శ్రీశైలం గేట్ల ఎత్తివేత

2 Sep, 2014 02:06 IST|Sakshi

శ్రీశైలం ప్రాజెక్టు: ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం జలాశయం దాదాపు పూర్తిస్థారుు నీటిమట్టానికి (885 అడుగులు) చేరుకుంది. సోమవారం ఉదయం 7.10 గంటలకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణమ్మకు పూజలు నిర్వహించి, వాయనం సమర్పించారు. అనంతరం నాలుగు రేడియల్ క్రస్ట్ గేట్లను తెరచి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్‌కు 1,97,100 క్యూసెక్కుల నీరు వస్తుండగా 1,96,627 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
 
 మహబూబ్‌నగర్ జిల్లా జూరాల జలాశయం 16 క్రస్టుగేట్ల ద్వారా 1.53 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ద్వారా 1,12,312 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన ద్వారా 75,563 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 8,052 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 700 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో గరిష్ట స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలుగా ఉంది. కార్యక్రమంలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, అచ్చంపేట, బనగానపల్లె, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇన్‌ఫ్లో పెరిగితే మరికొన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు తెలిపారు.

మరిన్ని వార్తలు