మోసపోయి.. జైలుకు చేరువై 

23 Nov, 2019 11:49 IST|Sakshi
ఈజిప్టు దేశంలో ఫొటో తీసుకున్న బగ్గు రమణ 

ఈజిప్టులో సంకట స్థితిలో జిల్లా వాసి బగ్గు రమణ

ఉపాధి కోసం వెళ్తే ఉసురు పోతున్న వైనం

మూడేళ్లుగా జైలులోనే ఉన్నా ఎవరికీ తెలీదు

సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం రూరల్‌ మండలం గూడేం పంచాయతీ చంద్రయ్యపేటకు చెందిన బగ్గు రమణ అనే యువకుడికి ఈజిప్టులో ఉరిశిక్ష పడిందన్న వార్త కలకలం రేపింది. ఈ వార్త తెలిసినప్పటి నుంచి రమణ తల్లిదండ్రులు, స్థానికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఉపాధి కోసం వెళ్లిన బిడ్డకు పట్టిన గతి చూసి తల్లడిల్లిపోతున్నారు. సీమెన్‌ అవుతానని చెప్పి వెళ్లిన కుమారుడి గురించి ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని రోదిస్తున్నారు. మూడేళ్లుగా రమణ అక్కడ జైలు జీవితం గడుపుతున్నా ఇంటికి తెలీకపోవడం విచారకరం పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చంద్రయ్యపేటకు చెందిన బగ్గు రమణ ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యాడు. తాపీ పని చేసుకుంటూ బతికేవాడు. తెలిసిన వారంతా విదేశాలకు ఉద్యోగాలకు వెళ్తుండడంతో కపిలవాయి శ్రీహర్ష అనే దళారీని 2016 ఆగస్టులో ఈయన సంప్రదించారు. దళారీకి సుమారు రూ.4లక్షలు ముట్టచెప్పగా ఓ ఫారెన్‌ షిప్‌ను ఎక్కించేశాడు.

వాస్తవానికి ఆ దళారీ రమణకు సీమెన్‌ ఉద్యోగం అని చెప్పాడు. కానీ ఆ ఉద్యోగానికి సంబంధించి సీడీసీ(కంటిన్యూ డిశ్చార్జ్‌ సర్టిఫికెట్‌) ఇవ్వకుండా, శిక్షణ లేకుండానే ఊరూపేరూ లేని మరో సీడీసీ ఇప్పించి ఇరాన్‌ దేశానికి చెందిన సీలైట్‌కో కంపెనీకు చెందిన అబ్ధాన్‌ ఫిర్‌దోష్‌ షిప్‌ను సెప్టెంబర్‌ 7, 2016న ఎక్కించేశాడు. నిజానికి ఈ షిప్‌ డ్రగ్స్‌ సప్లై చేస్తూ ఇరాన్‌ నుంచి ఈజిప్టుకు వెళ్తుంటుంది. మాదక ద్రవ్యాల రవాణాపై ఈ దేశాలు చాలా కఠినంగా ఉంటాయి. మూడు నెలలు ఆ షిప్‌లోనే రమణ పనిచేశాడు. ఆ తర్వాత 2016 డిసెంబర్‌లో షిప్‌ను ఈజిప్టు కోస్టుగార్డులు పట్టుకున్నారు. అందులోనే ఉన్న రమణను కూడా అరెస్టు చేశారు. మూడేళ్లుగా రమణ జైలు జీవితం గడుపుతున్నాడు. రెండు మూడు నెలలకోసారి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడేవాడు. అయితే జైలు జీవితం అనుభవిస్తున్నట్లుగా ఎవరికీ చెప్పకపోవడం గమనార్హం.

పరారైన దళారీ..  రమణకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినకపిలవాయి శ్రీహర్షవర్మ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈయన మాయమాటలు నమ్మి సీమెన్‌ ఉద్యోగం కోసం వెళ్లిన విశాఖకు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల కిందట మృతి చెందినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈయన విజయవాడలో ఉన్నప్పటికీ ఆధార్, వాహన రిజిస్ట్రేషన్‌లు అన్నీ విశాఖపట్నం కేంద్రంగా చూపిస్తున్నట్లు సమాచారం. ఈ దళాదీ నెలకొల్పిన ఎస్‌కేడీ మెరైన సంస్థ కొన్ని నెలల కిందటే మూతబడింది. ఎంతో మంది యువకుల వద్ద సీమెన్‌ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి రూ.లక్షల కొద్దీ దండుకుని బోర్డు తిప్పేశారు. 

ఎంపీ కిషన్‌రెడ్డికి వినతి పత్రం అందిస్తున్న రమణ బంధువులు

బావమరిది ద్వారా బయటపడింది..  
రమణ జైల్లోనే ఉన్నా.. రెండు మూడు నెలలకు ఓ సారి ఫోన్‌లో మాట్లాడుతూ ఉండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. అయితే 2018 ఏప్రిల్‌లో రమణ చెల్లెలికి వివాహం నిశ్చయమైంది. ఈ శుభకార్యానికి రమణ రాలేదు. దీంతో ఆయన బావమరిది జయరాం దీనిపై ఆరా తీశారు. అప్పటికే జైల్లో ఉన్న రమణ ఇంటికి, స్నేహితులకు ఫోన్‌ చేయడం మానేశాడు. దీంతో రమణ కనిపించడం లేదని 2019 జూన్‌లో శ్రీకాకుళం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో జయరాం ఫిర్యాదు చేశారు. జూలై 29న ఎస్పీ, కలెక్టర్‌కు గ్రీవెన్స్‌సెల్‌లోనూ ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 17న ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖ(ఎన్‌ఆర్‌ఐ) నుంచి జయరాంకు అసలు సందేశం అందింది. మాదక ద్రవ్యాల కేసులో బగ్గు రమణ ఈజిప్టులో అరెస్టయ్యారన్నది ఆ సందేశం సారాంశం. ఈ సంకటం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుండగానే రమణకు ఉరిశిక్ష పడినట్లు తెలియడం కుటుంబ సభ్యులను కలిచివేస్తోంది. దీనిపై పై కోర్టుకు అప్పీల్‌ చేస్తున్నారు. జనవరిలో భవితవ్యం తేలనున్నట్లు సమాచారం.  

ఇదీ కుటుంబ నేపథ్యం  
చంద్రయ్యపేట గ్రామానికి చెందిన అప్పన్న, సత్యవతిలకు ముగ్గురు సంతానం. అందులో బగ్గు రమణ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు ఆనంద్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఒక చెల్లెలు ఉంది. గార మండలం అంబటివానిపేటకు చెందిన వ్యక్తితో 2018లో వివాహం జరిగింది. వీరిది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. గ్రామంలో చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అప్పట్లో చెల్లెలు  వివాహానికి వస్తానని, కొంత మేరకు నగదు పంపిస్తామని చెప్పాడే తప్ప జైలు జీవితం అనుభవిస్తున్నట్లు ఎవ్వరికీ తెలియకపోవడం బాధకరమైన విషయమే. ఒక్కసారిగా రమణకు ఉరిశిక్ష పడినట్లు తెలియడంతో కుటుంబ సభ్యులే కాకుండా గ్రామస్తులంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు