ఊరు క్షేత్రం..నీరు తీర్థం

30 Jan, 2020 11:32 IST|Sakshi

 శ్రీకూర్మంలో అష్ట తీర్థ మహాయోగం

44 ఏళ్ల తర్వాత సంపూర్ణ తీర్థాలు

ఫిబ్రవరి 2 నుంచి ఎనిమిది రోజులు ఎనిమిది తీర్థాల్లో పుణ్య స్నానాలు

9వ తేదీన శ్రీకూర్మం వద్ద సముద్ర స్నానంతో క్రతువు పూర్తి 

సాక్షి, శ్రీకాకుళం : శ్రీకూర్మనాథుని రాజ్యంలో కొలనులు తీర్థాలుగా విరాజిల్లే క్షణాలు వస్తున్నాయి. పల్లె మట్టి మహాదేవుని ప్రసాదంగా మారి ఊరంతా క్షేత్రమై పులకించే ఘడియలు ఆసన్నమవుతున్నాయి. శ్రీకూర్మంలో అష్టతీర్థ మహాయోగం నిర్వహించే ముహూర్తం రానే వస్తోంది. దేవుని సేవ కోసం ఏర్పాటై, మనుషుల నిర్లక్ష్యం కారణంగా మూలన పడిపోయిన ఏడు కొలనులు మళ్లీ మహిమ నింపుకున్నాయి. ఏడు రోజుల పాటు భక్తుల పాపాలను కడగనున్నాయి. నాలుగు దశాబ్దాల అనంతరం శ్రీకూర్మానికి ఈ వైభోగం సంప్రాప్తిస్తోంది.ఈ క్రతువు కోసమే క్షేత్రం ఎదురుచూస్తోంది. వచ్చిన భక్తులను గుండెకు హత్తుకునేందుకు ముస్తాబవుతోంది. 
– గార  

సప్త కొలనుల్లో స్నానాలు.. 
ప్రపంచంలోనే శ్రీకూర్మనాథునికి ఉన్న ఏౖకైక క్షేత్రంలో అరుదైన క్రతువుకు ముహూర్తం కుదిరింది. కూర్మ, బ్రహ్మండ, విష్ణు పురాణాలు పేర్కొన్న ప్రకారం మాఘమాసంలోని పౌర్ణమి ఆదివారం, ఆశ్లేష నక్షత్ర ఘడియల్లో సమీప సముద్ర స్నానంతో పాటు శ్రీకూర్మనాథాలయంలోని శ్వేతపుష్కరిణి స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే కోటి చంద్ర గ్రహణ పుణ్యఫలం దక్కుతుంది. అలాంటి ఘడియలు కలుస్తున్న శుభ తరుణం ఈ ఆదివారం (ఫిబ్రవరి 2వ తేదీ మొదలుకొని 9 వరకు)కుదిరింది. వీటిలో వరుసగా వచ్చే 2వ తేదీన నారద తీర్థం, 3న సుధా తీర్థం, 4న చక్ర తీర్థం, 5న మాధవ తీర్థం, 6న కౌటిల్య తీర్థం, 7న వక్ర తీర్థం, 8న నరసింహ తీర్థం, 9న మహోధది (సముద్రం)లో స్నానా లు ఆచరించాలి. ఈ యోగాల్లో ప్రతి రోజూ విధిగా స్నానమాచరించడంతో పాటు స్వామిని దర్శించి, యథాశక్తిగా దానాలు చేస్తే జన్మసుఖం ప్రాప్తిస్తుందని శాస్త్రవాక్కు. ఇన్నాళ్లకు ఆ యోగం భక్తులకు కలగనుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. 

స్నానాలు ఎలా చేయాలంటే.. 
తొలిరోజు వేకువజామున (ఫిబ్రవరి 2 ఆదివారం మొదలు)పుణ్య స్నానాలు ప్రారంభమవుతాయి. ఆలయం చుట్టూ ఉన్న ఎనిమిది తీర్థాల్లో స్నానాలు యథావిధిగా జరిగాక ఆయా తీర్థాల గట్టు వద్ద ఉన్న తీర్థ పాలకుడిని అర్చించాలి. అనంతరం శ్రీకూర్మనాథుని దర్శనం చేసుకోవాలి. తీర్థం వద్ద ఉన్న బ్రాహ్మణుల చేత పూజలు, గోత్రనామాలు, జప, తప, ధ్యాన, కలిగిన రీతిలో దానం చేయవచ్చు. 

తీర్థాల ప్రాశస్త్యాలు.. 

నారద తీర్థము (ఫిబ్రవరి 2) 
యోగ కాలం నందు శ్రీకూర్మంలోని వెలమ వీధిలో ఉన్న ఈ తీర్థంలో పుణ్యస్నానం ఆచరించాలి. చెరువు గట్టునే ఉన్న  ‘నారద గుడి’ చుట్టూ ప్రదక్షిణ అనంతరం నారద మహర్షి విగ్రహానికి భక్తులు పూజలు చేయాలి. అనంతరం శ్రీకూర్మంలోని కూర్మనాథాలయంలో స్వామిని దర్శించాలి. తీర్థ స్నానం వల్ల దురభిమానం, క్రూరత్వం, మాత్సర్యము, మదాంధులు పోతాయని నమ్మిక. 

సుధా గుండం.. శ్వేతపుష్కరిణి (3వ తేదీ) 
సోమవారం నాడు శ్రీకూర్మనాథాలయం ఎదురుగా ఉన్న శ్వేతపుష్కరిణిలో స్నానమాచరించి, సముద్రం ధ్వనిని వినాలి. ఈ సుధాగుండం సుదర్శన చక్రంతో ఏర్పడిందని, శ్వేత చక్రవర్తుల కాలంలో జరిగినట్టు పద్మ పురాణం పేర్కొంటోంది. అనంతరం ఎదురుగా ఉన్న స్వామి ఆయల శిఖరాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదు. 

చక్రతీర్థం (4వ తేదీ):
మంగళవారం ఉదయం నుంచి తండ్యాలపేట వద్ద అభయవరద వీరాంజనేయస్వామి ఆలయ పుష్కరిణిగా ఉన్న చక్రతీర్థంలో భక్తులు స్నానాలాచరించాలి. చెంతనే ఆంజనేయస్వామి, ఒకే ఆలయంలో ఉన్న రెండు శివలింగాలకు అభిõÙకాల అనంతరం మూడు కిలోమీటర్లు దూరంలోని శ్రీకూర్మనాథుడిని దర్శించుకోవాలి. ఈ స్నానం వల్ల సర్వశత్రు వినాశనం, మనో ధైర్యం, మంచి వాక్కు వంటి నవ విధ భక్తి మార్గాలు దొరుకుతాయి. 

మాధవ తీర్థం(5వ తేదీ): 
బుధవారం శ్రీకూర్మంలోని రెడ్డికవీధిలోని మాధవ తీర్థంలో పుణ్యస్నానం చేయాలి. గ్రామంలో మధ్యలో ఉన్న ఈ పుష్కరిణిలో స్నానం తర్వాత సిమెంట్‌ రోడ్డులో ఉన్న గుడి లేని స్వప్న మాధవ (రాయి)విగ్రహానికి పూజలు చేయాలి. భక్తునికి కలలో కని్పంచిన విష్ణుమూర్తి మాధవ తీర్థ సమీపంలో రాయిగా ఉన్నానని చెప్పడంతో ఈ మూర్తిని స్వప్నమాధవం అని పిలుస్తున్నారు. ఈ స్నానం వలన దుస్వప్నాలు నాశనమవుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.  

కౌటిల్య తీర్థం (6వ తేదీ): 
గురువారం నాడు దువ్వుపేట సమీపంలో ఉన్న కౌటిల్యం, రొట్టెల తీర్థంగా ఉన్న ఈ పుష్కరిణిలో స్నానమాచరించాలి. ఇక్కడ బౌద్ధుల కాలం నాటి ఇటుకలతో నిర్మాణం చేసిన గుడి కనిపిస్తుంది. వీటిలో బుద్ధ గయ మాదిరి ఏక శిల విష్ణుపాదం భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ పిండ ప్రదానాలు చేయటం వల్ల 72 తరాల పితృదేవతలు సంతృప్తి చెంది మోక్షం ప్రసాదిస్తారని, వారంతా మనం చేసిన పిండ ప్రదానాలతో మోక్షానికి అర్హులవుతారని విశ్వాసం. కౌటిల్య మహాముని తన తల్లిదండ్రులకు ఈ తీర్థం వద్దనే పిండ ప్రదానాలు చేశారని చరిత్ర చెబుతోంది. 

వక్రతీర్థం (7వ తేదీ) : 
శుక్రవారం వత్సవలస గ్రామం వద్దనున్న చెరువుగా పిలుస్తున్న ఈ వక్ర తీర్థంలో ఉదయం స్నానామాచరించి, శ్రీకూర్మనాథుడిని సేవించాలి. ఇక్కడ స్నానం చేయడం వల్ల విద్యాబుద్ధులు వస్తాయి. స్నానం అనంతరం శ్రీకర మంత్రం జపించడం వల్ల లాభిస్తుందని పురాణ ప్రాశస్త్యం. 

నరసింహ తీర్థం (8వతేదీ): 
శనివారం నీలాపుపేట గ్రామంలోని ఉన్న తీర్థంలో స్నానమాచరించాలి. ఈ చెరువు పునరుద్ధరణ సమయంలో నరసింహ స్వామి రాతి విగ్రహం లభ్యం కావడంతో చెరువు గట్టునే శిథిలావస్థలో ఉన్న గుడిలో ప్రతిష్టించి గుడిని పునఃనిర్మించారు. ఈ గుడిలో పాత విగ్రహం మహాబల నరశింహున్ని దర్శించుకొని పూజలు చేస్తే ఏడు జన్మల నుంచి చేసిన పాపముల నుంచి విముక్తులవుతారని నమ్మిక.  

మహోధది(9వ తేదీ): 
ఆదివారం ఉదయం మాఘ మాస పౌర్ణమి కావడంతో శ్రీకూర్మం–మత్స్యలేశం సముద్ర తీరంలో స్నానమాచరించాలి. ఇక్కడ ఆశ్లేష నక్షత్రయుత పౌర్ణమి ఉండటం వల్ల పిండ ప్రదానం చేయవచ్చు. అనంతరం శ్రీకూర్మనాథాలయంలో ముందుగా క్షేత్ర పాలకుడైన నరసింహ స్వామిని, మూలవిరాట్‌ను, లక్ష్మీదేవిని, రెండు ధ్వజస్తంభాలను దర్శించాలి. వీటితో అష్టతీర్థ మహాయోగంలు ముగుస్తాయి. కోటి చంద్ర గ్రహణాల ద్వారా వచ్చే పుణ్యఫలాన్ని ఈ తీర్థ మహా యోగంల ద్వారా పొందవచ్చని అన్ని పురాణాలు, శా్రస్తాలు చెబుతున్నాయి.

44 ఏళ్ల తర్వాత సంపూర్ణ క్రతువు  
శ్రీకూర్మ క్షేత్రంలో 44 ఏళ్ల కిందట ‘రాక్షస’ నామ సంవత్సరంలో అష్ట తీర్థ మహాయోగం నిర్వహించారు. మళ్లీ ఇన్నాళ్లకు సంపూర్ణంగా అష్టతీర్థ మహాయోగం కురిదింది. అప్పటి రీతిన ఈ ఏడాది యోగించాయని ఆలయ ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు చెప్పారు. ఈ మధ్యలో 24 ఏళ్లకు ముందు ఓ సారి 1996లో పాక్షిక యోగం నిర్వహించారు. అప్పటి మహాయోగంలో పాల్గొన్న భక్తులు స్థానికంగా తక్కువ మందే ఉన్నా వారు ఆనాటి వై¿ోగాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. 

అద్భుత యోగమిది 
భూమి మీద ఆదిక్షేత్రంగా చెప్పే శ్రీకూర్మ క్షేత్రంలో అరుదైన అష్టతీర్థ మహాయోగంలో పుణ్యస్నానాలు శాస్త్రధర్మంగా చేయటం వల్ల కోటి చంద్రగ్రహణ పుణ్యఫలం ఒక్కసారే దక్కుతుంది. ఇంతటి పుణ్య క్రతువుకు 44 ఏళ్ల తర్వాత తిధి, వార, పక్ష, మాస, పౌర్ణమి అన్నీ కలిసిన ముహూర్తం కుదిరింది. ఇది చాలా అదృష్టయోగంగా గుర్తించవ చ్చు. ప్రతి ఒక్కరూ ఎనిమిది తీర్థాల్లో ఎనిమిది రోజులు స్నానం చేసి శ్రీకూర్మనాథుడిని సేవించాలి. జప, తప, ధ్యాన, వివిధ రకాల దానాలు చేయటం వల్ల విశేష పుణ్యఫలం దక్కుతుంది. 
– చామర్తి సీతారామనృసింహాచార్యులు, ప్రధానార్చకులు, శ్రీకూర్మనాథాలయం  
 
రెండు యోగాల్లో స్నానాలు చేశా.. 
నాకు అష్టతీర్థాల్లో రెండుసార్లు స్నానంచేసే అదృష్టం దక్కింది. మరి కొద్ది రోజుల్లో మూడో సారి ఆ పుణ్య జలాల్లో స్నానం చేయనున్నారు. మొదటిసారి అష్టతీర్థానికి పొలాల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్లినట్టు గుర్తు. వరుసగా తొమ్మిది రోజులు స్నానాలు చేసినట్టు బాగా గుర్తుంది. మా బంధువులందరికీ ఇప్పటికే ఫోన్‌ ద్వారా సమాచారమిచ్చాం. 
– బరాటం ఫకీర్, సంఘ సేవకుడు, శ్రీకూర్మం 

మరిన్ని వార్తలు