దువ్వాడ శ్రీనివాస్ సవాల్‌

29 Jan, 2020 18:22 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు అడ్డంపడుతున్నారని శ్రీకాకుళం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్‌ను రాజధానిగా ఎందుకు అంగీకరించడం లేదో ఎంపీ రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. వైజాగ్‌ రాజధాని కోసం వైఎస్సార్‌సీపీ కృషి చేస్తుంటే టీడీపీ నాయకులు ఎదురు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

అధికార వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. సీఎం జగన్‌ ప్రజల నాయకుడని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఒక్క ప్రాంతాన్నే అభివృద్ధి చేస్తే ప్రాంతీయ విద్వేషాలు పెరిగే అవకాశముందన్నారు. అమరావతి రాజధాని కావాలంటున్న టీడీపీ నాయకులు హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకున్నారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్రకు ఎప్పుడూ ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, అమరావతి పేరుతో కోట్ల రూపాయలు కైంకర్యం చేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతంలోనే పుట్టిన అచ్చెన్నాయుడు వైజాగ్‌ను రాజధానిగా వ్యతిరేకించడాన్ని దుయ్యబట్టారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

రెండెకరాల స్థాయి నుంచి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని అచ్చెన్నాయుడిని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడి తలపై ఉన్న గాయాలే ఆయన రక్తచరిత్రకు సాక్ష్యాలని అన్నారు. ఎంతో మంది జీవితాలను ఆయన నాశనం చేశాడని, అచ్చెన్నాయుడి అక్రమాలకు సాక్ష్యాలున్నాయని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్ల రిగ్గింగ్‌తోనే రామ్మోహన్‌ నాయుడు ఎంపీగా గెలిచారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే తనపై టీడీపీ నాయకులు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులకు చేతగాక తనపై అక్రమ కేసులు పెట్టారని, తాను ఏనాడు భయపడలేదన్నారు. (‘సీఎం జగన్‌ నిర్ణయం వల్లే మా ప్రాంతాల్లో వెలుగులు’)

మరిన్ని వార్తలు