అడ్వొకేట్‌ జనరల్‌గా శ్రీరామ్‌ 

5 Jun, 2019 04:52 IST|Sakshi

నేడు బాధ్యతల స్వీకరణ  

సాక్షి, అమరావతి: రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్‌ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో టీడీపీ హయాంలో ఏజీగా వ్యవహరించిన దమ్మాలపాటి శ్రీనివాస్‌ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం ఉదయం హైకోర్టులో ఏజీగా శ్రీరామ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అడ్వొకేట్‌ జనరల్‌గా శ్రీరామ్‌ను నియమించాలని నిర్ణయించారు. శ్రీరామ్‌ 1969లో జన్మించారు.

1992 ఆగస్టు 27న న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయిన ఆయన మొదట న్యాయవాది సి.వి.రాములు వద్ద పనిచేశారు. రాములు హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తరువాత శ్రీరామ్‌ స్వతంత్రంగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. అనతి కాలంలోనే రాజ్యాంగపరమైన కేసులతో పాటు, సివిల్‌ కేసులు, సర్వీసు వివాదాల కేసులు, విద్యా రంగానికి సంబంధించిన కేసుల్లో మంచి పట్టు సాధించారు. 2009 నుంచి 2011 వరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా శ్రీరామ్‌ వ్యవహరించారు. 

మరిన్ని వార్తలు