
  •  కొత్త కో-ఆర్డినేటర్‌ను నియమించే ప్రయత్నాలు
  • తిరుపతి: బాల్యం నుంచే వినికిడి లోపం ఉన్న చిన్న పిల్లలకు వినికిడి లోపాలను సరిచేసి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు టీటీడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన శ్రవణం(బాలవిద్యాలయ) ప్రాజెక్ట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇన్నాళ్లూ ప్రాజెక్ట్ నిర్వహణ భారాన్ని మోసిన చెన్నైకి చెందిన బాలవిద్యాలయ డెరైక్టర్  సరస్వతీనారాయణస్వామిని శ్రవణం కోఆర్డినేటర్  బాధ్యతల నుంచి తప్పించిన టీటీడీ యాజమాన్యం ట్రస్ట్ బైలాస్‌కు విరుద్ధంగా స్థానికంగా పలుకుబడి గలిగిన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది.

    ట్రస్ట్ బైలాస్ ప్రకారం శ్రవణం ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా మహిళలను నియమించాల్సి ఉంది. అందుకు భిన్నంగా సిఫార్సులకు లొంగి మగవారిని డెరైక్టర్‌గా నియమించే పనిలో టీటీడీ నిమగ్నమైంది. తిరుపతికి చెందిన ఒక ఈఎన్‌టీ వైద్య నిపుణుడిని శ్రవణం కోఆర్డినేటర్‌గా నియమించనున్నట్లు తెలిసింది. అయితే అందుకు విరుద్ధంగా మహిళలను కాదని, మగవారిని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా నియమించే ప్రతిపాదనను పలువురు వ్యతిరేకిస్తున్నారు. 2006 డిసెంబర్ 15న అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి శ్రవణం ప్రాజెక్ట్‌ను ప్రారంభించి ప్రాజెక్ట్ నిర్వహణకు టీటీడీ రూ.30 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. వినికిడి లోపం ఉన్న బాలల సంక్షేమానికి పాటుపడుతున్న చెన్నైకి చెందిన బాలవిద్యాలయానికి శ్రవణం నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.

    శ్రవణం ప్రాజెక్ట్‌లో పనిచేయడానికి అవసరమైన ఉపాధ్యాయినుల నియామకం, వారికి జీతభత్యాల చెల్లింపు బాధ్యతలు ఆ సంస్థకే అప్పగించి నిర్వహణ ఖర్చులతో కలిపి  టీటీడీ రీయింబర్స్ చేసేలా 2006 డిసెంబర్ 5న ఎంవోయూపై సంతకాలు జరిగాయి. తిరుపతిలో ఏర్పాటు చేసిన బాలవిద్యాలయానికి మంచి ఆదరణ ఉండడంతో మహబూబ్‌నగర్, విశాఖపట్నాలలో సబ్‌సెంటర్స్ ఏర్పాటు చేయాలని టీటీడీ పాలకమండలి 2012 ఏప్రిల్ 3న జరిగిన సమావేశంలో తీర్మానాన్ని (నెం,24) కూడా ఆమోదించింది.

    సరస్వతీనారాయణస్వామి నేతృత్వలో శ్రవణం నిర్వహణ తీరును టీటీడీ ఉన్నతాధికారులు మెచ్చుకున్న సందర్భాలు, విమర్శలు వెలువడినప్పుడు సమర్థించిన సందర్భాలు ఉన్నాయి. చిన్న, చిన్న లోపాలు ఉన్నా ప్రాజెక్ట్ లక్ష్యాలను సాధించేందుకు ఆమె చిత్తశుద్ధితో కృషి సాగించారు. ప్రస్తుతం బాలవిద్యాలయలో సుమారు 220 మంది వినికిడి లోపం ఉన్న చిన్నపిల్లలు ఉన్నారు.

    కోఆర్డినేటర్‌ను మారిస్తే ప్రాజెక్ట్ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు సిబ్బంది అంతా మహిళలే అయినందున శ్రవణం ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా అనుభవం ఉన్న టీ టీడీ సెంట్రల్ ఆస్పత్రి రిటైర్డ్ మహిళా వైద్యులను నియమించాలని కోరుతున్నారు. లేకుంటే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకుండా ప్రాజెక్ట్(బాలవిద్యాలయం)ను పూర్తిస్థాయిలో టీటీడీనే నిర్వహించాలని కోరుతున్నారు.
     

మరిన్ని వార్తలు