విద్యార్థిని దుర్భాషలాడిన ఉపాధ్యాయుడు

14 Mar, 2020 12:04 IST|Sakshi
ఉపాధ్యాయులను విచారణ చేస్తున్న ఎంఈఓ సావిత్రమ్మ

పాఠశాల వద్ద విద్యార్థిని కుటుంబీకుల ఆందోళన

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు కల్చరల్‌ : బొల్లవరంలోని శ్రీచైతన్య పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిని దుర్భాషలాడారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు శుక్రవారం పాఠశాలలో ఆందోళనకు దిగారు. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తనకు పరీక్షలో తక్కువ మార్కులు వేశారని కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు శంకర్‌ను ప్రశ్నించింది. దీనిని మనసులో ఉంచుకుని ఆ ఉపాధ్యాయుడు ప్రతి దానికి వేధిస్తున్నారని విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పాఠశాలలో ఆందోళన చేశారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వేశారని ప్రశ్నించినందుకు కక్ష సాధింపుగా.. అల్లరి చేస్తోందన్న నెపంతో విద్యార్థినిని చెప్పుతో కొడతా అని తనకు ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాడు.

దీంతో విద్యార్థిని ఇంట్లో ముభావంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషయం తెలుసుకుని పాఠశాలకు చేరుకున్నారు. అక్కడ బైఠాయించి ఉపాధ్యాయుడు, యాజమాన్యాన్ని నిలదీశారు. ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడితే ఎలా అని, ఏమైనా జరిగితే పరిస్థితి ఏమిటి అని వారిని ప్రశ్నించారు. వేలకు వేలు ఫీజులు తీసుకుని ఇష్టం వచ్చినట్లు తిట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉపాధ్యాయుడు విద్యార్థినికి క్షమాపణ చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉపాధ్యాయున్ని తొలగిస్తామని పాఠశాల ఏజీఏం నాగిరెడ్డి చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఎంఈఓ సావిత్రమ్మ శ్రీచైతన్య పాఠశాలకు చేరుకుని విచారణ చేశారు. పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, ఉపాధ్యాయులను విచారించారు. విద్యార్థినితో  మాట్లాడి సమాచారం సేకరించారు. జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు ఎంఈఓ చెప్పారు.  

మరిన్ని వార్తలు