ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయి!

29 Jun, 2018 07:06 IST|Sakshi

శ్రీగౌతమి కేసు పక్కదారి పట్టడంపై అనుమానం

నిందితులపై టీడీపీ సస్పెన్షన్‌ వేటు

పోలీసుల్లోనూ గుబులు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: శ్రీగౌతమి హత్య కేసు పరిశోధించిన తీరుపై సవాలక్ష అనుమానాలు.. అది ప్రమాదం కాదని,  ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య అని అందరూ మొత్తుకుంటున్నా.. ఆ ఘటన చుట్టూ అనేక సందేహాలు రేకెత్తుతున్నా.. పది రోజుల్లోనే దీన్ని ప్రమాద కేసుగా పోలీసులు అటకెక్కించడానికి ఏ ఒత్తిళ్లు పని చేశాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో ఏఎస్పీ స్థాయి అధికారిని విచారణ కోసం పంపినా కేసులో ఏ మాత్రం పురోగతి కనిపించలేదు. ఘటన జరిగిన నాటి నుంచి చెబుతున్న ప్రమాద కోణానికే పోలీసులు విచారణను పరిమితం చేశారు. కిందిస్థాయి అధికారి ఇచ్చిన నివేదికనే విలేకరుల సమావేశంలో చదివేసి ఇది వందశాతం ప్రమాదంగానే తేల్చిపారేశారు. విశాఖపట్నానికి చెందిన ఇద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టి చేతులు దులుపుకున్నారు.

పావని వాదనను పట్టించుకోని పోలీసులు
అయితే ఘటన జరిగి, ప్రమాదంలో తన అక్క శ్రీగౌతమి మృతి చెందిందని తెలిసిన రోజు నుంచీ, ఇది ముమ్మాటికీ హత్యేనని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డ పావని చెబుతూ వస్తోంది. తన అక్కకు టీడీపీ నేత సజ్జా బుజ్జితో వివాహం జరిగిందని, అతని భార్య నుంచి గౌతమి బెదిరింపులను ఎదుర్కొంటుందని ఆరోపిస్తూ వచ్చింది. అయితే ఆమె చెప్పిందంతా అరణ్య రోదనగానే మిగిలింది. పోలీసులు ఇవేమీ పట్టించుకోలేదు. అంతేకాదు గౌతమి చనిపోయిందని తెలియక ముందు.. మొదటి మూడు రోజులూ కూడా పావని తమను కారులో కొందరు వెంబడించారని, కారులోంచి తన చున్నీ పట్టుకుని లాగే యత్నం చేశారని చెప్పింది. సజ్జా బుజ్జితో రహస్య వివాహం, ఇతర విషయాలు పక్కన పెడితే కనీసం టీజింగ్‌ అంశాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టకపోవడాన్ని ఆనాడే ‘సాక్షి’ ప్రశ్నించింది. అయితే తాము సరైన కోణంలోనే విచారణ చేస్తున్నామంటూ ఉన్నతాధికారులు వాదించారు. కేవలం రెండు సెక్షన్‌లలో నిందితులపై కేసు నమోదు చేసి ఊరుకున్నారు. ప్రమాదంలో శ్రీగౌతమి మృతికి కారణమైనందుకు 304 (ఏ),పావని గాయాలపాలైనందుకు 338 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈవ్‌టీజింగ్‌ కోణాన్నీ పోలీçసులు ఉద్దేశపూర్వకంగా విస్మరించారు.

ప్రజాప్రతినిధులపైనా ఆరోపణలు
తన అక్కను సజ్జాబుజ్జి రెండోపెళ్లి చేసుకున్నాడని, అతని భార్య తన అక్కను బెదిరించేదని చెప్పినా, రెండోపెళ్లి ఆధారాలు చూపినా సజ్జా బుజ్జిని కనీసం పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. వారిని ఒక ప్రైవేటు గెస్ట్‌హౌస్‌కు పిలిపించి మాట్లాడి పంపించేయడం వెనుక ఒక ఉన్నత ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును క్లోజ్‌ చేయించడానికి నరసాపురం, పాలకొల్లు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నట్లు పావని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యేలు ఈ కేసును సక్రమంగా విచారించే దిశగా అధికారులపై ఒత్తిడి తేలేదు. నిందితులంతా తమ పార్టీకి చెందిన వారు కావడంతో ఈ కేసును ప్రమాదంగా మూసేయించేందుకు రాజధాని స్థాయిలో యత్నాలు జరిగాయి.  రెండోపెళ్లి చేసుకోవడం నేరమని తెలిసినా, బాధితులు ఫిర్యాదు చేసినా సజ్జా బుజ్జిని అరెస్టు చేసే ధైర్యం కూడా అప్పటి పోలీసు అధికారులు చేయలేకపోయారు.  ప్రమాదానికి కారణమైన కారు విశాఖపట్నం నుంచి రావడం, అదే సమయంలో గౌతమి కూడా విశాఖపట్నంలో చదువుతుండటంతో,  కోడి పందేలు చూడటానికి వచ్చామని పట్టుబడిన డ్రైవర్, అతని స్నేహితుడు చెబుతున్న అంశాలకు పొంతన లేకపోవడంతో ఇది హత్యేనన్న అనుమానాలు వచ్చాయి.

పావని పోరాటం వల్లే..
పావని బతికి బయట పడటం, పట్టు వదలకుండా అన్ని ఆధారాలు తానే సేకరించి డీఎస్పీ నుంచి డీజీపీ కార్యాలయాల వరకు తిరిగి తమకు న్యాయం చేయాలని చేసిన పోరాటం కారణంగానే సీఐడీ దర్యాప్తు చేయడం, వారు తమ వద్ద ఉన్న సాక్ష్యాల ఆధారంగా కేసును ముందుకు తీసుకుపోవడంతో ఈ కేసు హత్య కేసుగా మార్పు చెందింది.  ఇప్పటికైనా పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టకపోతే నిందితులు దర్జాగా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఏదేమైనా శ్రీగౌతమి కేసు జిల్లా పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసిందనే చెప్పాలి. ఈ వైఫల్యానికి కారకులను గుర్తించి నివేదిక పంపామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ ‘సాక్షి’కి తెలిపారు.

నిందితులపై టీడీపీ వేటు
గౌతమి హత్య కేసులో అరెస్టయిన నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్, దర్భరేవు మాజీ సర్పంచ్‌ సజ్జా బుజ్జి, టీడీపీ దర్భరేవు గ్రామ అధ్యక్షుడు బొల్లంపల్లి రాంప్రసాద్‌(రమేష్‌)ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఒక ప్రకటనలో గురువారం తెలిపారు.

మరిన్ని వార్తలు