ర్యాంకర్‌ కోసం ‘కార్పొరేట్‌’ కొట్లాట

27 Oct, 2017 01:26 IST|Sakshi

నారాయణ విద్యార్థిని కిడ్నాప్‌ చేసిన శ్రీచైతన్య యాజమాన్యం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చదువులో మేటిగా ఉన్న ఓ విద్యార్థికోసం రెండు కార్పొరేట్‌ విద్యాసంస్థలు కొట్లాటకు దిగాయి.  నెల్లూరులోని నారాయణ విద్యాసంస్థలో చదువుతున్న ఓ విద్యార్థిని శ్రీచైతన్య సిబ్బంది  తమ వెంట హైదరాబాద్‌కు తీçసుకెళ్లారు. దీంతో నారాయణ సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి శ్రీచైతన్య సిబ్బందిపై నెల్లూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు పెట్టించారు. వాస్తవానికి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో  కార్పొరేట్‌ విద్యాసంస్థల మధ్య ఈ తరహా వ్యవహారాలు జరుగుతుంటాయి. కానీ విద్యా సంవత్సరం మధ్యలో ఈ ఘటన జరగడం విశేషం.

నెల్లూరు చాకలి వీధికి చెందిన రియాజ్‌ అహ్మద్, ఆరీఫా దంపతుల కుమారుడు ఎండీ ఫాజిల్‌ నగరంలోని ధనలక్ష్మీపురంలో ఉన్న నారాయణ విద్యాసంస్థలో పదో తరగతి చదువుతున్నాడు. చదువులో మేటి అయిన ఫాజిల్‌ నారాయణ హాస్టల్‌లో ఉంటున్నాడు. దీపావళి సెలవుల నేపథ్యంలో ఈనెల 18న ఇంటికొచ్చాడు. ఫాజిల్‌ మంచి ర్యాంక్‌ సాధించే విద్యార్థి కావడంతో 19న శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన లింగాల రమేష్, టి.పార్థసారథిలు అతనింటికి వెళ్లి.. ఫాజిల్‌కు  తమ విద్యాసంస్థలో చేర్పిస్తే ఇంటర్‌ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తామంటూ వలవేశారు. ఫాజిల్‌ తల్లిదండ్రులకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా  20వ తేదీ రాత్రి  ఫాజిల్‌ను తమ వెంట హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.

అక్కడి అయ్యప్ప సొసైటీలో ఉన్న శ్రీచైతన్య రెసిడెన్షియల్‌ క్యాంపస్‌లో ఉంచి చదివిస్తున్నారు. అయితే ఫాజిల్‌ స్కూల్‌కు రాకపోవడంతో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నారాయణ సిబ్బంది ఫాజిల్‌ తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టాలని కోరారు. విద్యాసంస్థల మధ్య కొట్లాటలో తలదూర్చడమెందుకని భావించిన ఫాజిల్‌ తండ్రి రియాజ్‌ అహ్మద్‌ రెండు రోజులపాటు మౌనం వహించారు. ఒత్తిడి పెరగడంతో రెండు రోజులక్రితం హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీ క్యాంపస్‌కు వెళ్లి తన కుమారుడితో ఒకసారి మాట్లాడాలని అక్కడ సిబ్బంది నాగేంద్ర, పి.రెడ్డిని కోరారు. అయితే కుమారుడితో కలవనివ్వకుండానే ఆయన్ను వారు పంపివేశారు. దీంతో ఫాజిల్‌ తల్లి ఆరీఫా బుధవారం రాత్రి నెల్లూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీచైతన్య సిబ్బందిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. నారాయణ యాజమాన్యం నుంచి ఒత్తిడి ఉండడంతో పోలీసులు వివరాలు వెల్లడించడం లేదు. ఐపీసీ సెక్షన్‌ 363 కింద కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు హైదరాబాద్‌కు పయనమైనట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు