26నే శ్రీరామ నవమి

24 Mar, 2018 12:42 IST|Sakshi
రామతీర్థం దేవస్థానం

ఆ రోజే సెలవుగా ప్రకటిస్తూ జీవో జారీ

రామతీర్థం దేవస్థాన అర్చకుల నుంచే నివేదిక

నెల్లిమర్ల రూరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఈ నెల 25నా లేక 26న జరపుకోవాలా? అనే విషయంపై సందిగ్ధం వీడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు రోజుల్లో ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరుతూ దేవాదాయశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు రామతీర్థం దేవస్థానం అర్చకుల నుంచి వివరణ సేకరించారు. అర్చకులు పంచాంగాలను చూసి ఈ నెల 25న నవమి ఉన్నప్పటికీ అష్టమి కలిసి రావడంతో కల్యాణం జరిపించేందుకు శుభం కాదని స్థానాచార్యులు నరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు సాయిరామాచార్యులు తదితరులు దేవాదాయశాఖకు వివరణ ఇచ్చారు.

ఆగమ శాస్త్రాల ప్రకారం ఆ రోజున శ్రీరాముని కల్యాణం నిర్వహించకూడదని లిఖిత పూర్వకంగా తెలియజేశారు. 26వ తేదీ ఉదయం 5.30కు నవమి పోయి దశమి వస్తుందని సూర్యోదయం తరువాత స్వామివారి వేడుకను జరుపుకోవచ్చునని అర్చకులు చెబుతున్నారు. ఆ సూచనల మేరకు దేవాదాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపి,  26నే రామతీర్థంలో కల్యాణాన్ని జరుపుతున్నట్లు తమ నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 26నే సెలవు దినంగా ప్రకటిస్తూ శుక్రవారం అధికారిక జీఓను జారీ చేసింది.

అష్టమితో కూడిననవమి చేయరాదు
ఆదివారం నవమితో పాటు అష్టమి కూడా కలిసి వచ్చింది. ఆగమ శాస్త్రాల ప్రకారం స్వామివారి కల్యాణాన్ని ఆ రోజు నిర్వహించడం మంచింది కాదు. 26వ తేదీ ఉదయం 5.30  గంటలకే నవమి పోయి దశమి వస్తుంది. సూర్యోదయమైన తరువాత దశమి నాడు కల్యాణ వేడుకను నిర్వహించవచ్చు. ఇదే విషయాన్ని దేవదాయశాఖకు తెలియజేశాం. ఆ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం 25నుంచి 26వ తేదీకు మార్చింది.– సాయిరామాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు, రామతీర్థం

మరిన్ని వార్తలు