వెండి అంబారీపై పరమేశ్వరుడు..

18 Feb, 2020 09:27 IST|Sakshi
ముక్కంటి కొడి ఉత్సవం

సాక్షి, శ్రీకాళహస్తి : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు సోమవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కొడి ఉత్సవాన్ని ఆలయ ప్రధానార్చకులు, వేదపండితులు, పూజార్లు వేదమంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి పురాణాల్లో ఒక గాథ కూడా ఉంది. పాలసముద్రాన్ని చిలికినపుడు ఉద్భవించిన హాలాహలాన్ని మింగిన శివుడు రాక్షసుల నుంచి విశ్వాన్ని రక్షించాడు. లోకకల్యాణార్థం పరమశివుడు హాలాహలం మింగి తన కంఠంలో దాచుకుని మగత నిద్రలోకి వెళ్లిపోతారు. స్వామివారిని మేల్కొల్పేందుకు దేవతలు చేసే మొదటి ఉత్సవాన్ని ధ్వజారోహణం అని పిలుస్తారు. ఈ రాత్రిని దేవరాత్రి అని పిలుస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా స్వామి వారి గర్భాలయం ఎదురుగా ఉన్న బంగారు ధ్వజస్తంభానికి ఆలయ వేదపండితులు, ప్రధానార్ఛకులు కలశాలు స్థాపించి, హోమం వెలిగించి స్వామివారి దేవేరి అయిన శ్రీజ్ఞానప్రసూనాంబ, భక్తకన్నప్ప, సుబ్రమణ్యస్వామి, వినాయకస్వామి, చండికేశుడు కలిసి పంచమూర్తులను చతురస్రాకారంలో నిలిపి పలు రకాల పుష్పాలతో విశేష రీతిలో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలశాల్లోని పవిత్ర గంగా జలాలతో ధ్వజస్తంభానికి అభిషేకించారు.

భక్తులు సమర్పించిన కొడి చీరలతో ధ్వజస్తంభాన్ని అలంకరించారు. ఉత్సవమూర్తులకు ఆలయ వేదపండితులు, అర్చకస్వాములు ధూపదీప నైవేద్యాలను సమరి్పంచి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. స్వామి వారి ధ్వజారోహణ పూజల్లో ఆలయ ఈఓ చంద్రశేఖర్‌ రెడ్డి, ఎమ్మెల్యే బియ్యపు మ«ధుసూదన్‌ రెడ్డి దంపతులు, అంజూరుతారక శ్రీనివాసులు, డీఎస్పీ నాగేంద్రుడు, ఆలయ అర్చకస్వాములు, వేదపండితులు, ప్రధానార్చకులు సంబంధం స్వామినాథన్‌ గురుకుల్, కరుణాకర్‌ గురుకుల్, అర్ధగిరి ప్రసాద్‌ శర్మ, శివప్రసాద్‌శర్మ, శ్రీనివాస శర్మ, మారుతీశర్మ తదితరులతోపాటు ఆలయ ఈఈ వెంకటనారాయణ, ఇంజినీరింగ్‌ సిబ్బంది, ఆలయ ఏఈఓలు మోహన్, రంగస్వామి, తదితరులు పాల్గొన్నారు.  «ధ్వజారోహణ పూజలకు శ్రీకాళహస్తిలోని బహుదూర్‌పేటకు చెందిన బయ్యా నాగమ్మ, ఆమె కుమారులు ఉభయదారులుగా వ్యవహరించారు.

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు సోమవారం ఉదయం స్వామీఅమ్మవార్లు, పంచమూర్తులతో కలసి పురవీధుల్లో ఊరేగారు. అలాగే ఉత్సవమూర్తులకు ముందు ఒంగోలు జాతికి చెందిన నందులు రెండు నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అయితే ఈ నందులు రెండు కూడా శ్రీకాళహస్తీశ్వరాలయ గోశాలలో పుట్టి పెరిగాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఉత్సవమూర్తులను రాజేంద్ర గురుకుల్‌  విశేషరీతిలో అలంకరించి ప్రత్యేక పూజలు చేసి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు ముందు మేళతాళాలు బ్యాండ్‌ వాయిద్యాలు, తోరణాలు, గొడుగులు, వివిధ రకాల నాట్య కళాకారుల నృత్యాలు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ నాగేంద్రుడు, ఉభయదారులు బయ్యానాగమ్మ, ఆమె కుమారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.  

నేటి వాహన సేవలు 
శ్రీకాళహస్తి: శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రెండో తిరునాళ్లు నిర్వహించనున్నారు. ఈ తిరునాళ్లను భూతరాత్రి అంటారు. ఈ సందర్భంగా స్వామివారిని నిద్రలేపేందుకు భూతగణాలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తాయని ప్రతీతి. అందుకే ఈ రాత్రిని భూతరాత్రి అని పిలుస్తారు. శ్రీస్వామిఅమ్మవార్లు ఉదయం సూర్యప్రభ, చప్పరం వాహనాలపై రాత్రి భూత–శుక వాహనాల్లో ఊరేగి, భక్తులకు దర్శన భాగ్యం కలి్పస్తారు. ప్రతి ఏటా హరిజన సేవాసంఘం వారు ఉభయదారులుగా వ్యవహరిస్తారు.  

అనుబంధ ఆలయాల్లో శివరాత్రి వేడుకలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న 9 శివాలయాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 21 శుక్రవారం విశేష అభిషేకాలు, ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పెద్దకన్నలి గ్రామంలో వెలసిన శ్రీదుర్గాంబికా సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి 24 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. 20వ తేదీ కలశ స్థాపన, ధ్వజారోహణం, 21న మహా శివరాత్రి అభిషేకం, రాత్రి లింగోద్భవం, 22వ తేదీ విశేష అభిషేకం, అలంకారం, 23న స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం, మధ్యాహ్నం అన్నదానం, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. 24న కలశ ఉద్వాసన, ధ్వజావరోహణం కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. 

ఊరందూరులో... 
ఊరందూరు గ్రామంలో వెలసిన శ్రీనీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో 21వ తేదీన శుక్రవారం మహాశివరాత్రి రోజున ఉదయం 8 గంటలకు అభిõÙకం, 9 గంటలకు గ్రామోత్సవం నిర్వహించనున్నట్టు వివరించారు. వేడాం వేయి లింగాల కోన సహస్రలింగేశ్వర స్వామి, విరూపాక్షపురంలో వెలసిన అర్ధనారీశ్వర స్వామివారి ఆలయం, చల్లేశ్వరస్వామి ఆలయం, నీలకంఠేశ్వర స్వామి ఆలయం, శ్రీకాళహస్తి పట్టణంలో ముత్యాలమ్మ వీధిలో వెలసిన చక్రేశ్వరస్వామి ఆలయం, దుర్గమ్మ కొండ కింద ఉన్న దుర్గేశ్వరస్వామి ఆలయం(దుర్గా మల్లేశ్వర స్వామి), బొక్కిసంపాలెం గ్రామంలో వెలసిన కోదండ రామేశ్వరస్వామి ఆలయాల్లో 21వ తేదీ ఉదయం 8 గంటలకు అభిõÙకం నిర్వహిస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు