కరోనా వైరస్‌: వారంతా సేఫ్‌

2 Apr, 2020 08:41 IST|Sakshi
పలమనేరుకు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రావడంతో పెద్ద మసీదు వీధిని తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు 

మత ప్రార్థనలు కోసం వెళ్లి వచ్చిన వారికి కరోనా 

ఒక్క రోజే 5 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు 

క్వారంటైన్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 303 మంది

సాక్షి, తిరుపతి: దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన వారు.. వారికి తెలియకనే కరోనాను మోసుకొచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 46 మంది ఢిల్లీలో గత నెలలో జరిగిన మత ప్రార్థనలో పాల్గొనేందుకు వెళ్లారు. వారంతా ఇటీవలే జిల్లాకు చేరుకున్నారు. అయితే వారికి కరోనా సోకింది అనే విషయం తెలియక యథావిధిగా జన సంచారంలో కలిసిపోయి తిరిగారు. తెలంగాణలో రెండు రోజుల క్రితం జరిగిన మరణాలతో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి కరోనా సోకిందని తెలుసుకుని అధికార యంత్రాంగంతో పాటు ఆ మతస్తులు షాక్‌ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించారు. (యువకులపై పంజా)

వారి రక్త నమూనాలను పరీక్షించారు. ఆ పరీక్షల్లో ఐదుగురికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. పలమనేరుకు చెందిన ఇద్దరు, గంగవరానికి చెందిన ఒకరు, శ్రీకాళహస్తి, ఏర్పేడుకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. ఒకేసారి ఐదు కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. మరి కొందరు జిల్లాకు చెందిన వారు ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన క్వారంటైన్‌లో ఉన్నారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో మరి కొందరి వైద్య పరీక్షల నివేదిక రావలసి ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకేసారి ఐదుగురికి పాజిటివ్‌ అని తేలడంతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. (టిక్‌టాక్‌ భారీ విరాళం)

వారంతా సేఫ్‌ 
ఢిల్లీ నుంచి వచ్చిన వారు మినహా... విదేశాల నుంచి వచ్చిన స్థానికులంతా సేఫ్‌ జోన్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీకాళహస్తికి చెందిన యువకుడు ఇటీవల లండన్‌ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. అతనికి పాజిటివ్‌ నమోదు కావడంతో అతన్ని తిరుపతిలోని పాత ప్రసూతి ఆస్పత్రిలో ఉంచి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వారి బంధువులందరిని శ్రీపద్మావతి నిలయంలో ఉంచారు. వారందరికీ నెగటివ్‌ రిపోర్ట్‌ వచ్చిన విషయం తెలిసిందే. అయినా వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొందరిని హోం క్వారంటైన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.(మద్యం..మంట)

మరిన్ని వార్తలు