శ్రీరాంనగర్‌ను దత్తత తీసుకున్న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’

25 Dec, 2013 02:45 IST|Sakshi

 శ్రీరాంనగర్(మొయినాబాద్), న్యూస్‌లైన్ :
 ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌జీ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ మండల పరిధిలోని శ్రీరాంనగర్ గ్రామాన్ని దత్తత  తీసుకుంది. సంస్థ ప్రతినిధి స్వామి కుమార్ పుష్పరంజన్‌తో పాటు మరో నలుగురు రవిశంకర్‌జీ సేవకులు మంగళవారం శ్రీరాంనగర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో, ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్ల కొరత తదితర సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి స్వామి కుమార్ పుష్పరంజన్ మాట్లాడుతూ శ్రీరాంనగర్ గ్రామాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ దత్తత తీసుకుందని చెప్పారు.
 
  గ్రామంలోని సమస్యలన్నిటినీ పరిష్కరించడంతో పాటు మద్యనిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, యోగా శిక్షణతో అందర్నీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతామని అన్నారు. గ్రామంలో గోశాల నిర్మిస్తామని, సేంద్రియ ఎరువులతో పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. సంస్థ గురించి వివరిస్తూ శ్రీశ్రీ రవిశంకర్‌జీ 1980లో బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ను స్థాపించారని, ప్రస్తుతం ఈ సంస్థ 172 దేశాల్లో విస్తరించి ఉందన్నారు. సంస్థ ద్వారా ఇప్పటివరకు సుమారు 40కోట్ల మందికి లబ్ధి చేకూరిందని చెప్పారు. భారతదేశంలో 75 వేల గ్రామాలను సంస్థ దత్తత తీసుకుందని, 35 వేల పాఠశాలలను స్థాపించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 45 గ్రామాలను దత్తత తీసుకున్నట్లు వివరించారు. రంగారెడ్డి జిల్లాలో పెద్దగోల్కొండ, రామంజపూర్, కొంగరకలాన్ గ్రామాలను ఇప్పటికే దత్తత తీసుకున్నామని, ప్రస్తుతం శ్రీరాంనగర్ గ్రామాన్ని సైతం దత్తత తీసుకున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లో గ్రామాలను దత్తత తీసుకునేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ బృందాలు పర్యటిస్తున్నాయని వెల్లడించారు.
 
 రవిశంకర్‌జీ ఫొటోతో రష్యా మహిళ ప్రచారం
 గ్రామాన్ని సందర్శించిన ప్రతినిధుల బృందంలో ఓ విదేశీ మహిళ ధర్మప్రచారం చేశారు. రష్యాకు చెందిన ఓక్సాన అనే మహిళ శ్రీరాంనగర్‌లో పండిత రవిశంకర్‌జీ ఫొటోను ప్రదర్శిస్తూ హిందూ ధర్మం గురించి గ్రామస్తులకు వివరించారు. క్రైస్తవ మతానికి చెందిన తాను రవిశంకర్‌జీ వద్ద హిందూ ధర్మం గురించి తెలుసుకున్నానని, ఆయన బోధనలతో ప్రభావితమై హిందూ ధర్మాన్నే ఆచరించాలని నిర్ణయించుకున్నానని ఆమె తెలిపారు.
 
 గ్రామస్తుల ఘనంగా స్వాగతం
 అంతకుముందు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులకు శ్రీరాంనగర్ గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. కుమార్ పుష్పరంజన్ స్వామికి పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమంలో సర్పంచ్ సన్‌వల్లి ప్రభాకర్‌రెడ్డి, నాయకుడు జంగారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు