భరత వేదముగా..నిరత నాట్యముగా...

1 Nov, 2018 12:30 IST|Sakshi
భరత వేదముగా... నిరత నాట్యముగా అంటూ పౌర్ణమి సినిమాలోని నృత్య గీతికకు లయబద్దంగా అగ్ని ముంతలతో నృత్యం చేస్తున్న శ్రీలక్ష్మి

నృత్య ప్రదర్శనలతో ప్రతిభను చాటుతున్న శ్రీలక్ష్మి

పౌర్ణమి చిత్రంలో ఛార్మి నృత్య  గీతానికి ధీటుగా నర్తనం

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌: భరత వేదముగా.. నిరత నాట్యముగా.. అంటూ పౌర్ణమి సినిమాలో కథానాయకి ఛార్మి చేసిన నృత్య గీతం సంగీతాభిమానులనే కాదు.. నాట్యాభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ నృత్య గీతికలో ఛార్మి ప్రదర్శించిన నాట్య హోయలు.. నాట్య భంగిమలు.. అభినయాలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాల్లో ఆ నృత్యాన్ని తిలకిస్తున్నామన్న అనుభూతిని అమలాపురానికి చెందిన ఓ నాట్య మయూరి తన ప్రదర్శనలతో కలిగిస్తోంది. తలపైన... రెండు అరచేతుల్లో అగ్ని కీలలతో మండతున్న ముంతలను ఉంచుకుని నాట్యమాడే ఆ ఎనిమిది నిమిషాల గీతానికి ఈ నర్తకి నయన మనోహరంగా నాట్యం చేస్తుంది. అమలాపురంలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న అడపా శ్రీలక్ష్మి గత ఎనిమిదేళ్లలో అనేక నృత్య ప్రదర్శనలతో ఎంతో పేరు తెచ్చుకుంది. తన పదో ఏట నుంచే నృత్యం వైపు నడక మొదలు పెట్టింది.

ఫ్రెంచి యానానికి చెందిన నాట్య గురువు నల్లా హైమావతి వద్ద నాట్యం నేర్చుకుంది. జిల్లాలో ఎక్కడ నృత్య పోటీలు ఏర్పాటు చేసినా. ఏదైనా సభలు, వేడుకలు జరిగినా ఆరంభంలో శ్రీలక్ష్మి నృత్య ప్రదర్శన విధిగా ఉంటుంది. శ్రీలక్ష్మి తల్లిదండ్రులు అడపా శ్రీమన్నారాయణ, మల్లేశ్వరి కూడా ఆమె అభీష్టానికి బాసటగా నిలిచి ప్రోత్సహించారు. ఓ సారి తన నృత్య ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన సినీ నటుడు కృష్ణంరాజు దంపతులు శ్రీలక్ష్మిని అభినందించి ఆశీర్వదించారు. పౌర్ణమి సినిమాలో ‘భరత వేదముగా...నిరత నాట్యముగా’ నృత్య గీతికను ప్రదర్శిస్తే ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు.. బహుమతుల పంటలు పరిపాటి. శ్రీలక్ష్మికి నృత్యంతో పాటు ఇటీవల కాలంలో సినిమాల్లో నటించాలన్ని కోరిక కూడా తోడైంది. సినీ ఆర్టిస్ట్‌ కావాలన్న లక్ష్యంతో కోనసీమలోని ఔత్సాహిక సినీ కళాకారులకు వేదికగా ఇటీవల ఏర్పాటైన కోనసీమ ఫిలిం క్లబ్‌లో శ్రీలక్ష్మి సభ్యత్వాన్ని పొంది ఏదైనా సినిమాలో అవకాశం వస్తే అల్లుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. నర్తకిగా కీర్తిని సాధించాలని.. నటిగా సినిమాల్లోకి వెళ్లాలన్న ఆమె లక్ష్యాలు నెరవేరాలని ఆశిద్దాం.

మరిన్ని వార్తలు