మల్లన్న పూజా వేళల్లో మార్పు

21 Oct, 2017 03:46 IST|Sakshi

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీకమాసం సందర్భంగా రద్దీ రోజుల్లో మల్లన్న పూజావేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఈవో నారాయణ భరత్‌గుప్త శుక్రవారం చెప్పారు. ఇందులో భాగంగా నవంబర్‌ 18లోపు  ప్రతి కార్తీక శని, ఆది, సోమవారాలతో పాటు కార్తీక శుద్ధ ఏకాదశి, కార్తీక పౌర్ణమి, ప్రభుత్వ సెలవు రోజుల్లో ఆలయ పూజా వేళల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. ఆయా రోజుల్లో వేకువజామున 2.30 గంటలకు మంగళవాయిద్యాలు, 2.45కు సుప్రభాత సేవ, 3 గంటలకు మహామంగళ హారతి, 3.30 గంటల నుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. 

రద్దీ రోజుల్లో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించేందుకు స్వామి, అమ్మవార్ల సుప్రభాత, మహామంగళహారతి సేవల ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఈవో ప్రకటించారు. కార్తీకమాసం సందర్భంగా ఈ ఏడాది రద్దీ రోజుల్లోనూ ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు.  శ్రీశైలం ఆలయ వెబ్‌సైట్‌ www.srisailamonline.com ద్వారా ముందస్తు టికెట్లను భక్తులు కొనుగోలు చేయవచ్చని సూచించారు.

మరిన్ని వార్తలు