శ్రీవారి వైభవాన్ని వెలుగులోకి తెచ్చిన ‘సాధు’

11 Sep, 2014 01:17 IST|Sakshi
శ్రీవారి వైభవాన్ని వెలుగులోకి తెచ్చిన ‘సాధు’

యూనివర్సిటీక్యాంపస్: టీటీడీలో పని చేసి, అన్నమయ్య సంకీర్తనలను వెలుగులోకి తెచ్చిన పండితులు, పరిశోధకులు సాధు సుబ్రమణ్యశాస్త్రి సేవలను టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. సాధు సుబ్రమణ్యం శాస్త్రి 30వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక శ్వేత భవనం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉన్నారు.

ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ సాధు సుబ్రమణ్యం శాస్త్రి తమిళనాడు ప్రాంతానికి చెందినవారని, 1920-30 సంవత్సరాల మధ్య డెప్యుటేషన్‌పై శ్రీవారి ఆలయ ఇన్‌స్పెక్టర్‌గా వచ్చారన్నారు. ఈ సమయంలో ఆయన శ్రీవారిపై అన్నమయ్య రాసిన సంకీర్తనల రాగిరేకులను వెలుగులోకి తెచ్చి పరిశోధనలు చేశారన్నారు. అన్నమయ్య కీర్తనల్లోని భక్తితత్వాన్ని, శ్రీవారి వైభవాన్ని అందరికీ  తెలిసేలా చేయడంలో ఆయన కృషి ఎంతో ఉందన్నారు.

సాధు సుబ్రమణ్య శాస్త్రి ఎంతో మేధావి అయినప్పటికీ ఆయన్ను ఎవరు గుర్తించలేదని తెలిపారు. ఆయన తన చివరి రోజుల్లో తిరుపతి వీధుల్లో దుర్భర జీవితం గడిపారన్నారు. తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఆయన చేసిన కృషిని గుర్తించి శ్వేత భవనం ఎదుట విగ్రహాన్ని ఏర్పాటు చేశానని చెప్పారు. ఆ సమయంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు హర్ష, రామస్వామి వెంకటేశు, దుద్దేల బాబు, కట్టా గోపియాదవ్, మోహన్, బొమ్మగుంట రవి, గౌరి, చాను పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు