ఫోన్‌ చేసిన అరగంటలో.. 

20 Jul, 2020 09:30 IST|Sakshi

నడిరాత్రి ఇంటికి వెళ్లే వీలు లేక దారిపక్కన ఉండిపోయిన ముగ్గురు వ్యక్తులు

సకాలంలో స్పందించి అంబులెన్స్‌ పంపిన కలెక్టర్‌  

కాశీబుగ్గ: కరోనా విధి నిర్వహణలో కలెక్టర్‌ జె.నివాస్‌ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారు. కరోనా బాధితులను ఇళ్లకు చేర్చి మరో సారి తన మంచితనం చూపించారు. మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లతో పాటు మరో వ్యక్తికి ఇటీవల ట్రూనాట్‌ కరోనా పరీక్షలో పాజిటివ్‌ రావడంతో వారిని శ్రీకాకుళం డెంటల్‌ కాలేజీలోని క్వారంటైన్‌కు పంపించారు. వారం రోజుల తర్వాత వారికి నెగెటివ్‌గా నిర్ధారణ కావడంతో సెంటర్‌ నుంచి తిరిగి ఇంటికి పంపించేశారు. అయితే వీరిని తీసుకువచ్చిన అంబులెన్స్‌ డ్రైవర్‌ శనివారం రాత్రి పది గంటలకు వజ్రపుకొత్తూరు మండలం పరిధిలో బెండిగేటు జాతీయ రహదారి వద్ద విడిచిపెట్టేశారు.

అక్కడి నుంచి చా పర దాదాపు 25 కిలోమీటర్లు ఉంటుంది. దీంతో వీరు అనంతగిరి పంచాయతీ వెంకటాపురం గ్రామం వద్ద దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. కొందరు మీడియా ప్రతినిధులు వారిని చూసి పలకరించగా వారు తమ సమస్య చెప్పుకున్నారు. దీంతో మీడియా వారు కలెక్టర్‌ నివాస్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. సరిగ్గా అర్ధగంటలో పలాస నుంచి అంబులెన్స్‌ వచ్చి వారి ముందు ఆగింది. రాత్రి పదకొండు గంటలకు తల్లీకూతుళ్లతో పాటు మరో వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. కలెక్టర్‌ చొరవకు మనసారా కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు