దేవుడి వెండి స్వాహా!

21 Apr, 2018 11:29 IST|Sakshi
శ్రీకాళహస్తి దేవాలయం ,దుర్గ గుడి

శ్రీకాళహస్తి, శ్రీశైలం, దుర్గ గుడిలోని 16,559 కిలోల వెండి అమ్మకం   

బహిరంగ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.43 వేల పైమాటే  

ఆలయాలకు దక్కింది కిలోకుసగటున రూ.33 వేలే  

ఈ–వేలం కాకుండాఎంఎంటీసీ ద్వారా విక్రయం  

ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులకు రూ.16 కోట్ల కమీషన్లు  

సాక్షి, అమరావతి : బంగారం కొట్టులో కిలో వెండి (కడ్డీ రూపంలోని వెండి) ధర ప్రస్తుతం రూ.43 వేల దాకా పలుకుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ కిలో వెండి ధర రూ.40,642 నుంచి రూ. 43,042ల మధ్యలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కిలో వెండిని సగటు ధర రూ.33 వేల చొప్పున విక్రయించింది. అంటే కిలోకు రూ.10 వేల నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన 16,559 కిలోల వెండిని ప్రభుత్వం అమ్మేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కలిసి రూ.16కోట్లు కమీషన్ల రూపంలో కొట్టేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

ధర ఇంత తక్కువా?
దేవదాయ శాఖ పరిధిలోని ప్రధాన ఆలయాల్లో భక్తులు సమర్పించిన వెండి ఆభరణాల నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఆ వెండిని అమ్మి, వచ్చిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేయాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు గతేడాది జులైలో నిర్ణయించారు. దేవుడి అలంకరణకు ఉపయోగించని వెండి ఆభరణాలను కరిగించి, కడ్డీల రూపంలోకి మార్చాలని ఆయా ఆలయాల ఈవోలను ఆదేశించారు. వెండి ఆభరణాలను కడ్డీల రూపంలోకి మార్చిన తర్వాత.. శ్రీకాళహస్తి ఆలయానికి చెందిన 14,936.040 కిలోలను ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో రూ.49.38 కోట్లకు విక్రయించారు. కిలోకు సరాసరి ధర రూ.33,063 చొప్పున శ్రీకాళహస్తి ఆలయానికి అందింది. విజయవాడ దుర్గ గుడికి చెందిన 1,123.696 కిలోల వెండి కడ్డీలను రూ.3,68,88,506 కు ఇటీవల అమ్మారు. కిలోకు సరాసరి ధర రూ.32,827 చొప్పున ఆలయానికి దక్కింది. శ్రీశైలం ఆలయానికి చెందిన 500 కేజీల వెండిని కూడా తక్కువ ధరకే అమ్మేశారు. 

అర గంటలో వేలం ముగింపు  
ఆలయాల్లో ఏ పనికైనా ఈ–టెండర్‌ విధానాన్ని అమలు చేసే దేవాదాయ శాఖ భారీ మొత్తంలో వెండి అమ్మకానికి మాత్రం కేవలం అరగంటలో వేలం ప్రక్రియ ముగిసే విధానాన్ని ఎంపిక చేసుకుంది. బంగారం, వెండి వంటి వస్తువుల అమ్మకం, కొనుగోలుకు మధ్యవర్తిత్వం వహించే కేంద్ర ప్రభుత్వరంగ బ్రోకరేజీ సంస్థ ఎంఎంటీసీ ద్వారానే వెండి అమ్మకం జరపాలని ప్రభుత్వం దేవాదాయ శాఖను ఆదేశించింది. ఎంఎంటీసీ ద్వారా జరిగే వేలం ప్రక్రియ అరగంట వ్యవధిలోనే ముగుస్తోంది. ఆ సమయంలో అన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన వెండిని ఎవరు ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ముందుకొస్తారో వారికే బిడ్‌ ఖరారు చేస్తారు.

ముందే సమాచారం లీక్‌  
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ ద్వారా వేలం ప్రక్రియ కొనసాగినప్పటికీ.. కేవలం ఆరగంట పాటు కొనసాగే వేలాన్ని ఏ రోజు, ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై రెండు రోజుల ముందే ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇచ్చేలా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తమకు బాగా కావాల్సిన వ్యక్తులతో దేవుడి వెండిని కొనిపించి, కమీషన్లు కొట్టేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు