బస్సులన్నీ సీఎం సభకే...

26 Jan, 2019 08:06 IST|Sakshi
శ్రీకాకుళం కాంప్లెక్స్‌లో బస్సుల కోసం వేచిఉన్న ప్రయాణికులు

ప్రయాణికులు, విద్యార్థుల ఇక్కట్లు

గంటలకొద్దీ నిరీక్షణ

కొంతమంది ప్రయాణాలు వాయిదా వేసుకున్న వైనం

సాధారణంగా సీఎం చంద్రబాబు వస్తున్నారంటే జిల్లాకు వరాల జల్లు కురిపిస్తారని, తమ కష్టాల గోడు వెళ్లబుచ్చుకోవాలని ఆశిస్తుంటారు. అయితే ఈయన సభ జిల్లాలోనే కాదు కదా.. విశాఖపట్నం, విజయనగరంలోనూ ఉందని తెలిసినా ప్రయాణికులు, విద్యార్థులు హడలిపోతున్నారు. ఈ విషయం తెలియక చాలామంది రోడ్లపైనా ఆర్టీసీ కాంప్లెక్స్‌లోనూ బస్సుల కోసం గంటకొద్దీ నిరీక్షించి విసిగివేసారి పోతున్నారు. శుక్రవారం అదే జరిగింది.

శ్రీకాకుళం అర్బన్‌: విశాఖపట్టణంలో సీఎం చంద్రబాబు డ్వాక్రా మహిళలతో పసుపు–కుంకుమ–2 పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. దీనికి జిల్లా నుంచి అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలతో ఆర్టీసీ బస్సులను తరలించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా తిరగాల్సిన బస్సుల సంఖ్య సగానికి సగం తగ్గిపోయాయి.

జిల్లా నుంచి తరలించిన ఆర్టీసీ బస్సులివే..
జిల్లాలో నాలుగు డిపోల పరిధిలో 480 బస్సులు ఉండగా, శ్రీకాకుళం –1 డిపో నుంచి 61 బస్సులు, శ్రీకాకుళం –2 డిపో నుంచి 55, పాలకొండ డిపో నుంచి 58, టెక్కలి డిపో నుంచి 34, పలాస డిపో నుంచి 44 బస్సులను మొత్తంగా 252 బస్సులను చంద్రబాబు బహిరంగ సభకు తరలించారు.

గంటల కొద్దీ వేచి ఉన్న ప్రయాణికులు:
ఆర్టీసీ బస్సులు యధావిధిగా తిరుగుతున్నాయన్న ఉద్దేశంతో వచ్చిన ప్రయాణికులు సమయానికి రాకపోవడంతో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌తోపాటు జిల్లాలోని మిగిలిన డిపోల్లో గంటల కొద్దీ నిరీక్షించారు. బస్సులు ఎన్ని గంటలకు వస్తాయో తెలియక ఆపసోపాలు పడ్డారు. విద్యార్ధుల పరిస్థితి కూడా అదేమాదిరిగా తయారైంది.

వచ్చిన బస్సుల కోసం పరుగులు
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రయాణికులతో, విద్యార్థులతో శుక్రవారం కిక్కిరిసిపోయింది. ఇక్కడ పోర్టికోల వద్ద బస్సుల కోసం పడిగాపులు కాశారు. ఎంత సేపటికీ రాకపోవడం, వచ్చిన బస్సులు ఎక్కేందుకు పరుగులు పెట్టడం, వేలాడుతూ ప్రయాణించడం కనింపించింది. స్టూడెంట్స్‌ స్పెషల్‌ బస్సులను సైతం తరలించడంతో విద్యార్థులు ఉసూరుమన్నారు. అధికారం చేతిలో ఉందని, ఇలా బస్సులను తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

రాజాం: రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్‌ కేంద్రంలో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, బొబ్బిలి, పాలకొండ, బలిజిపేట తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ వాహనాలు నిలుపుదలచేయడంతో ప్రయాణికులకు నిరీక్షణ తప్పలేదు. ప్రతి రోజు 300లకు పైగా సర్వీసులు రాజాం కేంద్రంగా నడుస్తున్నాయి. ముఖ్య మంత్రి పుణ్యమా అని వీటిని శుక్రవారం 50 సర్వీసులకు కుదించారు.  

మరిన్ని వార్తలు