చేతల్లో సుక్కలు.. మాటల్లో డాబులు!

29 Aug, 2019 07:50 IST|Sakshi

చిక్కోలుకు చంద్రబాబు చిక్కులు

పథకం ఉంటుంది.. పనులు జరగవు. జీఓలు జారీ చేస్తారు.. కానీ డబ్బులు విదల్చరు. మాటలు కోటలు దాటుతాయి.. పనులు మాత్రం పాతాళంలో ఉంటాయి. టీడీపీ మార్కు పనితీరు ఇది. శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సుడా) ఏర్పాటులో ఆ వైఖరి మరోసారి తేటతెల్లమైంది. కేవలం ఎన్నికల కోసం, జనాలను మభ్యపెట్టడం కోసం ఎలక్షన్లకు రెండు నెలల ముందు సుడా ఏర్పాటు చేశారు. వాస్తవానికి దీనికి ఒక్క పైసా కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కేవలం కాగితాల వరకు పనులు కానిచ్చి ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకుని పబ్బం గడిపేద్దామని బృహత్తర ప్రణాళిక వేసుకున్నారు. కానీ జన చైతన్యం ముందు వారి తెలివి ఎందుకూ కొరగాకుండా పోయింది.  

సాక్షి, శ్రీకాకుళం : ఐదేళ్లు గడిచిపోయాయి.. జిల్లాకు ఏమీ చేయలేదు. ఇలా ఓట్లు అడగానికి వెళ్తే బాగోదు.. ఇంకెందుకు లేటు ఓ జీఓ జారీ చేసేశారు. పేరు శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సుడా). విధివిధానా లు లేవు. నిధులు అసలే లేవు. కేవలం కాగితాలతోనే పనికానిచ్చేశారు. టీడీపీ నేతలు వేసన ఈ పాచిక ఎన్నికల్లో పారలేదు. దీంతో సుడాను గత ప్రభుత్వ నేతలు మధ్యలోనే వదిలేశారు. ఓట్ల కోసం ప్రజల్ని ఊహల్లో ఊరేగించారే తప్ప కార్యరూపంలోకి తీసుకురాలేదు. కేవలం కాగితాలకే పరిమితమైన సుడాను ఏం చేయాలన్నదానిపై ప్రస్తుత ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 

ఒక్క పైసా కేటాయించకుండా 
పట్టణాభివృద్ధి పేరుతో ఎన్నికలకు రెండు నెలల ముందు(ఫిబ్రవరి 12న) శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) ఏర్పాటు చేశారు. జిల్లాలో ఐదు మున్సిపాల్టీలు, 28 మండలాలు, 1264 గ్రామాలను కలుపుతూ 20.58లక్షల జనాభాతో పట్టణాభివృద్ధి సంస్థను ప్రకటించా రు. జాయింట్‌ కలెక్టర్‌ను వైస్‌ చైర్మన్‌గా, డిస్ట్రిక్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారి(డీటీసీపీఓ)ను ప్లానింగ్‌ అధికారిగా, డీటీసీపీఓ సిబ్బందిని సు డా సిబ్బందిగా నియమిస్తూ జీవో జారీ చేశారు. కానీ అది కాగితానికే పరిమితమైంది. సుడా తరఫున ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఒక్క భవనాన్ని నిర్మించలేదు. బ్యాంకు ఖాతా ప్రా రంభిస్తే నిధులు విడుదల చేస్తానంటూ చెప్పా రు. దీంతో అధికారులు ఐసీఐసీఐలో బ్యాంకు ఖాతా తెరిచారు. కానీ ప్రభుత్వ  ఒక్క పైసా జమ చేయలేదు. కాకపోతే భవన క్రమబద్ధీకరణ, లేఅవుట్‌ అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోవాలంటూ ఆదేశాలు మాత్రం ఇచ్చారు. మున్సిపాల్టీల వారీగా బీపీఎస్, ఎల్‌పీఎస్‌ తది తర దరఖాస్తులు అన్నింటిని సుడాకే పంపాలని ఆదేశాల్లో పేర్కొంది.  

సుడా పేరుతో చెలరేగిపోయిన టీడీపీ నేతలు
సుడా ఏర్పాటైందని భవన క్రమబద్ధీకరణ, లే అవుట్‌ అనుమతుల కోసం జిల్లాలోని మండలాలు, మున్సిపాల్టీల నుంచి దరఖాస్తులొచ్చా యి. ఇదే అవకాశంగా టీడీపీ నేతలు మరింత చెలరేగిపోయారు. ప్రభుత్వమే సుడా ఏర్పాటు చేసినందున ఏదో ఒక రకంగా అనుమతులు తెచ్చుకోవచ్చని ముందస్తుగా పెద్ద పెద్ద రియల్‌ ఎస్టేట్లు వేసేశారు. సుడా అనుమతులొచ్చాయ ని అందమైన బ్రోచర్లతో ప్రచారం సాగించి, ప్లా ట్ల విక్రయాలు చేసేశారు. రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు, రాజాం, నరసన్నపేట, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా లేఅవుట్లు వేసి అమ్మకాలు సాగించారు. సుడా ఏర్పాటైన తర్వాతే 75వరకు అనధికార లే అవుట్లు వేసినట్టుగా తెలుస్తున్నది.

అధికారంలో ఉన్నాం ఎలా వేసినా ఫర్వా లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు చెల్లించకుండా, సామాజిక స్థలా లు కే టాయించకుండా ఇష్టారీతిన లేఅవుట్లు వేశారు. కానీ స్పష్టత, విధివిధానాలు లేకపోవడంతో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిష్కరిం చలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయింది. ఒక్క పైసా లేకుం డా పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయడం చరిత్రలో ఎప్పుడూ లేదని సాక్షాత్తు అధికార వర్గాలే ముక్కున వేలేసుకున్నాయి. ప్రచారం కోసం, ప్రజల్ని మభ్యపెట్టేందుకు వేసిన ఎత్తుగడ, వ్యూహాత్మక పన్నాగం తప్ప సుడాతో ఒరి గిందేమీ లేకుండా పోయింది. దీంతో సుడా ఏర్పాటే ప్రశ్నగా మిగిలిపోయింది. 

గత పాపాలను సరిదిద్దే పనిలో..
అసలు సుడా ఉందా? లేదా అన్న అనుమానాలొచ్చేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో 94 మంది నుం చి దరఖాస్తులు వచ్చాయి. కాకపోతే, వాటిని ఎలా పరిష్కరించాలి? ఏం చేయాలి? అన్న దానిపై స్పష్టమైన విధివిధానాలు జారీ చేయలేదు. ఉండటానికి భవనమే లేకపోవడంతో అధికారులు ముందుకెళ్లలేకపోయారు. ఇదంతా గమనించిన కొత్త ప్రభుత్వం ఒక్కసారిగా అవాక్కయింది. పైసా లేకుండా ఏర్పాటు చేసిన సంస్థతో ప్రయోజనమేంటన్న అభిప్రాయాని కొచ్చింది. స్పష్టత లేని పరిస్థితుల్లో సుడా కార్యకలాపాలు నిలిపివేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బీపీఎస్, ఇతరత్రా కార్యకలాపాలను మున్సిప ల్‌ ఆర్‌డీడీ, డిస్ట్రిక్ట్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ అ«ధికారికి పంపిం చాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగితా నికి పరిమితమై అస్పష్టంగా ఉన్న సుడా వ్యవహారాన్ని పక్కన పెట్టి ఇంతవరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధిత మున్సిపాల్టీలకు పంపిం చి, వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.   

సుడా కార్యలాపాలు నిలిపివేశాం
స్పష్టత లేకపోవడం, ప్రత్యేక కార్యాలయం, పైసా నిధులు లేకపోవడంతో అయోమయంగానే సుడా ఉండేది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సుడా కార్యకలాపాలు నిలిపివేసి, బీపీఎస్, లేఅవుట్‌ అనుమతుల తదితర దరఖాస్తుల పరిష్కార బాధ్యతను మళ్లీ మున్సిపల్‌ ఆర్‌డీ,డీటీసీపీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ రకంగానే చర్యలు తీసుకుంటున్నాం. 
– పి.నాయుడు, డిస్ట్రిక్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారి

>
మరిన్ని వార్తలు