హంస వాహనాధీశా.. హరోం హర

17 Feb, 2020 08:16 IST|Sakshi

వైభవోపేతంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు

హంస వాహనంపై ఊరేగిన స్వామివారు

పులకించిపోతున్న భక్తజనం

ప్రతిధ్వనిస్తున్న ఓంకార నాదం

సాక్షి, శ్రీశైలం: శ్రీగిరి కొండలు శివ నామస్మరణతో ప్రతిధ్వనిస్తుండగా.. శ్రీశైల క్షేత్రం బ్రహ్మోత్సవ కాంతులతో  కళకళ లాడుతుండగా.. దేవేరి భ్రామరితో కలసి మల్లన్న మందస్మిత దరహాస వీచికలతో హంస వాహనంపై కనులపండువగా దర్శనమివ్వగా.. హంస వాహనాధీశా.. హరోం.. హర అంటూ శివ స్వాములు ప్రణమిల్లారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు ఆదివారం రాత్రి శ్రీభ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునస్వామి  హంస వాహనంపై విశేష వాహన పూజలు అందుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం వద్ద ఉన్న అక్కమహాదేవి అలంకార మండపంలో రాత్రి 7.30 గంటలకు హంస వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక అలంకార పూజలు, వాహన, వింజామర సేవలను వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు, వేదపండితులు పండితులు నిర్వహించారు.

మంగళవాయిద్యాలు మారుమోగుతుండగా, భక్తులు పంచాక్షరి నామస్మరణ చేస్తున్న సమయాన హంసవాహనాధీశులైన స్వామివార్లను ఆలయ ప్రదక్షిణ చేయించి ఆలయప్రాకార ప్రధాన రాజగోపురం మీదుగా రథశాల వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ప్రధాన పురవీధిలోని అంకాలమ్మ గుడి, నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం జరిగింది. అక్కడి నుంచి నేరుగా స్వామి అమ్మవార్ల ఆలయ ప్రాంగణం చేరుకుంది. వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలనర్పించారు. శివరాత్రి రోజు జరిగే బ్రహ్మోత్సవ కల్యాణానికి మొదటిసారిగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరపున ఈఓ సురేష్‌బాబు దంపతులు ఆదివారం రాత్రి పట్టువస్త్రాలను సమర్పించారు. స్వామి అమ్మవార్లకు ఫలపుష్పాదులు, పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, గాజులుతో కూడిన పళ్లాలను తలపై పెట్టుకుని ఆలయప్రదక్షిణ చేసి సమర్పించారు.  

నేడు శ్రీశైలంలో.. 
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను మయూర వాహనంపై ఉంచి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనాధీశులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలు చేస్తారు. వాహన సమేతులైన స్వామిఅమ్మవార్లను రథశాల నుంచి నందిమండపం, అంకాలమ్మ గుడి, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఊరేగిస్తారు. కాగా సోమవారం జరిగే ప్రత్యేక పూజల్లో భాగంగా ఉదయం 7.30 గంటలకు నిత్యహోమ బలిహరణలు, జపానుష్టానములు, నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివార్లకు విశేషార్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు చేస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి నిత్యపూజలు  చేపడతారు. 

టీటీడీ తరపున పట్టువస్త్రాల సమర్పణ 
మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కల్యాణమూర్తులకు సోమవారం తిరుమల, తిరుపతి దేవస్థానం తరపున పట్టువస్త్రాలను సమర్పిస్తారు. గత కొన్నేళ్లుగా టీటీడీ దేవస్థానం తరపున శ్రీశైలంలో జరిగే  శివరాత్రి, దసరా ఉత్సవాలకు పట్టువస్త్రాలను సమర్పించడం 
సంప్రదాయంగా వస్తోంది.

కళా నీరాజనం
బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామోత్సవంలో కళాకారుల అమోఘంగా తమ కళలను ప్రదర్శించడంతో భక్తులు పులకించిపోయారు. తప్పెట చిందులు, కోలాటం, డోలు కళాకారుల విన్యాసాలు, చెంచు గిరిజనుల నృత్యప్రదర్శన, గొరవయ్యల ఈల పాటల నృత్యాలు, కేరళ నృత్యం  తదితర సాంస్కృతిక కార్యక్రమాలన్ని భక్తులను తమ అలసటను మరిచిపోయేలా చేశాయి.

మరిన్ని వార్తలు