బహుముఖ ప్రజ్ఞకు దర్పణం

7 Jul, 2015 00:39 IST|Sakshi
బహుముఖ ప్రజ్ఞకు దర్పణం

ఈతరం  ప్రజా ప్రతినిధులకు మార్గదర్శకుడు భాట్టం
 

విశాఖపట్నం/మహారాణిపేట :దాదాపు ఆరు దశాబ్దాల పాటు రాజకీయాల్లో రాణించారు. ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. వాటి పరిష్కారానికి చట్టసభల్లో గళమెత్తి వాటి పరిష్కారానికి కృషి చేశారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ తరం ప్రజాప్రతినిధులకు మార్గదర్శకంగా నిలిచారు.. భాట్టం శ్రీరామ్మూర్తి! తన క్రియాశీలత, రాజకీయ చతురత, ప్రతిభతో నలుగురు ముఖ్యమంత్రుల (పీవీ నరసింహారావు, టి. అంజయ్య, జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి) మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇరవయ్యేళ్ల పాటు అమాత్య పదవుల్లో కొనసాగారు. తొలినాళ్లలో విశాఖపట్నం జిల్లాలోనే కొనసాగుతున్న విజయనగరం జిల్లాలో అక్కడ రాజులు, విశాఖ జిల్లాలో ఆధిపత్యంలో ఉన్న తంగేడు రాజుల ప్రాబల్యాన్ని తట్టుకుని నిలబడగలిగారు. పాతికేళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్న ఆయనకు 1984లో అనూహ్యంగా అప్పటి సీఎం ఎన్టీఆర్ విశాఖ ఎంపీ సీటిచ్చారు.

లోక్‌సభలో అడుగుపెట్టాక ఆయన విశాఖకు సంబంధించిన సమస్యలను లేవనెత్తారు. అప్పటికే విశాఖను పట్టిపీడిస్తున్న పరిశ్రమల కాలుష్య భూతంపై సమగ్ర సమాచారంతో 1985 ఫిబ్రవరిలోనే ప్రధాని రాజీవ్‌గాంధీ దృష్టికి తెచ్చారు. ఉక్కు నిర్వాసితులకు ఉపాధి, అల్యూమినా ప్లాంటు ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు, ఏలేరు రిజర్వాయరు ప్రాజెక్టుకు క్లియరెన్స్, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు స్పెషల్ గ్రాంటు తదితర అంశాలపై లోక్‌సభలో తన వాణి వినిపించారు. దశాబ్దన్నర కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. భాట్టానికి సత్యసాయిబాబాపై అమితమైన భక్తిభావం. అందుకే ఆయన కొన్నేళ్ల పాటు ఆయన సన్నిధిలోనే గడిపారు.
 
రచనలంటే ఇష్టం..
 శ్రీరామ్మూర్తికి రచనలంటే ఇష్టం. తొలినాళ్లలో పత్రికా ఉప సంపాదకునిగా, సంపాదకునిగాను పనిచేశారు. తెలుగులో నాలుగు పుస్తకాలు కూడా రాశారు. స్వేచ్ఛాభారతం పేరిట స్వీయ చరిత్రను, మైసెల్ఫ్ ఇన్ పార్లమెంట్ పేరుతో ఇంగ్లిష్ పుస్తకాలను ప్రచురించారు.
 
కులాంతర వివాహం..

 సోషలిస్టు భావాలున్న శ్రీరామ్మూర్తి కులాంతర వివాహం చేసుకున్నారు. తాను విజయనగరంలో కాలేజి చైర్మన్ పదవికి పోటీ పడుతున్న సమయంలో క్లాస్‌మేట్ సత్యవతిని ఇష్టపడ్డారు. కొన్నాళ్ల తర్వాత రాజమండ్రిలో ఆమెను  ఆదర్శ వివాహమాడానని తాను రచించిన స్వేచ్ఛాభారతంలో రాశారు. అయితే ఏడాదిన్నర క్రితమే ఆయనను విడిచి ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. కుమారుడి వద్ద ఉంటున్న ఆయన కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం కన్నుమూసి తాను అమితంగా ప్రేమించే జీవిత భాగస్వామి వద్దకు పయనమయ్యారు.

 ప్రముఖుల నివాళులు
 శ్రీరామ్మూర్తి మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు పాండురంగాపురంలోని ఆయన స్వగృహానికి చేరుకుని ఆయన పార్ధివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ శర్మ, ఎమ్మెల్యేలు పెతకంశెట్టి గణబాబు, పీలా గోవింద సత్యన్నారాయణ, బండారు సత్యనారాయణ మూర్తి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, సమన్వయకర్తలు మళ్ల విజయ్‌ప్రసాద్, తైనాల విజయ్‌కుమార్, సీఈసీ సభ్యుడు శ్రీకాంత్‌రాజు, నగర యువజన విభాగం అధ్యక్షుడు విల్లూరి భాస్కర్రావు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహ్మాన్, మాజీ ఎంపీలు కొణతాల రామకృష్ణ, సబ్బంహరి, మాజీ మేయర్ రాజాన రమణి భాట్టంకు నివాళులు అర్పించారు.  జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, సీహెచ్.అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, సీపీఐ నేతలు పైడిరాజు, వామనమూర్తి, తదితరులు భాట్టం మృతికి సంతాపం తెలిపారు.
 
సత్యసాయి సేవలో...
ఎంవీపీకాలనీ : స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీమంత్రి భాట్టం శ్రీరాంమూర్తి మృతి భారతదేశానికి తీరనిలోటు అని శ్రీసత్యసాయిసేవ సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జె.చలం అన్నారు. ఎంవీపీ కాలనీలోని సత్యసాయిసేవ సదన్‌లోని సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో అయన మాట్లాడుతూ బాబా ఆలోచనలతో పేదలకు సేవ చేశామన్నారు. భాట్టం 50 సంవత్సరాలుగా బాబా భక్తునిగా  ఉన్నారని అన్నారు. రాజకీయాల్లో ఎంతో ఎదిగి, ప్రజలకు సేవ చేసి ఆధ్యాత్మిక జీవితం కొనసాగించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వి.ఆర్. నాగేశ్వరరావు, నగర కన్వీనర్ పి.ఆర్.ఎస్.ఎన్.నాయుడు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు