బజారున పడ్డ టీడీపీ పరువు

28 Jun, 2018 08:08 IST|Sakshi
స్థానిక ఎమ్మెల్యేతో శ్రీగౌతమి హత్యకేసు నిందితులు (వృత్తాల్లోని వ్యక్తులు), శ్రీగౌతమి

పోలీసులపై నెపం వేసి తప్పించుకునే ప్రయత్నం

తెరవెనుక సూత్రధారులపై జోరుగా చర్చ

ఒంటరి పోరాటం చేసిన పావనికి ప్రజల మద్దతు

శ్రీ గౌతమి కిరాయి హత్య ఉదంతంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో టీడీపీ పరువు పూర్తిగా బజారున పడింది. ఈ కేసును పక్కదోవ పట్టించడంలో  పోలీసులపై రాష్ట్రస్థాయి నేతల హస్తం ఉందనే ప్రచారానికి బలం చేకూరుస్తూ జరుగుతున్న పరిణామాలు కూడా టీడీపీని గుక్కతిప్పుకోకుండా చేస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, ఏలూరు, నర్సాపురం :  ఓ యువతిని టీడీపీ నేత సజ్జా బుజ్జి ప్రమాదం మాటున కిరాతకంగా హత్య చేయించడం, సాక్షాత్తు ప్రజాప్రతినిధిగా ఉన్న జడ్పీటీసీ బాలం ప్రతాప్‌ హత్యలో ప్రధాన పాత్ర పోషించిన సంగతి బట్టబయలు కావడంతో ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. అయితే దీనిని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా పూర్తిగా నెపాన్ని పోలీసులపై వేసే ప్రయత్నం సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మొదట్లో కేసు విచారణలో పోలీసులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం ఇప్పటికే బహిర్గతమయ్యింది. అప్పట్లో విచారణ అధికారులుగా ఉన్న పోలీసులు తప్పు చేసిన విషయాన్ని ఎవరూ కాదనే పరిస్థితిలేదు. అయితే ఎలాంటి పూర్తిస్థాయి విచారణ లేకుండా కేవలం 10 రోజుల్లోనే పోలీసులు కేసు క్లోజ్‌ చేసే సాహసం చేశారంటే, వెనుక బడా వ్యక్తులు లేకపోతే అంత ధైర్యం చేసే పరిస్థితి లేదు.

ఈ అంశాలను పక్కదారి పట్టిస్తూ అప్పటి పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేసి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అప్పటి నరసాపురం డీఎస్పీ, పాలకొల్లు రూరల్‌ సీఐ, పాలకొల్లు రూరల్‌ ఎస్సైలపై చర్యలు ఉంటాయని, కేసును డీల్‌ చేసిన ఏఎస్పీ రత్నకు మెమో జారీ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదట్లోనే ఈ కేసు విచారణ పక్కదారి పట్టినట్టుగా సీబీసీఐడీఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేయడమైతే ఖాయంగా కనిపిస్తోంది.

తెరవెనుక వ్యక్తులు ఎవరు
పథకం ప్రకారం యువతిని హత్య చేసిన సజ్జా బుజ్జి అండ్‌ కో ఎలాంటి జంకూ లేకుండా తరువాత ఏడాదిన్నర కాలంగా దైనందిన జీవితాన్ని గడిపారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, బ్యాంకాక్‌ టూర్లకు తిరుగుతూ గడిపారు. పై స్థాయి వ్యక్తుల అండలేకపోతే ఇది సాధ్యంకాదని తెలుస్తోంది. అప్పట్లో విచారణ అధికారులుగా వ్యవహరించిన పోలీసు అధికారులదీ, సజ్జా బుజ్జిది ఒకే సామాజికవర్గం, అదీ సీఎం సొంత సామాజికవర్గం. మంత్రి లోకేష్‌బాబు సిఫార్సులు మేరకే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ప్రచారం మొదటి నుంచీ ఉంది. అయితే బుజ్జి అండ్‌కో ను పైస్థాయి నాయకుల వరకూ తీసుకెళ్లడానికి స్థానికంగా ఉన్న అదే సామాజికవర్గానికి చెందిన ఓ బడా వ్యక్తి సహాయపడినట్టుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి మరికొందరి వ్యవహారాలపై  సీఐడీ వద్ద సమాచారం ఉందనే ప్రచారం సాగుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు ఇంకా సగమే పూర్తయ్యిందని నిందితులను కోర్టులో ప్రవేశపెట్టే ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఓవైపు ఎన్నికలు రాబోతున్నాయి, ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో రిస్క్‌ నెత్తిమీద పెట్టుకోవడం ఎందుకనే భావనలో పోలీసులు ఉన్నట్టు ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. అదే విధంగా పోలీసుశాఖ ముందుకెళితే శ్రీగౌతమి వ్యవహారంలో మరికొన్ని కొత్త క్యారెక్టర్లు తెరమీదకు రావచ్చనే ప్రచారం సాగుతోంది.

శభాష్‌ పావని : అక్క చనిపోయింది. తోడుగా ఉన్న తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. తన అక్కది ప్రమాదం కాదని ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో ధైర్యంతో ముందుకెళ్లి పోరాటంలో విజయం సాధించిన పావని చైతన్యానికి అభినందనలు దక్కుతున్నాయి. కేసులో సగంవంతు ఆధారాలను  తనే సేకరించి పావని సీబీసీఐడీ అధికారులకు అందించింది. దీంతో సీఐడీ దర్యాప్తు కూడా సులభతర మయ్యిందని చెపుతున్నారు. సీఐడీ లేకపోతే తమకు న్యాయం జరిగేది కాదని పావని పేర్కొంది. పోలీసులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోలేదన్నారు.

తన అక్క మృతికి న్యాయం చేయాలని ఎందరినో కోరామని, ఎవరూ దగ్గరకు రానీయలేదన్నారు. బుజ్జి డబ్బులు ఇస్తానని రాయబారాలు కూడా నడిపాడని చెప్పింది. ఓ దశలో  నిజంగా తను, అమ్మ ఆత్యహత్య చేసుకోవాలనుకున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.  కానీ అక్కకు జరిగిన ఘోరానికి న్యాయం జరగాలని కష్టాలు, అవమానాలు దిగమింగి ముందుకెళ్లానని చెప్పింది. తన పోరాటానికి ’సాక్షి‘ అండగా నిలిచిందని కృతజ్ఞతలు చెప్పింది. రాజమండ్రి సీఐడీ సీఐ శేఖర్‌బాబు మేలు మరువలేమన్నారు.

మరిన్ని వార్తలు