నాగావళి తీరాన.. ఎటువైపో ఓటరన్న..!

2 Apr, 2019 10:46 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: పురాతన నగరం. రెండు నదుల మధ్యన ఒద్దికగా ఒదిగిన పట్టణం. రాజకీయంగా మహామహులను అందించిన నేల. అన్నింటికీ మించి జిల్లా కేంద్రం. వెరసి శ్రీకాకుళం. సిక్కోలు ఇప్పుడు మరో రసవత్తర పోరు చూడబోతోంది. ధర్మాన, గుండ కుటుంబాల మధ్య ఎన్నికల పోరు రసకందాయంలో ఉంది. అభ్యర్థులు బలమైన నేపథ్యాలు కలిగిన వారు కావడం. వారి జీవితాలు జనాలకు తెరిచిన పుస్తకాలు కావడంతో అందరి చూపు ఇటువైపే ఉంది. ఐదేళ్లుగా ధర్మాన జనం ఇబ్బంది పడిన ప్రతి సమస్యపై పోరాడారు. ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపారు. అదే సమయంలో కొత్త అభివృద్ధి పనులేవీ చేయలేదనే అపవాదును గుండ లక్ష్మీదేవి మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జన తీర్మానం ఎలా ఉంటుందో చూడాలి.

1952 నుంచి..
స్వాతంత్య్రం తర్వాతి నుంచి శ్రీకాకుళం రాజకీయంగా కీలకంగానే ఉంది. మొదట్లో ఇక్కడ ద్విసభ్య శాసన సభ్యత్వం ఉండేది. కావాలి నారాయణ మొదటి ఎమ్మెల్యే కాగా ద్విసభ్య శాసన సభ కావడంతో కేఏ నాయుడు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ స్థానం మొదటిలో కాంగ్రెస్‌కు అస్సలు కలిసిరాలేదు. ఒక్క వైఎస్సార్‌పై మాత్రమే ఇక్కడి జనం ప్రేమ చూపించారు. 1952 నుంచి 1962 మినహా 2004 వరకు దాదాపు అన్నిసార్లు కాంగ్రెస్సేతర అభ్యర్థులే గెలవగా.. ధర్మాన ప్రసాదరావు ఆ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేసి 2004లో విజయ ఢంకా మోగించారు. ఆ తర్వాతి ఎన్నికల్లోనూ ఆయనే గెలుపొందారు. 2014లో మాత్రం ఓటమి చవి చూశారు. పదవిలో ఉన్నంత కాలం మాత్రం మర్చిపోలేని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని స్థానిక ప్రజలు చెబుతుంటారు.

తొలి ఎమ్మెల్యేగా కావలి నారాయణ  
♦ శ్రీకాకుళం నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా కావలి నారాయణ గెలుపొందారు. 
♦ అప్పట్లో ద్విసభ్య నియోజకవర్గం కావడంతో రెండో నియోజకవర్గం నుంచి కేఏ నాయుడు గెలుపొందారు. 
♦ అప్పట్లో వీరిద్దరూ కేఎల్‌పీ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు.
♦ 1955లో పి.సూర్యనారాయణ, 1962లో ఎ.తవిటయ్య, 1967లో తంగి సత్యనారాయణ, 1972, 1978లలో చల్లా లక్ష్మీనారాయణ, 1983లో తంగి సత్యనారాయణ, 1985, 1989, 1994, 1999 లలో గుండ అప్పల సూర్యనారాయణ విజయం సాధించారు.
♦ 2004, 2009లలో ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 
♦ 2014లో గుండ లక్ష్మీదేవి శాసనసభ్యురాలిగా ఎంపికై ప్రస్తుతం కొనసాగుతున్నారు.

వైఎస్సార్‌ గుర్తులు..
వైఎస్సార్, ధర్మాన కాంబినేషన్‌ అంటేనే అభివృద్ధికి మారుపేరు. శ్రీకాకుళంలో జరిగిన పనులే అందుకు నిదర్శనం. జిల్లాకు వంశధార, రిమ్స్‌ వైద్య కళాశాల, నాగావళి నదికి కరకట్టలు, అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం మంజూరయ్యాయి. శ్రీకాకుళం నగరం విషయానికి వస్తే రక్షిత మంచినీటి పథకం, నాగావళిపై మూడు వంతెనలు, కలెక్టర్‌ కార్యాలయానికి నూతన భవనాలు, ప్రధాన రోడ్ల విస్తరణ, అరసవల్లి సమీపంలో అధునాతన ఆడిటోరియం, 80 అడుగుల రోడ్డు వారి హయాంలో జరిగినవే. శ్రీకాకుళం మునిసిపాలిటీ నగర పాలక సంస్థగా రూపాంతరం చెందేందుకు అప్పట్లోనే బీజం పడింది. వేలాది మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. పేదలకు ఫించన్లు, రేషన్‌ కార్డులు, అడిగిందే తడవుగా మంజూరు చేశారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం, గార మండలాల్లో పరిశ్రమల ఏర్పాటు కూడా అప్పట్లోనే జరిగాయి. మండలాల్లోని ప్రతి గ్రామానికి రోడ్లు, మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అమలయ్యాయి. చేనేత కార్మికులకు చేయూత లభించింది. ఇలా నియోజకవర్గాన్ని విశేషంగా అభివృద్ధి చేసి సువర్ణ యుగం అంటే ఎలా ఉంటుందో చూపించారు.

ఓటర్ల వివరాలు..
మొత్తం ఓటర్లు : 2,32,456
పురుషులు  : 1,15,959
స్త్రీలు: 1,16,453
ఇతరులు :  44 

ప్రధాన సమస్యలు..
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇక్కట గుండ అప్పలసూర్యనారాయణ భార్య గుండ లక్ష్మీదేవి పోటీ చేశారు. ఐదేళ్లు గడిచాక తాము ఫలానా పనిచేశాం అని చెప్పుకోవడానికి కూడా ఆమె ఏమీ చేయలేదని స్థానికులు అంటున్నారు. ధర్మాన హయాంలో జరిగిన పనులను తమవిగా చెప్పుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. గుండ కుటుంబం నుంచి అప్పలసూర్యనారాయణ నాలుగు పర్యాయాలు, లక్ష్మిదేవి ఒకసారి విజయం సాధించినా ప్రజలు ఆశించినంతగా అభివృద్ధి చేయలేకపోయారు. భూగర్భ డ్రైనేజ్, రింగ్‌ రోడ్డు హామీలు అలాగే ఉండిపోయాయి. వీటికి కనీసం భూ సేకరణ కూడా చేయలేదు. ఇక స్మార్ట్‌సిటీ, అమృత్‌ పథకాలు ద్వారా జరుగుతున్న పనులు కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయి. వీటిని తమ ఖాతాలో వేసుకోవాలని అధికార పార్టీ అభ్యర్థి ప్రయత్నం చేస్తున్నారు.

టికెట్‌.. టికెట్‌
వజ్రపుకొత్తూరు: ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార పార్టీ నాయకులు నానా పాట్లు పడుతున్నారు. అందులో భాగంగా దూర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లు ఊర్లకు రావడానికి ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ప్రచారం చేస్తున్నారు. పలాస ఎమ్మెల్యే శివాజీ అల్లుడు వెంకన్న చౌదరి ఇదే విషయంపై పది మందితో కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. వలస ఓటర్లు అత్యధికంగా ఉన్న వజ్రపుకొత్తూరు, మందస గిరిజన ప్రాంతాలతో పాటు మత్స్యకార ప్రాంతంలోని ఓటర్లను స్వగ్రామాలకు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బస్సు కూడా దూరమైతే ట్రైన్‌ రిజర్వేషన్‌ చేయించడానికి కూడా వెనుకాడడం లేదు. అసలు ఈ ప్రాంతాల్లో యువకులు వలస వెళ్లిపోయిందే స్థానికంగా ఉపాధి కల్పించకపోవడం వల్ల.. ఆ మాట మర్చిపోయి వలస వెళ్లిన వారిని ఓటు కోసం తిరిగి రప్పిస్తున్నారు. నువ్వలరేవు, వజ్రపుకొత్తూరు, అక్కుపల్లి, మెట్టూరు, డోకులపాడు, కంబాలరాయుడుపేట, దేవునల్తాడ, కొత్తపేట, మందస గిరిజన ప్రాంతంలోని వందలాది కుటుంబాలు స్థానికంగా బతుకు లేక పొట్టకూటి కోసం వలస వెళ్లాయి. వారి కోసం ఏనాడూ ఆలోచించని నేతలు ఓట్లు అనగానే బస్సు టికెట్లు ఇచ్చి మరీ రప్పిస్తుండడంతో స్థానికులకు నవ్వు తెప్పిస్తోంది.

కోడ్‌ కూసి 20 రోజులవుతున్నా..

కొత్తూరుమండలం మెట్టూరు బిట్‌2 పునరావాస కాలనీలో ట్రీగార్డులకు అధికార పార్టీ జెండాల రెపరెపలు

ఎల్‌.ఎన్‌.పేట: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి 20 రోజులు దాటిపోతోంది. మరో పది రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. అయినా అధికారులు అధికార పార్టీ జెండాలను తీయించడంలో నిర్లక్ష్యంగానే ఉన్నారు. పాతపట్నం నియోజక వర్గం కొత్తూరు మండలంలోని మెట్టూరు బిట్‌2 పునరావాస కాలనీలో అన్ని వీధుల్లోను సీసీ రోడ్లకు పక్కన మొక్కలు నాటారు. మొక్కల సంవరక్షణ కోసం ఏర్పాటు చేసిన ట్రీగార్డులకు అధికార పార్టీ జెండాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ శిలాఫలకాలను సైతం కప్పలేదు.

మరిన్ని వార్తలు