వీడని మిస్టరీ

14 Mar, 2018 07:49 IST|Sakshi
శిరీషను ప్రశ్నిస్తున్న డీఎస్పీ

పావనిది హత్యేనని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక

విచారణలో పొంతన లేని సమాధానాలు చెబుతున్న అక్క శిరీష

పాలకొండ: పాలకొండ టీచర్స్‌ కాలనీలో కలకలం రేపిన డైట్‌ విద్యార్థిని పావని అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడలేదు. జనావాసల మధ్య ఉన్న ఇంట్లో ఆమె రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటంపై పోలీసులు మంగళవారం దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ తివిక్రమ వర్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌ అణువణువూ తనిఖీ చేశాయి. అనంతరం పావని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమెది హత్య అని పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా తేలింది. గొంతును విచక్షణ రహితంగా కోసేసినట్లు వైద్యులు చెబుతున్నారు.

నిశితంగా పరిశీలించిన ఎస్పీ
కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎస్పీ తివిక్రమవర్మ నిశితంగా పరిశీలించారు. సంఘటనా స్థలంలో గంటకు పైగా దర్యాప్తు చేశారు. ప్రతి ఆధారాన్ని ఆయన సేకరించారు. ఇప్పటికే కేసుపై ఒక అంచనాకు వచ్చిన ఆయన డీఎస్పీ స్వరూపారాణికి సూచనలిచ్చారు. ప్రస్తుతం పావని, శిరీషల ఫోన్‌ కాల్స్‌ ద్వారా కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్క శిరీషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో శిరీష పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు గుర్తించారు. కేసుపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు బయటకు రాకుండా చూస్తున్నారు.

మనస్పర్థలే హత్యకు దారితీశాయా?
సీతంపేట మండలం పెద్దూరుకు చెందిన పావని, శిరీష తల్లిదండ్రులు చనిపోవడంతో  పాలకొండలోని టీచర్స్‌ కాలనీలో నివసిస్తున్నారు. స్థానిక తమ్మినాయుడు కళాశాలలో పావని డైట్‌ రెండో సంవత్సరం చదువుతోంది. కొంతకాలం నుంచి అక్క శిరీషతో పావనికి గొడవలు జరుగుతున్నాయని కాలనీవాసులు చెబుతున్నారు. అక్క శిరీషతో పాటు ఆమె స్నేహితులు ఇంటికి వస్తుండేవారని, దీంతో పావని వారితో ఇంటికి రావొద్దని వారించేదన్నారు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం పావని వేరే చోటకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. నరసన్నపేటకు సోమవారం ఉద్యోగ రీత్యా వెళ్లిన శిరీష సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి పావని రక్తపు మడుగులో పడిఉండటం, చుట్టూ కత్తులు ఉండటంతో.. వివాదాల నేపథ్యంలోనే పావనిని కావాలనే హత్య చేశారనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మృతదేహం ఉన్న పరిస్థితి, అక్కడ లభ్యమైన ఆధారాలతో పాటు మెడపై లోతుగా గాయమవడంతో ఆమెది హత్యే అని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు