అంతా రామమయం..!

8 Apr, 2014 00:40 IST|Sakshi
అంతా రామమయం..!
  •       లక్కవరంలో మూడు రామాలయాలు
  •      దుర్గమ్మకు రెండు, హనుమాన్‌కు
  •      రెండు ఆలయాలు వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక భావాలు
  •  చోడవరం టౌన్, న్యూస్‌లైన్ : ఏదైనా ఊళ్లో ఒక రామాలయం ఉండడం సహజం. ఇంకా  పెద్ద ఊరైతే ఆయా కులదైవాలకు ఆలయాలు సైతం ఉంటాయి. కానీ లక్కవరంలో వీధికొకరామాలయంతోబాటు రెండు హనుమాన్ దేవాలయాలు, మరో రెండు దుర్గా మందిరాలున్నాయి. ఇంకా ఓ శివాలయం, వెంకటేశ్వర దేవస్థానంతో పాటు పైడితల్లమ్మ, నూకాలమ్మ, మరిడిమాంబ, పరదేశిమాంబ, పసలమారమ్మ అమ్మవార్ల ఆలయాలు కూడా ఉన్నాయి.

    అయిదువేలు జనాభా, 12 వార్డులు, 3,221మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో వెలమవీధిలో ఒక రామాలయం, కాపువీధిలో ఒక రామాలయం, దిగువవీధిలో ఒక రామాలయం ఉన్నాయి. శ్రీరామనవమి వేడుకలు మూడు ఆలయాల వద్ద ఎవరికి వారే నిర్వహిస్తారు. అలాగే వెలమవీధిలో ఆంజనేయస్వామి, దుర్గాదేవి ఆలయాలు, కాపువీధిలో దుర్గాదేవి, ఆంజనేయస్వామి ఆలయంలు ఉన్నాయి.

    వీటివద్ద కూడా దేవీ నవరాత్రి ఉత్సవాలు, హనుమాన్ మాలాదీక్షా పీఠాలతో పాటు హనుమజ్జయంతి వేడుకలు కూడా వేర్వేరుగా నిర్వహిస్తారు. అయితే శివరాత్రి ఉత్సవాలు, అమ్మవారి పండుగలు గ్రామస్తులంతా కలిసి నిర్వహిస్తారు. జమిందారీ పాలన ఉన్న నాటినుంచి కూడా వేర్వేరు ఆలయాలు, వేర్వేరుగా వేడుకలు నిర్వహించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. రాజులకు కూడా రామాలయం ఉండేదని, నాలుగేళ్ల క్రితం రామాలయాన్ని తొలగించి అదే స్థానంలో భూపతి వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని నిర్మించారు.
     
    చోడవరం పంచాయతీ పరిధిలో పది రామాలయాలు
     
    చోడవరం మేజర్ పంచాయతీ పరిధిలో గల శివారు గ్రామాలతో కలిపి పది రామాలయాలు ఉన్నాయి. ఆలయాలన్నింటి  వద్ద కూడా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పట్టణంలోని వెలమవీధి, బోళ్లవీధి, నౌడువీధి, ఎడ్లవీధి, అన్నవరం వెంకయ్యగారిపేట, అంబేద్కర్ కాలనీ, రేవళ్లు, బంగారమ్మపాలెం, పి.ఎస్.పేట, అలాగే పి.ఎస్.పేట బ్రాహ్మణవీధిలలో గల రామాలయాల వద్దా నవమి వేడుకలు నిర్వహిస్తారు.
     

మరిన్ని వార్తలు