భద్రాద్రిలో వైభవంగా తెప్పోత్సవం

11 Jan, 2014 05:08 IST|Sakshi
భద్రాద్రిలో వైభవంగా తెప్పోత్సవం

భద్రాచలం, న్యూస్‌లై న్ : ఖమ్మం జిల్లా భద్రాచలంలో శుక్రవారం తెప్పోత్సవం వైభవోపేతంగా జరిగింది. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆరాధన, ఏకాంత తిరుమంజనం, నివేదన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు స్వామి వారు హంసవాహనంపై విహరించేందుకు ఆలయం నుంచి గోదావరి తీరానికి బయలు దేరారు.
 
  వేదమంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, భక్తుల రామనామ స్మరణలతో  శ్రీసీతారామచంద్రస్వామివారిని ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా గోదావరి నదీ తీరానికి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా తయారు చేసిన హంసవాహనంపై స్వామి వారిని ఉంచి వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటల నుంచి  గంటపాటు గోదావరిలో స్వామి వారికి తెప్పోత్సవం నిర్వహించారు. బాణసంచా వెలుగులతో శోభాయమానంగా సాగిన ఈ ఉత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వానికి లోనయ్యారు.

మరిన్ని వార్తలు