టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం కృషి

16 Feb, 2020 10:57 IST|Sakshi
పేరుపాలెంలో బీచ్‌ ఫెస్టివల్‌ ప్రారంభ సభలో మాట్లాడుతున్న మంత్రి శ్రీరంగనాథరాజు, చిత్రంలో మంత్రి వనిత, ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే ముదునూరి, కలెక్టర్‌ ముత్యాలరాజు తదితరులు

మంత్రులు శ్రీ రంగనాథరాజు, వనిత వెల్లడి

పేరుపాలెంలో అట్టహాసంగా బీచ్‌ ఫెస్టివల్‌

సాక్షి, నరసాపురం: జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో మొగల్తూరు మండలం పేరుపాలెంలో రెండు రోజులపాటు జరిగే బీచ్‌ ఫెస్టివల్‌ శనివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ సభలో మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ పశి్చమగోదావరి జిల్లా పేరు చెబితేæ ఆతిథ్యానికి ప్రపంచంలోనే గుర్తింపు ఉందన్నారు. ఆతిథ్యానికి, టూరిజానికి అవినావభావ సంబంధం ఉందని పేర్కొన్నారు. మన జిల్లాలో టూరిజం అభివృద్ధికి అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. పేరుపాలెం బీచ్‌ను అభివృద్ధి చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామన్నారు. కార్తీకమాసంలో పేరుపాలెం బీచ్‌కు లక్షలాదిగా తరలివచ్చే యాత్రికుల కోసం త్వరలో ఈ ప్రాంతంలో భారీ శివాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఏటా ఫిబ్రవరిలో ఇక్కడ బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహించేలా ముఖ్యమంత్రితో చర్చిస్తామని అన్నారు.

బీచ్‌ అభివృద్ధికి కృషి :
రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జిల్లాలో మారుమూల ఉన్న పేరు పాలెం బీచ్‌ ప్రచారానికి నోచుకోక అన్ని విధాలుగా వెనుకబడిపోయిందన్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ బీచ్‌ను జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నిస్తామని, దేశంలో పేరున్న బీచ్‌లకు పేరుపాలెం బీచ్‌ ఏ మాత్రం తీసిపోదని చెప్పారు. అధిక ఆదాయాన్ని సమకూర్చే రంగాల్లో టూరిజం అభివృద్ధి కూడా ప్రధానమైందన్నారు. జిల్లాలో మొదటిసారిగా జరుగుతున్న బీచ్‌ ఫెస్టివల్‌ను ఈస్థాయిలో నిర్వహించిన అధికార యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.

శివాలయం నిర్మిస్తాం
ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ పేరుపాలెం బీచ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ముందడుగు వేస్తామన్నారు. దీనికి సంబంధించి ప్రణాళిక తయారవుతుందని పేర్కొన్నారు. బీచ్‌లో శివాలయాన్ని నిర్మిస్తామని, దీనికి శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవస్థానాల సహకారం తీసుకుంటామన్నారు.

10 బీచ్‌ల అభివృద్ధికి ప్రణాళిక
పర్యాటకశాఖ సీఈఓ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రుషికొండ, ఆర్‌కే బీచ్‌ల తర్వాత ప్రాధాన్యతా క్రమంలో ఉన్న మరో 10 బీచ్‌లను అభివృద్ధి చేయాలని టూరిజం శాఖ నిర్ణయించిందన్నారు. పేరుపాలెం బీచ్‌ కూడా టూరిజం శాఖ గుర్తించిన బీచ్‌లలో ఉందన్నారు. రాబోయే కాలంలో పేరుపాలెం బీచ్‌ను రూ.5 కోట్ల నుంచి 10 కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

కేరళ మాదిరి ప్రకృతి సోయగం
సభకు అధ్యక్షత వహించిన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ కూడా పేరుపాలెం బీచ్‌లో కనిపిస్తాయన్నారు. కేరళలో కూడా లేనివిధంగా ఇక్కడి తీరం పొడవునా కొబ్బరి చెట్లు దర్శనమిస్తాయన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో నరసాపురం తీరాన్ని పర్యాటకంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో పేరుపాలెం బీచ్‌కు విదేశీ పర్యాటకులు వచ్చేస్థాయిలో అభివృద్ధి ఉంటుందన్నారు. కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న బీచ్‌ ఫెస్టివల్‌కు మొదటి రోజే అనూహ్య స్పందన వచ్చిందన్నా రు. మంత్రులు, ఇతర అతిథులు ముందుగా గాలిలో పా వురాలు ఎగరేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలనం చేశారు. చింతలపూడి ఎమ్మెల్యే వీ ఆర్‌ ఎలీజా, డీసీసీబీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్, డీసీఎంఎస్‌ చైర్మన్‌ యడ్ల తాతాజీ, ఉండి ఇన్‌చార్జి పీవీఎల్‌ నర్సింహరాజు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర నేత చెల్లం ఆనంద ప్రకాషం, పార్టీ కేంద్ర మండలి సభ్యుడు పీడీ రాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా