కరోనా: సిక్కోలుకు చెన్నై దడ

16 May, 2020 08:46 IST|Sakshi
చెన్నై నుంచి ఇటీవల శ్రామిక రైలులో జిల్లాకు చేరుకున్న వలస కూలీలు

చెన్నై దడ జిల్లాను వణికిస్తోంది. అక్కడి నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు కన్పిస్తుండటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఇప్పటివరకు చేసిన పరీక్షల్లో ఊహకందని విధంగా అనుమానిత ఫలితాలు వస్తున్నాయి. చెన్నైలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటం, ఆ రాష్ట్రంలో కోయంబేడు మార్కెట్‌ వైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా మారడంతో అక్కడి నుంచి వచ్చే వారితో ముప్పు ఏర్పడింది. 

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాకు చెన్నై నుంచి పెద్ద ఎత్తున వలస కూలీలు వచ్చారు. శ్రామిక రైలు ద్వారా, ప్రత్యేక బస్సుల్లో, కాలినడకన.. ఇలా పలు రకాలుగా 1200మందికి పైగా స్వస్థలానికి చేరుకున్నారు. వారందరినీ క్వారంటైన్‌లో పెట్టారు. చెన్నైలో ఎక్కువ కేసులు నమోదు కావడంతో అప్రమత్తమైన అధికారులు వచ్చిన వారందరికీ పరీక్షలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రాథమిక పరీక్షల్లో పాజిటివ్‌ ఫలితాలు కనిపిస్తున్నాయి. 

శ్రీకాకుళం రూరల్‌లో ఏర్పాటు చేసిన క్వా రంటైన్‌ సెంటర్‌లో 145మందిని ఉంచగా, వా రిలో కొందరికి ట్రూనాట్‌ పరీక్షల్లో పాజిటివ్‌ వ చ్చింది. వీరంతా బస్సుల ద్వారా చెన్నై నుంచి వచ్చినవారే. పూర్తి స్థాయి నిర్ధారణ కోసం వీఆర్‌డీ ల్యాబ్‌కు వీరి శాంపిల్స్‌ను పంపించారు. తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్‌ మండలాల్లోని క్వారంటైన్‌ సెంటర్లలో శ్రామిక రైలు, బస్సుల ద్వారా చెన్నై నుంచి వచ్చిన వారుండగా వారిలో 14 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా మరికొంతమందికి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ విషయాలను అధికారికంగా ధ్రువీకరించాల్సివుంది.

అప్రమత్తం కావల్సిన పల్లెలు, పట్టణాలు  
చెన్నై నుంచి వచ్చిన వారందరినీ క్వారంటైన్‌లో పెట్టడంతో వారి ద్వారా జిల్లాలో వైరస్‌ వ్యాప్తి చెందదు. కానీ అధికారులకు సమాచారం లేకుండా నడక, ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చి నేరుగా ఇళ్లల్లోకి వెళ్లిపోయిన వారితోనే ప్రమాదం. అటువంటి వారిని పల్లెలు, పట్టణాల్లో ఉన్న వారు గమనించి, అధికారులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. పల్లెల్లో ఇలా స్పందిస్తున్నారు గానీ పట్టణాల్లో ఒకరితో ఒకరికి సంబంధం లేకపోవడంతో అధికార యంత్రాంగం దృష్టికి రావడం లేదు. బయటి నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండేలా అవగాహన కల్పించాలి. అలాగని వివక్ష చూపించి ఇబ్బందులు పెట్టకూడదు.  

ప్రత్యేక దృష్టి సారించాం 
చెన్నై నుంచి వచ్చిన వారిని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాం. శ్రామిక రైలు, బస్సుల ద్వారా వచ్చిన వారిని వెంటనే క్వారంటైన్‌లో పెట్టాం. నడక, ఇతర మార్గాల ద్వారా వచ్చిన వారిని పట్టుకుని క్వారంటైన్‌కు తరలిస్తున్నాం. ఒక్క చైన్నై వచ్చిన వాళ్లనే కాదు ఇతర ప్రాంతాల నుంచి ఎవరొచ్చినా వెంటనే మాకు సమాచారం అందించండి.  
– ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ  

పునరావాస కేంద్రంలో  వైద్య పరీక్షలు
ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్ల వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలోని వలస కారి్మకుల పునరావాస కేంద్రంలో 324 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో కరోనా లక్షణాలు ఉన్న ఐదుగురిని గురువారం రాత్రి జెమ్స్‌ ఆసు పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ సహాయ కేంద్రంలో ఉడిపి ప్రాంతం నుంచి వచ్చిన వలస కూలీలు ఉన్నారు. శ్రీశివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలోని క్వారంటైన్‌ కేంద్రంలో ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని ప్రత్యేక గదులు ఉన్న క్వారంటైన్‌ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తహసీల్దార్‌ సుధాసాగర్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు