మెట్టకు ‘రైలు’ వచ్చేనా!

30 Mar, 2019 09:25 IST|Sakshi

కలగానే శ్రీకాళహస్తి–నడికుడి రైలు మార్గం

కేంద్రం సిద్ధంగా ఉన్నా ముందుకు రాని బాబు సర్కార్‌

ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి

సాక్షి, కావలి: జిల్లాలోని మెట్టప్రాంత ప్రజల దశాబ్దాల స్వప్నం శ్రీకాళహస్తి–నడికుడి రైలు మార్గం. 2020 నాటికి ఈ రైలు మార్గం పూర్తి చేయాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భూసేకరణే పూర్తి కాని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం అన్నింటికీ సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. జిల్లాలోని వందలాది పడమటి పల్లెల ప్రజలు శ్రీకాళహస్తి–నడికుడి మార్గంలో రైలు కూత వినాలనే ఆకాంక్షతో ఉన్నా చంద్రబాబు ప్రభుత్వ అటకెక్కించింది.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని నడికుడి వరకు పడమట పల్లెల్లో నూతన రైలు మార్గం నిర్మించాలని, ఆ రైలు మార్గం జిల్లాలో కూడా మెట్టప్రాంతంలోని పల్లెల మీదుగా నిర్మించాలని 50 ఏళ్ల నుంచి ప్రజలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఈ రైలు మార్గాన్ని నిర్మించేందుకు అంగీకరించింది. అయితే గుంటూరు జిల్లాలోని నడికుడి జంక్షన్‌ రైల్వేస్టేషన్‌ నుంచి కాకుండా, అక్కడికి 25 కిలోమీటర్లు దూరంలో ఉన్న రాజుపాళెం మండలం అనుపాలెం అనే గ్రామం నుంచి ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నుంచి కాకుండా నెల్లూరు జిల్లాలోని  వెంకటగిరి వరకే ఈ రైలు మార్గాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకున్నారు.


అటకెక్కిన భూసేకరణ 
ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా వ్యయాన్ని భరించి భూసేకరణ చేసి రైల్వేశాఖకు అప్పగించాల్సి ఉంది. జిల్లాలోని వరికుంటపాడు, కొండాపురం, కలిగిరి, వింజమూరు, ఏఎస్‌పేట, ఆత్మకూరు, చేజర్ల, పొదలకూరు, రాపూరు, డక్కిలి, వెంకటగిరి మండలాల్లోని 2,267.77 ఎకరాల భూమిని సేకరించాల్సిఉంది. ఇందులో ప్రభుత్వ భూమి 777.09 ఎకరాలు కాగా, మిగిలిన పట్టా భూములు 1,054.54 ఎకరాలు, అసైన్డ్‌ భూములు 436.14 ఎకరాలు గుర్తించారు. అంటే 1,590.68 ఎకరాల భూమికి సంబంధించిన యజమానులకు నష్టపరిహారం చెల్లించాల్సిఉంది.

ఎకరాకు కనీసం రూ.4.25 లక్షల నుంచి గరిష్టం రూ.15 లక్షల వరకు ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్కెట్‌ ధరను బట్టి నిర్ణయించాల్సిఉంది. రూ.100 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించాల్సివస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం నిధుల విడుదలకు ఆసక్తి చూపకపోవడంతో  అధికారులు కూడా భూములకు ప్రాంతాల వారీగా నష్టపరిహారం చెల్లించడానికి ధరలు కూడా ఖరారు చేయకుండా పక్కన పెట్టేశారు. 


నిర్మాణానికి నిధుల మాటేమిటో..
కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన నిధులతోనే భూసేకరణ జరిపి రైల్వేశాఖకు భూములు అప్పగించాల్సిఉంది. అలాగే రైలు మార్గం నిర్మాణంలో అయ్యే ఖర్చులో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. రైలు మార్గం ఖర్చు రూ.2,454 కోట్లు అవుతుంది. జిల్లాలో భూసేకరణకు నిధులు మంజూరు చేయకుండా రెండేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక నిర్మాణానికి నిధులు ఎప్పటికి మంజూరు చేస్తుందోనని అధికారవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కాగా చంద్రబాబు ప్రభుత్వ వైఖరి వల్ల 2020 నాటికి ఈ మార్గం పూర్తి కావాలనే లక్ష్యం నేరవేరే పరిస్థితి లేకుండాపోయింది. 


అసమగ్రంగా స్టేషన్ల ఏర్పాటు
శ్రీకాళహస్తి–నడికుడి రైలు మార్గం పొడవు 308.7 కిలోమీటర్లు కాగా అందులో నెల్లూరు జిల్లాలోనే 146.11 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం రైల్వేస్టేషన్లు 33 కాగా, జిల్లాలో 15 ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న ఈ రైలు మార్గంలో జిల్లాలోనే ఎక్కువ స్టేషన్లు నిర్మించనున్నారు. అయితే కొండాపురం, కలిగిరి, పొదలకూరు మండలాల్లోని భూములు కూడా రైలు మార్గం నిర్మాణానికి తీసుకుంటున్నప్పటికీ ఆ మండలాల్లో ఒక్క రైల్వేస్టేషన్‌ కూడా నిర్మించడం లేదు.

వరికుంటపాడు మండలంలోని కొల్లువారిపల్లె, వింజమూరు మండలంలో గోళ్లవారిపల్లె, రావిపాడు, వింజమూరు గ్రామాల్లో రైల్వేస్టేషన్లు ఏర్పాటు కావాల్సిఉంది. ఏఎస్‌పేట మండలంలో దూబగుంట, ఆత్మకూరు మండలంలో పమిడిపాడు, ఆత్మకూరు, చేజర్ల మండలంలో ఓబులాయపల్లె, కొత్తూరు, రాపూరు మండలంలో వెంకటాపురం, ఆదూరుపల్లి, రాపూరు, డక్కిలి మండలం వెల్లంపల్లి, ఆల్తూరుపాడు, వెంకటగిరి మండలంలో బాలసముద్రం గ్రామాల్లో రైల్వేస్టేషన్లు నిర్మించాల్సిఉంది. ఈ రైలు మార్గం నిర్మిస్తున్న జిల్లాలోని 11 మండలాల్లో పెద్ద మండలాలు పొదలకూరు, కలిగిరి. ఈ మండలాల్లో కనీసం ఒక్క రైల్వేస్టేషన్‌ కూడా నిర్మించడం లేదు.

పొదలకూరు మండలంలో, పక్కనే ఉన్న సైదాపురం మండలంలో నిమ్మతోటలు భారీగా ఉన్నాయి. ఈ మండలాల్లోని నిమ్మకాయలు దక్షిణ, ఉత్తర భారతదేశంలోని చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, కొచ్చిన్, త్రివేండ్రం, కలకత్తా, న్యూఢిల్లీ, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల మార్కెట్‌కు రవాణా అవుతున్నాయి. పొదలకూరు మండలం మీదుగా రైలు మార్గం ఉన్నప్పటికీ కనీసం రైల్వేస్టేషన్‌ను లేకపోవడంతో గమనార్హం. భూసేకరణకే నిధులు మంజూరు చేయని చంద్రబాబు ప్రభుత్వం మెట్టప్రాంత ప్రజల దశబ్దాల నాటి రైలుమార్గం స్వప్నాన్ని నీరుగారుస్తోంది.


రవాణాకు అనువు
ప్రస్తుతం ఉన్న విజయవాడ–చెన్నై రైలు మార్గానికి శ్రీకాళహస్తి–నడికుడి రైలు మార్గం బలమైన ప్రత్యామ్నాయ రైలు మార్గంగా ఉపయోగపడుతుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. తుపాన్లు, వరదలతో కోస్తా తీరానికి సమీపంలో ఉన్న విజయవాడ–చెన్నై రైలు మార్గంలో అంతరాయం ఏర్పడినప్పడు, రద్దీ ఏర్పడినప్పడు శ్రీకాళహస్తి–నడికుడి రైలుమార్గం అందుబాటులో ఉండడం వల్ల దక్షిణ–ఉత్తర భారతదేశాలకు అనుసంధానమైన వాణిజ్య రవాణాకు అనువుగా ఉంటుందని రైల్వే వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు