ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండి..

1 Oct, 2017 20:16 IST|Sakshi

సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె శివారులోని ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండిపడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకెళ్తోంది. దాదాపు 30 మీటర్ల మేర గండి పడడంతో... పెండేకంటినగర్‌ పూర్తిగా జలమయం అయ్యింది. దీంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. గండిని పూడ్చేందుకు పోలీసులు, రైతులు తీవ్రంగా  ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు గండిపడిన ప్రాంతానికి సమీపంలోనే.. మూడేళ్ల కిందట కూడా  భారీ గండి పడిందని రైతులు అంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా... అధికారుల పట్టించుకోవడం లేదని, దీంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ నేత, బనగానపల్లె నియోజకవర్గ పార్టీ ఇంచార్జి కాటసాని రామిరెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని గండిని పరిశీలించారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మూడేళ్ల కిందట కూడా 60 మీటర్ల మేర గండి పడిందని, కానీ ఎవరూ పట్టించుకోలేదని కాటసాని ఆరోపించారు. మళ్లీ మళ్లీ గండ్లు పడుతుండడం అధికారుల వైఫల్యంగా కన్పిస్తుందని అన్నారు. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండి పడి గంటలు గడుస్తున్నా.. ఇప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అంతకంతకూ కాలువ నుంచి నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకెళుతుండటంతో స్థానికులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.

మరిన్ని వార్తలు